సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం తన బడ్జెట్‌లో రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంత తాగు, సాగునీటి వసతిని కల్పించే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియకు అత్యం త ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర ఆమోదం లభించిన ఈ నదుల అనుసంధానానికి 2002–23 వార్షిక బడ్జెట్‌లో రూ.1,400 కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించింది.
మంగళవారం లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగంలో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాం. దీని ద్వారా 9.05 లక్షల హెక్టార్ల రైతుల భూములకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది.
దీనికై 2022–23లో రూ.1,400 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాం’అని పేర్కొన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి నీటి కొరత ఎదుర్కొంటున్న బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరనుంది.
గోదావరి – కావేరి అనుసంధాన డీపీఆర్‌లు ఖరారు
మరో ఐదు నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్ర ఆర్ధికమంత్రి కీలక ప్రకటన చేశారు. దామనగంగ–పింజల్, పర్ తాపీ– నర్మద, గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి అనుసంధానం ముసాయిదా డీపీఆర్‌లు ఇప్పటికే ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్రం తోడ్పాటును అందిస్తుందని ప్రకటించారు.
ఇందులో గోదావరి మొదలు కావేరి వరకు జరిగే అనుసంధాన ప్రక్రియ అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేవి. ఇచ్చంపల్లి మీదుగా 247 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌లకు తరలించి అటు నుంచి సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్‌కి తరలించే ప్రణాళికను కేంద్రం రూ.85,962 కోట్లతో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ద్వారా 9.35 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందని తెలిపింది.
గోదావరి–కావేరి అనుసంధానంపై పరీవాహక రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే కార్యాచరణను ఇప్పటికే జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ చేపట్టింది. నదీ జలాల లభ్యత, నీటి కేటాయింపులు, మళ్లింపు అంశాలపై అన్ని రాష్ట్రాలను ఒప్పించి త్వరగా అనుసంధాన ప్రతిపాదనను పట్టాలెక్కించే లక్ష్యంతో సంప్రదింపులు చేస్తోంది. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగుతామని ఇదివరకే స్పష్టమైన సంకేతాలిచ్చింది.
ఇదే సమయంలో ‘హర్ ఘర్ నల్ సే జల్’కార్యక్రమం కింద 8.7 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్‌ల ప్రక్రియ పూర్తయిందని, ఈ ఆర్థిక ఏడాదిలో మరో 3.8 కోట్ల ఇళ్లకు నీటిని అందించే లక్ష్యంతో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment