
కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు ప్రాజెక్టులన్నింటి గేట్లు ఎత్తివేత
గోదావరిలోనూ సింగూరు నుంచి ధవళేశ్వరం వరకు ప్రాజెక్టులన్నింటి గేట్లు బార్లా
సోమవారం తెరుచుకున్న నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్ గేట్లు
సాక్షి, హైదరాబాద్: బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గలగలా గోదావరి ఉరుకులు పరుగులు పెడుతోంది. కృష్ణా పరీవాహకంలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు.. గోదావరి పరీవాహకంలో సింగూరు నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ఉభయ నదులు స్వేచ్ఛగా పరుగెడుతూ కడలిలో కలిసిపోతున్నాయి. కృష్ణా పరీవాహకంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టులోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.79 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు.
జూరాల, తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలంకు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం సాయంత్రం శ్రీశైలం జలాశయానికి 3.29 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లను 12 అడుగుల మేర పైకెత్తి 4.03 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విద్యుదుత్పత్తి ద్వారా మరో 66,099 క్యూసెక్కులను విడుదల చేస్తుండడంతో సాగర్‌లోకి 3.05 లక్షల క్యూసెక్కులకు వరద చేరుతోంది.
సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 299.74 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 26 గేట్లను పైకెత్తి 2.25లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 28,826 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం 2.47 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 10 గేట్లను పైకెత్తి 2.93 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 16 వేల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.
ఉగ్ర గోదావరి...
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, నిల్వలు 97.86 టీఎంసీలకు చేరాయి. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకి 36,309 క్యూసెక్కుల వరద వస్తుండగా, 19.6 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 40,821 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 95,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 14.98 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 1.25లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్‌సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకి 1.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 72.99 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లను పైకెత్తి 2 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 34,493 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.61 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ, 34,194 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
దిగువన ఉన్న ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 15.78 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 1.69 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సుందిళ్ల బరాజ్‌కి 1.59 లక్షలు, అన్నారం బరాజ్‌కి 6905 క్యూసెక్కులు, మేడిగడ్డ బరాజ్‌కి 4.29 లక్షల క్యూసెక్కులు, సమ్మక్కబరాజ్‌కి 4.98 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ బరాజ్‌కి 5.87 లక్షల క్యూసెక్కల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు.