ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో నిర్వహించే జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో నదుల అనుసంధాన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పాల్గొంటారు.
తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలకు తరలించి.. కావేరి గ్రాండ్ ఆనకట్టలోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదులను అనుసంధానం చేసేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించింది. ఈ డీపీఆర్‌పై ఆ నదీ పరీవాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. గోదావరిలో మిగులు జలాలే లేవని.. ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చాక మిగిలిన నీటినే కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) లెక్కలకు పొంతన లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని సూచించింది. గోదావరి నుంచి తరలించే నీటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఆయకట్టుకు నీళ్లందిస్తారో స్పష్టంగా చెప్పాలని సూచిస్తూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అధికారులు మరోసారి కేంద్రానికి వివరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment