‘మహా’ ఉత్కంఠ!
- మహానది-గోదావరిల అనుసంధానంపై రేపు ఢిల్లీలో కీలక భేటీ
- అనుసంధాన ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ఒడిశా
- గోదావరిలో మిగులు జలాల లభ్యత పునఃపరిశీలించాలంటున్న తెలంగాణ
- మహానదిలో 180 టీఎంసీల మిగులు జలాలున్నాయంటున్న ఎన్‌డీడబ్ల్యూఏ
- కీలకంగా మారనున్న కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నదుల అనుసంధానంపై విధాన రూపకల్పన ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. నదీ జలాల లభ్యతపై కేంద్రం చెబుతున్న లెక్కలకు, రాష్ట్రాలు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరట్లేదు. దీంతో ఈ అంశంపై మళ్లీ పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండటం అనుసంధాన ప్రక్రియకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మహానది-గోదావరి నదుల అనుసంధానాన్ని ఒడిశా తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా గోదావరిలో మిగులు జలాల లభ్యతను పునఃపరిశీలించాకే ఏ కార్యాచరణకైనా పూనుకోవాలని తెలంగాణ రాష్ట్రం కోరడం కేంద్రాన్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ మహానది-గోదావరిల అనుసంధానంపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అనుసంధానానికి అనేక అభ్యంతరాలు...
మహానదిలో ఒడిశా అవసరాలుపోనూ మరో 180 టీఎంసీల మిగులు జలాలున్నాయని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చెబుతోంది. అయితే మహానదిలో మిగులు జలాలపై ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ శర్మతో కూడిన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు ఒడిశా తన అభ్యంతరాలను వివరించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పినట్లుగా మహానదిలో 180 టీఎంసీల అదనపు జలాలు లేవని, ఉన్న కొద్దిపాటి జలాలు తమ భవిష్యత్తు అవసరాలకే సరిపోతాయని పేర్కొంది. ఎన్‌డబ్ల్యూడీఏ గతంలోనే మహానదిపై భారీ డ్యామ్‌ను ప్రతిపాదించగా ముంపు ఎక్కువగా ఉన్న దృష్ట్యా దాని బదులు ఐదారు చిన్న బ్యారేజీలు కట్టాలని ఒడిశా ప్రతిపాదించింది.
దీన్ని ఎన్‌డబ్ల్యూడీఏ వ్యతిరేకిస్తోంది. బ్యారేజీల నిర్మాణంతో ఒడిశాలో ముంపు ప్రాంతాలు తగ్గినా ఆశించిన మేర నీరు దిగువ ప్రాంతాలకు రాదని చెబుతోంది. దీంతో సందిగ్ధంలో పడిన కేంద్రం నీటి లభ్యతపై పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని ఇరుపక్షాలను ఆదేశించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో ఒడిశా, ఎన్‌డబ్ల్యూడీఏల నివేదికపై చ ర్చించనుంది. గోదావరికి సంబంధించిన అంశం కావడంతో గోదావరిలో అదనపు జలాల లభ్యత వివరాలతో తెలంగాణ సైతం హాజరుకావాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రం నుంచి నీటిపారుదలశాఖ అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు.
తమ ప్రయోజనాలు పూర్తయ్యాకే అదనపు జలాలను తరలించాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. గోదావరిలో లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతాయని, 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనం ఆధారంగా గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంటోంది. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలకంగా మారనుంది.