ఎందాకా ఈ పరుగు?!
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో స్టేషన్‌లో ఒకతను దీక్షగా వయొలిన్ వాయిస్తున్నాడు. రైల్వేస్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుగా! హడా వుడి, గందరగోళం, వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లు, ఎవరికీ క్షణం కూడా నిలబడే తీరిక లేదు. అందరూ పరుగెడుతున్నారు. అలా పరుగెడు తున్న వాళ్లలో ఒకతను మాత్రం ఎక్కడి నుంచో సంగీతం వినిపి స్తోందని కాసేపు అక్కడే ఆగి అటూఇటూ చూసి, మళ్లీ తన షెడ్యూల్ గుర్తుకొచ్చి పరుగెత్తాడు. అందరిదీ అదే స్థితి. పరుగులూ... ఉరకలూ!
ఇంతలో మూడేళ్ల పిల్లాడొకడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. వాళ్ల అమ్మ వాణ్ణి నిలబడనివ్వలేదు. రెక్కపుచ్చుకొని ముందుకు లాక్కుపోయింది. ఇతర తల్లులూ తమ పిల్లల్ని అలాగే తీసుకుపో తున్నారు. అప్పటికి నలభై అయిదు నిమిషాలైంది. నిర్విరామంగా అతను వయొలిన్ వాయిస్తూనే ఉన్నాడు. కానీ, నిదానంగా విన్న వాళ్లని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. వారిలో డబ్బులిచ్చినవారూ తక్కు వే. అంతా లెక్కపెడితే యాభైడాలర్లు దాటవు! మరో పదిహేను నిమిషాల తర్వాత వయొలిన్ వాయించడం ఆపు చేశాడు. సంగీ తం నిలిచిపోయి నిశ్శబ్దం ఆవహించింది. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.
ఎవరికీ తెలియని విషయమేమిటో చెప్పానా, అప్పటివరకూ మెట్రో రైల్వేస్టేషన్‌లో వయొలిన్ వాద్యం వినిపించింది జోషుయా బెన్ - ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడు. అత్యంత అధునాతనమైన వయొలిన్‌మీద చాలా క్లిష్టమైన సంగీత స్వరాల నూ, రాగాలనూ, గమకాలనూ అద్భుతంగా మనోజ్ఞంగా వినిపిం చాడు. రెండురోజుల తరువాత బోస్టన్ లో అతని సంగీతకచేరీ ఏర్పాటు చేస్తే అదే సంగీతాన్ని వినడానికి జనం వెర్రిగా ఎగబడ్డా రు. టికెట్టు కోసం తన్నుకున్నారు. ‘థియేటర్ ఫుల్ అయ్యింది, సీట్లు లేవు మహాప్రభో’ అంటే ఫరవాలేదు... నిలబడి వింటామన్నారు.
ఇదేదో కల్పించి చెబుతున్న కథకాదు. నిజంగా జరిగింది. జోషుయా పేరు ప్రకటించకుండా సాదాసీదాగా ఒక సాధారణ కళాకారుడిగా ఆయన వయొలిన్ వాయిస్తే ప్రజలు ఏ మేరకు ఆస్వాదిస్తారో చూడాలన్న కుతూహలం ‘వాషింగ్టన్ పోస్ట్’కు కలి గింది. ఈ క్రమంలో ప్రజల ప్రాధాన్యాలు, అభిరుచులు, అవగా హన, స్పందన తెలుసుకోవచ్చని కూడా ఈ ప్రయోగం చేసింది. దీనితో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బహిరంగ ప్రదేశంలో, అనువు గాని సమయంలో మనం అందాన్ని, తీయదనాన్ని ఆస్వాదించ గలమా? అభినందించగలమా? అతని ప్రతిభను, ప్రావీణ్యాన్ని గుర్తించగలుగుతామా? ఏమో!
అవన్నీ ఎలావున్నా నాకు మాత్రం ఒకటనిపిస్తోంది. ఒక అద్భుతమైన కళాకారుడు నిర్మలమైన, మధురమైన, మనోహర మైన తన దివ్య సంగీతంలో పరిసరాలను ముంచెత్తుతుంటే క్షణం కూడా నిలబడి వినేందుకు మనకు తీరిక లేదంటే ఈ ప్రవహించే జీవన వాహినిలో పరుగులిడే చక్రాలమధ్య ఏది వింటున్నామో, ఏది తింటున్నామో, ఏది చూస్తున్నామో, ఏది ఆస్వాదిస్తున్నామో తెలియకుండా ఎన్ని అందాలను, ఎన్ని సౌందర్యాలను, ఎన్ని మధురిమలను, ఎన్ని సౌకర్యాలను ఎన్ని రంగుల్ని, ఎన్ని కాంతుల్ని మనం మిస్ అవుతున్నామో కదా అని దిగులేస్తోంది!
ఒకే జీవితం అనేక అందాలు, తనివి తీరా ఇప్పుడే ఆస్వాదించండి. జీవితానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంది.
-ప్రయాగ రామకృష్ణ