సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు.
తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు.
ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు.
ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు.
కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు.
మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment