Interlinking of rivers
-
అనుసంధానికి ఆ ఐదు అంశాలే ఆటంకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం వల్లే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మద సహా దేశంలో ప్రాధాన్య నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. కేవలం ఐదు అంశాలు మాత్రమే దీనికి ప్రధాన కారణమని తేల్చింది. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించి.. నదులను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో కలుస్తున్న జలాలను మళ్లించి దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందిస్తూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశామని.. కెన్–బెట్వా తరహాలోనే మిగతా ప్రాధాన్యత నదుల అనుసంధానం ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఎంపీ పర్‌భాత్‌భాయ్ సవాభాయ్ పటేల్ అధ్యక్షతన జల వనరుల విభాగంపై 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బడ్జెట్ కేటాయింపులు, వినియోగం, పనుల ప్రగతిని సమీక్షించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల నివేదిక ఇచ్చింది. కెన్–బెట్వా తరహాలోనే చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయంతోనే కెన్–బెట్వా నదుల అనుసంధానం చేపట్టామని పేర్కొంది. ఆ నదుల అనుసంధానం తొలి దశ పనులకు 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని, ఇందులో 90 శాతం అంటే రూ.39,317 కోట్లు కేంద్రం సమకూర్చుతోందని వెల్లడించింది. మిగతా 10శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సమకూర్చుతాయంది. ఇదే రీతిలో ప్రాధాన్యత నదుల అనుసంధానం పనులను చేపడతామని హామీ ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా ఐదు అంశాలు అడ్డంకిగా మారాయి. ► రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ–నిర్వాసితులకు పునరావాసం కల్పన అంశాలు నదుల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలు. ► ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తే నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది. ► నిధుల్లో సింహభాగం వాటాను కేంద్రం ఇవ్వడం, పన్ను రాయితీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను నదుల అనుసంధానానికి ఒప్పించవచ్చు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానంపై పీఠముడి ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నదుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదించింది. ఆవిరి నష్టాలు పోనూ మూడు రాష్ట్రాలకు 80 టీఎంసీల చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పనులకు రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రతిపాదనపై ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు నీటిని ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో ఇచ్చంపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు 40 టీఎంసీల చొప్పున, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది. ఈ పనులకు రూ.45 వేల కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టింది. దీన్ని కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోదావరిలో నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కేంద్రానికి తేల్చి చెప్పాయి. -
Budget 2022: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం తన బడ్జెట్లో రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంత తాగు, సాగునీటి వసతిని కల్పించే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియకు అత్యం త ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్లో కేంద్ర ఆమోదం లభించిన ఈ నదుల అనుసంధానానికి 2002–23 వార్షిక బడ్జెట్లో రూ.1,400 కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగంలో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాం. దీని ద్వారా 9.05 లక్షల హెక్టార్ల రైతుల భూములకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. దీనికై 2022–23లో రూ.1,400 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాం’అని పేర్కొన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి నీటి కొరత ఎదుర్కొంటున్న బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరనుంది. గోదావరి – కావేరి అనుసంధాన డీపీఆర్‌లు ఖరారు మరో ఐదు నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్ర ఆర్ధికమంత్రి కీలక ప్రకటన చేశారు. దామనగంగ–పింజల్, పర్ తాపీ– నర్మద, గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి అనుసంధానం ముసాయిదా డీపీఆర్‌లు ఇప్పటికే ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్రం తోడ్పాటును అందిస్తుందని ప్రకటించారు. ఇందులో గోదావరి మొదలు కావేరి వరకు జరిగే అనుసంధాన ప్రక్రియ అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేవి. ఇచ్చంపల్లి మీదుగా 247 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌లకు తరలించి అటు నుంచి సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్కి తరలించే ప్రణాళికను కేంద్రం రూ.85,962 కోట్లతో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ద్వారా 9.35 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందని తెలిపింది. గోదావరి–కావేరి అనుసంధానంపై పరీవాహక రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే కార్యాచరణను ఇప్పటికే జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ చేపట్టింది. నదీ జలాల లభ్యత, నీటి కేటాయింపులు, మళ్లింపు అంశాలపై అన్ని రాష్ట్రాలను ఒప్పించి త్వరగా అనుసంధాన ప్రతిపాదనను పట్టాలెక్కించే లక్ష్యంతో సంప్రదింపులు చేస్తోంది. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగుతామని ఇదివరకే స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇదే సమయంలో ‘హర్ ఘర్ నల్ సే జల్’కార్యక్రమం కింద 8.7 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్ల ప్రక్రియ పూర్తయిందని, ఈ ఆర్థిక ఏడాదిలో మరో 3.8 కోట్ల ఇళ్లకు నీటిని అందించే లక్ష్యంతో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
AP: గోదావరి–పెన్నా అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో నిర్వహించే జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో నదుల అనుసంధాన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొంటారు. తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలకు తరలించి.. కావేరి గ్రాండ్ ఆనకట్టలోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదులను అనుసంధానం చేసేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించింది. ఈ డీపీఆర్‌పై ఆ నదీ పరీవాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. గోదావరిలో మిగులు జలాలే లేవని.. ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చాక మిగిలిన నీటినే కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) లెక్కలకు పొంతన లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని సూచించింది. గోదావరి నుంచి తరలించే నీటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఆయకట్టుకు నీళ్లందిస్తారో స్పష్టంగా చెప్పాలని సూచిస్తూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అధికారులు మరోసారి కేంద్రానికి వివరించనున్నారు. -
నదీ రుణాన్ని తీర్చుకోవాలి
- పుష్కర ఏర్పాట్లు బాగా చేశాం - నదుల అనుసంధానం కోసం మహాసంకల్పం - వర్షపునీటిని భూగర్బ జలాలుగా మార్చండి - సాక్షిపై అక్కసు సాక్షి , అమరావతి ‘మనకు నది నీళ్లు, సంపద అన్నీ ఇస్తుంది. అలాంటి నదికి మనం రుణం తీర్చుకోవాలి’-అని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో మంగళవారం మధ్యాహ్నం ధ్యాన బుద్ద ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం కృష్ణావేణి విగ్రహానికి పూలమాలవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేసి కృష్ణమ్మ చెంతకు గోదావరిని చేర్చామన్నారు. ఇప్పుడు ఆ రెండు నదులు కలిసే పవిత్ర సంగమం వద్దనే హారతిని ఇస్తున్నామన్నారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా మహా సంకల్పం చేస్తున్నామని, కృష్ణ నుంచి గోదావరి నీళ్లు పెన్నాలో కలిపి నదుల అనుసంధానం చేస్తామని తెలిపారు. మీ ప్రాంతాల్లో వర్షపునీటిని భూగర్బ జలాలుగా మార్చుకునేందుకు చెరువుల్లో పూడిక తీతలు, ఫాంపాండ్స్ తవ్వి, వాటిని భూగర్బ జలాలుగా మారిస్తే కరువు ఉండదన్నారు. మన జీవితంలో వెలుగు నిచ్చే నదులకు కృతజ్ఞతతో ఉండాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర స్నానాల ప్రచారం చేయాలన్నారు. స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ముందుకు వచ్చి పలుచోట్ల భోజనాలు పెడుతున్నారని, ఇది బ్రహ్మాండమైన స్ఫూర్తి అని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన యువకులు, పోలీసులు, అధికారులు చక్కగా పనిచేస్తున్నారని కితాబునిచ్చాడు. నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.... స్విమ్మింగ్ పూల్‌లో కెమికల్స్ కలుపుతున్నారు. ఇక్కడ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.. ప్రతిఒక్కరూ పుష్కర స్నానం చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.నదిలో స్నానం చేస్తే పుణ్యం పురుషార్థం వస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఉత్సాహంగా సెల్ఫీలు తీస్తున్నారని తెలిపారు. ఫేస్బుక్, యూట్యూబ్,వాట్సప్, ఇంటర్నెట్,మెసెజ్‌ల రూపంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పుష్కరాలను వినూత్న రీతిలో డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. మరుగు దొడ్లను సైతం ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పుష్కర ఏర్పాట్లు పక్కాగా చేశామని తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని పనులు అవుతాయన్నారు. సాక్షిపై అక్కసు ‘సాక్షి లాంటి పత్రిక కూడా పుష్కరాల ఏర్పాట్లపై వ్యతిరేకంగా వార్తలు రాయలేక పోతోంది... రాసినా దానిని పట్టించుకోవద్దు.. ఒక వేళ వ్యతిరేకంగా రాస్తే ఆ పేపరు చదవటం మానేయండి... అప్పుడు బుద్ధి వస్తుంది’అని సాక్షి పత్రికపై బాబు తన ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాగా, తన పర్యటన సందర్భంగా ఇక్కడి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు విగ్రహానికి బాబు పూలమాల వేశారు. నమూనా ఆలయాలను సందర్శించి, జరుగుతున్న చండీయాగాన్ని దర్శించుకున్నారు. ఈ పరిశీలనలో మంత్రులు చిన్నరాజప్ప, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు,ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నదుల అనుసంధానం కోసం సైకిల్ యాత్ర
► 2300 కిలోమీటర్ల యాత్ర చేపట్టిన వృద్ధుడు మేడ్చల్:గంగా-కావేరి నదులను అనుసంధానం చేసి ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేయాలని కోరుతూ ఓ వృద్ధుడు సాహసోపేతమైన కార్యానికి శ్రీకారం చుట్టారు. నదుల అనుసంధానంకోసం వృద్ధాప్యంలోనూ దేశవ్యాప్తంగా సైకిల్యాత్రచేపట్టారు. రామేశ్వరం నుండి సైకిల్ యాత్రను ప్రారంభించిన కృష్ణన్(82)తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లా పెరియనాయబాలయమ్కు చెందిన వ్యక్తి. ఈయన సైకిల్ యాత్రలో భాగంగా గురువారం నాటికి 1500 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. గురువారం రాత్రి శామీర్‌పేట్ మండలం దేవరయాంజాల్‌కు చేరుకుని కృష్ణ సదనమ్ వృధ్ధాశ్రమంలో రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా కృష్ణన్ ‘సాక్షి’తో మాట్లాడారు. గంగా-కావేరి నదులను అనుసంధానం చేయడం ద్వారా నీటి సమస్యలు తీరడంతో పాటు సాగుకు నీరు పుష్కలంగా లభ్యమవుతాయన్నారు. ప్రతిరోజు 25 కిలోమీటర్లు సైకిల్‌పై యాత్ర చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో డిల్లీ నగరానికి చేరుకుంటుం దని వివరించారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి ఈ నదుల అనుసంధానం వల్ల కలిగే లాభాలు, దాని ప్రాధాన్యతను వివరిస్తానని తెలిపారు. తాను యాత్రను రెండోసారి చేస్తున్నానని 2000 సంవత్సరంలో కూడా యాత్ర చేశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అనేక పనులు చేపడుతుంది కానీ గంగా-కావేరీ నదులను అనుసంధానం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మహా’ ఉత్కంఠ!
- మహానది-గోదావరిల అనుసంధానంపై రేపు ఢిల్లీలో కీలక భేటీ - అనుసంధాన ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ఒడిశా - గోదావరిలో మిగులు జలాల లభ్యత పునఃపరిశీలించాలంటున్న తెలంగాణ - మహానదిలో 180 టీఎంసీల మిగులు జలాలున్నాయంటున్న ఎన్డీడబ్ల్యూఏ - కీలకంగా మారనున్న కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నదుల అనుసంధానంపై విధాన రూపకల్పన ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. నదీ జలాల లభ్యతపై కేంద్రం చెబుతున్న లెక్కలకు, రాష్ట్రాలు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరట్లేదు. దీంతో ఈ అంశంపై మళ్లీ పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండటం అనుసంధాన ప్రక్రియకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మహానది-గోదావరి నదుల అనుసంధానాన్ని ఒడిశా తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా గోదావరిలో మిగులు జలాల లభ్యతను పునఃపరిశీలించాకే ఏ కార్యాచరణకైనా పూనుకోవాలని తెలంగాణ రాష్ట్రం కోరడం కేంద్రాన్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ మహానది-గోదావరిల అనుసంధానంపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అనుసంధానానికి అనేక అభ్యంతరాలు... మహానదిలో ఒడిశా అవసరాలుపోనూ మరో 180 టీఎంసీల మిగులు జలాలున్నాయని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చెబుతోంది. అయితే మహానదిలో మిగులు జలాలపై ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ శర్మతో కూడిన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు ఒడిశా తన అభ్యంతరాలను వివరించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పినట్లుగా మహానదిలో 180 టీఎంసీల అదనపు జలాలు లేవని, ఉన్న కొద్దిపాటి జలాలు తమ భవిష్యత్తు అవసరాలకే సరిపోతాయని పేర్కొంది. ఎన్‌డబ్ల్యూడీఏ గతంలోనే మహానదిపై భారీ డ్యామ్‌ను ప్రతిపాదించగా ముంపు ఎక్కువగా ఉన్న దృష్ట్యా దాని బదులు ఐదారు చిన్న బ్యారేజీలు కట్టాలని ఒడిశా ప్రతిపాదించింది. దీన్ని ఎన్‌డబ్ల్యూడీఏ వ్యతిరేకిస్తోంది. బ్యారేజీల నిర్మాణంతో ఒడిశాలో ముంపు ప్రాంతాలు తగ్గినా ఆశించిన మేర నీరు దిగువ ప్రాంతాలకు రాదని చెబుతోంది. దీంతో సందిగ్ధంలో పడిన కేంద్రం నీటి లభ్యతపై పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని ఇరుపక్షాలను ఆదేశించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో ఒడిశా, ఎన్డబ్ల్యూడీఏల నివేదికపై చ ర్చించనుంది. గోదావరికి సంబంధించిన అంశం కావడంతో గోదావరిలో అదనపు జలాల లభ్యత వివరాలతో తెలంగాణ సైతం హాజరుకావాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రం నుంచి నీటిపారుదలశాఖ అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. తమ ప్రయోజనాలు పూర్తయ్యాకే అదనపు జలాలను తరలించాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. గోదావరిలో లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతాయని, 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనం ఆధారంగా గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంటోంది. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలకంగా మారనుంది. -
అలా చెప్పుకోవడానికి సిగ్గులేదా?
నదుల అనుసంధానమని గొప్పలా? సీఎంను నిలదీసిన జ్యోతుల నెహ్రూ హైదరాబాద్: నదుల అనుసంధానం తానే చేశానని గొప్పలు చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబుకు సిగ్గులేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమనేది చంద్రబాబు చిరకాల కోరికని సాగునీటిశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటపుడు తన తొమ్మిదేళ్ల పాలన(1995-2004)లో సీఎం కనీసం ఆలోచనలు కూడా చేయలేదెందుకని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు చెప్పి రాష్ట్రప్రజల్ని మభ్య పెట్టేయత్నం చేస్తున్నారని విమర్శించారు. చరిత్ర పుటల్లోకి వెళ్లిచూడండి.. చరిత్ర పుటల్లోకి వెళితే ఆర్థర్ కాటన్ నిర్మించిన గోదావరి బ్యారేజీ కాలువకు, కృష్ణా బ్యారేజీ కాలువ ఏలూరు వద్ద కలుస్తుందని, ఆ కాలువ చాలా రోజులపాటు నావికా అవసరాలకు ఉపయోగపడిందని నెహ్రూ తెలిపారు. 1978లో జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా-చిత్రావతి-కుందూలను కలుపుతూ పెన్నానది అనుసంధానానికిగాను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ సోమశిల, కండలేరును కలుపుకుని తెలుగుగంగ అని పేరు పెట్టారన్నారు. దివంగత వైఎస్ హయాంలో చాలాభాగం పనులు పూర్తయి ఈరోజు సోమశిల డ్యాంలోకి నీరు వస్తోందని తెలిపారు. ఇదంతా నదుల అనుసంధానంతోనే సాధ్యమైందనే విషయం టీడీపీ నేతలకు తెలిసి కూడా ఇప్పుడే చేసినట్లు చెప్పుకోవడం, ఎమ్మెల్యేలు డ్యాన్సులు చేసి డప్పులు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. తాడిపూడిని పూర్తిచేసింది వైఎస్.. తాడిపూడి పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా వదిలేస్తే భారీగా నిధులిచ్చి నిర్మాణం పూర్తిచేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని నెహ్రూ తెలిపారు. ఈ పని చంద్రబాబు చేశానని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు. -
ప్రతి ఎకరాకూ నీరు
సీఎం చంద్రబాబు వెల్లడి పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశం పేద ముస్లింలను ఆదుకుంటానని హామీ విజయవాడ : కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తామని, పంట పొలాల్లో బంగారం పండించే బాధ్యత రైతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. రాజమండ్రిలో పుష్కర పనుల్ని సమీక్షిస్తున్న చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. కొత్తూరు తాడేపల్లిలో అటవీ శాఖ నిర్వహించిన 66వ వన మహోత్సవంలో కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో కలిసి పాల్గొని ‘నగర వనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడంపై ఆసక్తి పెంచుకుంటే రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మొక్కల్ని నాటుతామని, వాటిని పెంచుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పచ్చని చెట్లు నరికి... వనమహోత్సవం కోసం కొత్తూరు తాడేపల్లిలో ఉన్న పచ్చని చెట్లను నరికి.. అక్కడే తిరిగి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖాధికారులు చేపట్టడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. పెద్ద పెద్ద చెట్లను నరికించి రోడ్ల పక్కనే పడేశారు. మొక్కలకు బదులుగా చెట్లనే నాటించడం సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. వందల మంది విద్యార్థుల్ని ఉదయం ఎనిమిది గంటలకు తీసుకువచ్చి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంచడంతో వారు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పోలవరం కుడికాల్వ పనుల పరిశీలన జక్కంపూడి గ్రామ సమీపంలోని 163.25 కిలోమీటరు వద్ద పోలవరం కుడికాల్వ తవ్వకం పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. పలు పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15న పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉన్నందున పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. రాజధానికి నిధులు సాధించాలని సూచన నూతన రాజధానికి సాధించాల్సిన నిధుల కోసం పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై గేట్‌వే హోటల్లో ఆయన ఎంపీలతో సమావేశమై చర్చించారు. రైల్వే జోన్, రైతులకు గిట్టుబాటు ధర, ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం తదితర అంశాలకు పార్లమెంట్లో ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో సూచించారు. తమ సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం ఆందోళన చేపట్టిన మున్సిపల్ కార్మికులను సీఎం గేట్‌వే హోటల్లో కలిసి మాట్లాడారు. కనీస వేతనం పెంచాలనే డిమాండ్‌ను పరిశీలిస్తామన్నారు. ఇఫ్తార్ విందులో సీఎం... రాత్రికి నగరంలోని ఎ-కన్వెక్షన్ సెంటర్లో మైనార్టీ విభాగం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని పేద ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
నికర జలాలు చుక్కకూడా వదులుకోం
* నదుల అనుసంధానంపై కేంద్రానికి స్పష్టం చేసిన తెలంగాణ * కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం * రాష్ట్రం నుంచి వాదనలు వినిపించిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: మహానది-గోదావరి నదుల అనుసంధానంలో తమకు నష్టం జరిగితే ఒప్పుకొనే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం ఢిల్లీలో ఐదోసారి సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ర్టం నుంచి నీటి పారుదలరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యాసాగర్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సమావేశం అనంతరం ఆయన ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘అవసరానికి మంచి ఉన్న నీటిని ఇతర నదులైన కృష్ణా-పెన్నా-కావేరి-వైదేహిలకు మళ్లించేందుకు వీలుగా మహానది-గోదావరి నదుల అనుసంధానం చేయాలని కేంద్రం తలపెట్టింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మహానది విషయంలో తమ దగ్గర మిగులు జలాలు లేవని ఒడిశా చెప్పింది. వారిని ఒప్పించే ప్రయత్నాల్లో కేంద్రం కొన్ని ప్రత్యామ్నాయాలు చూపింది. మహానది నుంచి 230 టీఎంసీలు గోదావరికి వస్తాయి. అవి ధవళేశ్వరం వద్ద కలుస్తాయి. అయితే వచ్చే నీళ్ల కంటే పోయే నీళ్లు ఎక్కువగా ఉంటాయని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ వద్దంది. కానీ ఇప్పుడు విడిపోయాక స్వాగతిస్తోంది. తెలంగాణకు గోదావరిలో మిగులు జలాలు లేవు. కేంద్రం వద్ద ఉన్న లెక్కలు ఎప్పుడో 20, 30 ఏళ్ల కిందటివి. అప్పుడు మేం కట్టిన ప్రాజెక్టులే లేవు. ఇప్పుడు కంతనపల్లి, దేవాదుల తదితర ప్రాజె క్టులన్నీ కడుతున్నాం. అప్పుడు నీళ్ల లభ్యత ఉన్నందున మిగులు అన్నారు. మేం అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టాం. బచావత్ కేటాయింపులను ఒక చుక్క కూడా వదులుకునేది లేదు. పాత లెక్క ప్రకారం 1,440 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని అవార్డు ఇచ్చింది. ఏపీకి సుమారు 500 టీఎంసీలు, తెలంగాణకు 950 టీఎంసీలు వస్తాయి. మా 950 టీఎంసీల వినియోగానికి మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఆ నీళ్లలో ఒక్క చుక్క కూడా తీసుకునేందుకు మేం ఒప్పుకోం. అందరినీ ఒకే గాటన కట్టేస్తే లాభం లేదు. మా కేటాయింపుల నుంచి ఒక్క చుక్క వదలబోం..’ అని వివరించినట్టు విద్యాసాగర్‌రావు తెలిపారు. ‘పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం లేదు’ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలోనే జీవో ఇచ్చారని, అది పాత ప్రాజెక్టేనని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు హక్కుగా ఉన్న జలాలనే ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నమని తెలిపారు. ఏపీ చేపట్టిన పట్టిసీమే కొత్త ప్రాజెక్టని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తాము నదుల అనుసంధానాన్ని స్వాగతిస్తున్నామని, త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందిగా కోరారని సమాచారం. ‘ఏడాది చివరికల్లా కెన్-బెత్వా నదుల అనుసంధానం’ న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కెన్-బెత్వా నదులు అనుసంధాన పనులు మొదలుపెడతామని కేంద్ర నీటి వ నరుల శాఖ సహాయ మంత్రి సన్వార్ లాల్ జాట్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. చట్టపరమైన అనుమతులు రాగానే పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. సోమవారమిక్కడ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మంత్రి అధ్యక్షతన ఐదోసారి సమావేశమైంది. -
నదుల అనుసంధానం... ఆచరణ సాధ్యమేనా?
జలం లేనిదే జనం లేరన్నది జగమెరిగిన సత్యం. భూగ్రహంపై మానవాళి మనుగడకు మూలాధారం నీరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ నీటిలో మనకు ఉపయోగపడేది కేవలం ఒక శాతం మాత్రమే. అది కూడా అందరికీ అందుబాటులో లేదు. ఇక మన దేశం విషయానికి వస్తే... నదీమతల్లులకు నెలవైనా ఆ నీటి గలగలలను ఒడిసిపట్టడంలో విజయం సాధించలేక పోతున్నాం. అయితే అతివృష్టి... లేదంటే అనావృష్టి.. ఇదీ మన దురవస్థ. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే నదుల అనుసంధానమే సరైన పరిష్కార మార్గమంటూ గత కొన్నేళ్ల నుంచి పాలక పెద్దల నోట వినిపిస్తున్నా ఇప్పటికీ కార్యాచరణ దిశగా అడుగు పడలేదు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మరోమారు నదుల అనుసంధాన రాగం ఆలపించడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. గాలి తర్వాత.. అత్యంత ముఖ్యమైన సహజ వనరు నీరు. ఇది ప్రాణికోటికి ఆధారం. ప్రపంచ జనాభాలో రెండో పెద్ద దేశమైన భారత్‌లో నీటి వనరుల ప్రాధాన్యాన్ని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం నూతన జాతీయ జల విధానం రూపొందించింది. అందులో భాగంగా భారత జాతీయ జలాభివృద్ధి వ్యవస్థ (ఇండియాస్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) నదుల అనుసంధానాన్ని సిఫారసు చేసింది. ఇది బృహత్తర ప్రణాళిక. ఆర్థిక, ఆర్థికేతర వనరుల వినియోగంతో పాటు సాంకేతిక, నిర్వహణ కార్యకలాపాలకు ఇదొక పెద్ద సవాలు. దక్షిణాదిన, పశ్చిమాన నిరంతరం సంభవించే నీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి ఉద్దేశించిన యజ్ఞమే నదుల అనుసంధానం. ఈ ప్రక్రియలో 30 పెద్ద నదుల అనుసంధానం జరుగుతుంది. అతిపెద్ద జలాభివృద్ధి పథకం భారతదేశంలో రెండు పెద్ద నదులైన గంగా, బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహాన్ని అనుసంధానం ద్వారా మళ్లించడం జరుగుతుంది. ఇది పూర్తి రూపం దాల్చితే ప్రపంచంలోనే అతి పెద్ద జలాభివృద్ధి పథకం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. దీనికి 2002 సంవత్సర ధరల సూచీ ప్రకారం 123 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ బృహత్తర ప్రణాళిక విజయవంతంగా అమలైతే...దారిద్య్ర నిర్మూలన, జీవన ప్రమాణాల పెరుగుదల, ప్రాంతీయ అసమానతలు తగ్గడం, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతలు మెరుగుపడడం లాంటి శుభ పరిణామాలు సాకారమవుతాయి. రెండో శతాబ్దంలోనే... నదుల అనుసంధాన ప్రక్రియ ఈనాటిదేమీ కాదు. వ్యవ సాయమే ప్రధాన వృత్తిగా ప్రారంభమైన నాటి నుంచి స్థానిక అవసరాలకు అనుగుణంగా కాలువల మీద ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి ఎద్దడి సమయాల్లో వినియోగించుకునేవారు. మన దేశంలో రెండో శతాబ్దంలో కావేరి నదిపై కట్టిన పెద్ద ఆనకట్ట 19వ శతాబ్దం మధ్య వరకు 25 వేల హెక్టార్ల సాగుకు నీటిని అందించింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, కాకతీయులు.. కావేరి, తుంగభద్ర, వైగాయ్ నదీ జలాలను మళ్లించి వ్యవసాయానికి నీటి సరఫరా చేశారు. మొఘల్ సామ్రాజ్య కాలంలో పశ్చిమ యమున, ఆగ్రా కాలువలు తవ్వించారు. బ్రిటీషువారి హయాంలో ఆధునిక నీటి పారుదల పితామహుడైన సర్ ఆర్థర్ కాటన్.. కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టించారు. ప్రస్తుతం తెలుగుగంగ ప్రాజెక్టు కృష్ణా నదీ జలాలను చెన్నై పట్టణానికి అందిస్తుంది. ఆలోచనకు ఆద్యుడు... కె.ఎల్.రావు సుప్రసిద్ధ ఇంజనీర్, ఇందిరా గాంధీ కేబినెట్ మంత్రి డా.కె. ఎల్.రావు 1972లో నదుల అనుసంధాన ఆవశ్యకతను ప్ర స్తావించారు. కాలువల హారాన్ని (గార్లాండ్ కెనాల్స్) రెండు ప్రాంతాల్లో నిర్మించాలని (ఒకటి.. హిమాలయ పరీవాహక ప్రాంతానికి, రెండోది పశ్చిమ కనుమల ప్రాంతానికి) కెప్టెన్ దిన్షా దస్తూర్ సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా నదీజలాల అనుసంధానాన్ని సమర్థించారు. పాశ్చాత్య దేశాల్లోనూ ఐరోపా, ఉత్తర అమెరికాలో నదుల అనుసంధాన ప్రక్రియ లు జరిగాయి. యూరప్ కాలువ(రైన్-డాన్యూబ్ కాలువ).. 1992లో పూర్తయింది. ఇది ఉత్తర సముద్రాన్ని అట్లాంటిక్ మహా సముద్రంతో కలుపుతుంది. ఈ కాలువ ద్వారా నౌకాయానం కూడా జరుగుతుంది. వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలకు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఈ కాలువ ఉపయోగ పడుతుంది. అమెరికాలో ఇల్లినాయ్ నదీ మార్గం, టెన్నిసి-టామ్ బిగ్ బి నదీ మార్గం, గల్ఫ్ తీర ప్రాంత నదీ మార్గాలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని మార్ని-రైన్ కాలువ నదీ అనుసంధానాలకి ఉదాహరణ. నదుల అనుసంధానం - ప్రయోజనాలు 1. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయోత్పత్తి 100 శాతం పెరుగుతుంది. దుర్భిక్షం తలెత్తకుండా అడ్డుకట్ట వేయవచ్చు. 2. ఆయిల్ దిగుమతిని తగ్గించుకోవచ్చు. దీని ద్వారా విలువైన విదేశ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. 3. ఆహార స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా దేశ భద్రతను పటిష్ట పరచవచ్చు. 4. రాబోయే పదేళ్లలో 10 లక్షల మందికి జీవనోపాధి కల్పించవచ్చు. 5. ఉత్తరాదిన, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో తరచుగా సంభవించే వరదల్ని నియంత్రించవచ్చు. 6. నీటి కొరత నివారణకు మార్గం సుగమమవుతుంది. 7. నౌకాయానం ద్వారా రవాణా సౌకర్యాల వృద్ధి 8. రైతుల సగటు వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 2500 (ఒక ఎకరానికి) నుంచి రూ. 30,000 వరకు పెంచవచ్చు. అనుసంధానం - పరిమితులు 1. అటవీ నిర్మూలన, నేలకోతతో పర్యావరణ పరంగా భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది. 2. ఈ ప్రాజెక్టు వలన నష్టపోయిన వారికి పునరావాసం కల్పించడం కష్టం. సామాజిక, మానసిక అలజడులను అదుపు చేయడం సులభమైన పని కాదు. 3. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో సంబంధా లు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. వ్యతిరేక వాదనలు ఉత్తరాదితో పాటు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లో మిగులు జలాలున్నాయన్నది భ్రమే అవుతుంది. దాదాపు అన్ని నదీ పరీవాహకాలు (రివర్ బేసిన్లు) ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంత రైతులకు, పట్టణ ప్రాంత పారిశ్రామిక వినియోగదారులకు మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయంటే అవసరానికి సరిపడా నీరు లభ్యం కావడం లేదని అర్థం. ఇటీవల జరిపిన పరిశోధనలో మహానది పరీవాహకంలో మిగులు జలాలు లేవని తేలింది. అలాంటప్పుడు దాన్ని గోదావరి నదితో అనుసంధానం చేయడంలో అర్థం లేదు. వరద నీటిని పొరుగు నదులకు తరలించడం అనేది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే పొరుగు నదిలో వరద నీటి ఉద్ధృతి ఉంటుంది. ఒకవేళ తరలించినప్పటికీ ఆ నీటిని జలాశయాలలో నిల్వ ఉంచడానికి విస్తృత సదుపాయాలు కల్పించాలి. భారీ ఎత్తున జలాశయాల నిర్మా ణం పర్యావరణానికి హాని కలిగిస్తాయి. పైగా ముంపున కు గురయ్యే ప్రాంతాలలో నివసించే వారికి పునరావాసం కల్పించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం మీద ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం వల్ల పలు ప్రయోజనాలుంటాయన్నది నిజమే. అయితే, వాటిని సకాలంలో నిర్మించి ఎంత మేర సమర్థంగా నిర్వహిస్తారనేది పెద్ద ప్రశ్న. అనుసంధానానికి ప్రత్యామ్నాయం పరిశుభ్ర జలాలు అందరికి అందుబాటులో ఉంచడం, నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ముఖ్యమే. అయితే నదుల అనుసంధానానికి ప్రత్యామ్నాయమేదైనా ఉందా? అంటే ఉందనే వాదిస్తారు. 1. నీటి కొరతకు ప్రధాన కారణం వినియోగం పెరగడం అనే వాదనతో పూర్తిగా ఏకీభవించలేం. నీటి సరఫరాలో అవకతవకలు, వృథా, దుబారా(ప్రోఫ్లిగేషన్) మొదలైనవి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. వీటిని అరికట్టగలిగితే చాలా వరకు కొరత నివారించవచ్చు. 2. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఇంకుడు గుంటల ద్వారా ఒడిసిపట్టవచ్చు. వర్షం పడేటప్పుడు ఇంటి కప్పులపై నుంచి కిందికి జారిన నీటిని భద్ర పరచడం ద్వారా స్థానిక అవసరాల్ని తీర్చుకోవచ్చు. నీటి సేకరణ, పరిరక్షణ ప్రక్రియను వికేంద్రీకరించడం, లోతట్టు ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా స్థానిక నీటి వినియోగంలో స్వయం సమృద్ధి సాధించవచ్చు. దీంతో భారీ ఎత్తున ఆనకట్టల నిర్మాణం, కాలువలు తవ్వించడం లాంటి అవసరం ఉండదు. 3. వరద నీటిని కొరత ఉన్న ప్రాంతానికి తరలించడమే నదుల అనుసంధాన ముఖ్య ఉద్దేశం. కానీ, గంగ- బ్రహ్మపుత్ర నదీ పరీవాహకాలకు జులై నుంచి అక్టోబరు మధ్య కాలంలో అదనపు నీరు చేరుతుంది. నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో (దక్షిణాది ప్రాంతం) జనవరి నుంచి మే మధ్య కాలంలో నీరు అవసరం. ఈ పరిస్థితుల్లో అదనంగా లభ్యమైన నీటిని భారీ ఎత్తున జలాశయాలు నిర్మించి నిల్వ ఉంచాలి. వాటికయ్యే ఖర్చు, సామాజిక సమస్యలు, పర్యావరణ ముప్పు ఆమోదయోగ్యమేనా? 4. వరదలు కొంత నష్టాన్ని కలిగించినా, ఒండ్రు మట్టిని తేవడం ద్వారా భూసారాన్ని పెంచుతాయి. సహజ సిద్ధమైన వరదలను కృత్రిమంగా నిరోధించే ఏ పద్ధతి అయినా చౌడు భూములుగా మారే ప్రమాదముంది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు. 5. ఏటా సంభవించే వరదల వల్ల గంగా నదిలో చేరే కాలుష్యాలన్నీ సముద్రంలోనే కొట్టుకుపోతాయి. నదు ల అనుసంధానం వల్ల గంగా నది నీటి ఉరవడి తగ్గి వ్యర్థ పదార్థాలతో నీరు మరింత కలుషితమవుతుంది. యుమునా నది నుంచి హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నీటిని ఉపయోగించుకుంటున్నాయి. ఢిల్లీలో సరఫరా అయ్యే తాగునీటిలో నాణ్యత లోపించడానికి ఇదే కార ణం. దీనివల్లే ఎంతో ఖర్చు పెట్టి వార్షిక ప్రాతిపదికన అమలు చేస్తున్నా గంగా నదీ ప్రక్షాళన విఫలమైంది. 6. ఈ ప్రణాళిక అమలుకు 8 వేల చదరపు కిలోమీటర్ల భూమి అవసరం. అంత భారీ ఎత్తున భూసేకరణ సాధ్యమేనా? ఒకవైపు రైతులు, మరోవైపు పర్యావరణ మద్ధతుదారులు న్యాయస్థానాలలో కేసులు వేసి సమస్యలను మరింత జటిలం చేస్తారు. దానికి తోడు భూమిని కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయం చూపించడం కష్టతరమవుతుంది. వాస్తవానికి అంత అదనపు భూమి లేదు. సమస్యలనేకం అనుసంధాన ప్రక్రియను ప్రారంభించినప్పటికీ దాని విజయం అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ప్రధానంగా మిగులు జలాలు కలిగిన రాష్ట్రాలు వాటిని తరలించడానికి ఒప్పుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలు నిరాకరించవచ్చు. దానికి తోడు రాజకీయాలు కూడా ఈ బదిలీ ప్రక్రియను మరింత జటిలం చేస్తాయి. జల సంబంధ, భౌగోళిక, నైసర్గిక, ప్రాంతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ యజ్ఞం విజయవంతమవుతుంది. పర్యావరణ రక్షణ కవచాలను సక్రమంగా అమలు చేయాలి. వివిధ వ్యవస్థల మధ్య తగిన సమన్వయం ఏర్పడాలి. ఏదేమైనా... అనుసంధాన భావన ఆకర్షణీయంగా కనిపించనప్పటికీ.. ఆచరణలో పలు సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. ఉత్తరాదిలో నదుల అనుసంధాన ప్రతిపాదనలు మానస్-సంకోష్-తీస్తా-గంగ కోసి, ఘాగ్ర గండక్ - గంగ ఘాగ్ర-యమున శారద-యమున యమున-రాజస్థాన్ రాజస్థాన్-సబర్మతి చునార్-సోని జరాజ్ సోని ఆనకట్ట- దక్షిణగంగ ఉపనదులు గంగ-దామోదర్-సువర్ణరేఖ సువర్ణరేఖ- మహానది కోసి-మేచి ఫరఖ్ఖా-సుందర్బన్లు జోగిఘోఫా-తీస్తా-ఫరఖ్ఖా (మొదటి దానికి ప్రత్యామ్నాయం) దక్షిణాదిలో అనుసంధానానికి ప్రతిపాదించిన నదులు.. మహానది-గోదావరి(ధవళేశ్వరం) గోదావరి-కృష్ణా(పులిచింతల) గోదావరి-కృష్ణా(విజయవాడ) కృష్ణా (ఆల్మట్టి)-పెన్నార్ గోదావరి-కృష్ణా(నాగార్జున సాగర్) కృష్ణా(శ్రీశైలం)-పెన్నార్ కృష్ణా- పెన్నార్(సోమశిల) పెన్నార్-కావేరి కావేరి-వైగాయ్-గుండార్ కెన్-బెట్వా పర్బతి-కల్సింద్-చంబల్ పర్-తపి-నర్మద దామన్‌గంగ-పింజల్ బెడ్తి(గంగవల్లి)-వర్ద నేత్రావతి-హేమావతి పంబ-అచంకోవిల్-వైప్పార్ - డా॥బి.జె.బి. కృపాదానం సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ -
నదుల అనుసంధానంపై ముందుకే సాగుతాం
కేంద్ర మంత్రి వెంకయ్య న్యూఢిల్లీ: నదుల అనుసంధానం విషయంలో ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగుతామని, ఈ ప్రయత్నంలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ పరిష్కరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నదుల అనుసంధానంపై కొందరి నిరసనలకు సమాధానాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా వాటర్ వీక్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడినా తొలగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని వ్యక్తమవుతున్న ఆందోళనలను ఉద్దేశించి స్పందిస్తూ.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. అలాగే అన్ని స్థానిక సంస్థలకు జల సంరక్షణ చర్యలను తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెంకయ్య పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. జల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల అమలులో వాతావరణ మార్పులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఇక గంగా నది శుద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ కార్యక్రమంలో వివరించారు.