nwda
-
కావేరికి దారేది?
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) విఫలమవుతోంది. దీంతో ఏడేళ్లుగా ఈ ప్రతిపాదనలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోకుండా గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించడమే దానికి కారణమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తొలుత అకినేపల్లి.. ఆ తర్వాత జానంపల్లి.. ఇప్పుడు ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించేలా డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ఎన్‌డబ్ల్యూడీఏ సిద్ధం చేసింది. తమ కోటా నీటిని కావేరికి ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది.బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లేలా ప్రతిపాదనలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఎన్‌డబ్ల్యూడీఏ విఫలమవుతున్న నేపథ్యంలో కావేరితో గోదావరి అనుసంధానం కష్టమేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఏకపక్షంగా ప్రతిపాదన.. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలకు 107 టీఎంసీల మిగులు జలాలను జతచేసి 248 టీఎంసీలను అకినేపల్లి నుంచి కావేరికి తరలించేలా 2017లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జానంపేట నుంచి 248 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా 2018లో డీపీఆర్‌లో మార్పులు చేసింది. దీనిపై కూడా మూడు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఛత్తీస్‌గఢ్ ససేమిరా అంటున్నాగోదావరిలో మిగులు జలాలే లేవని.. నీటి లభ్యతే లేనప్పుడు అనుసంధానం ఎలా చేపడతారని 2020లో ఏపీ ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలను ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి తరలించేలా 2022లో డీపీఆర్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానం చేపడితే దేవాదుల, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచే కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ కోటా నీటిని కావేరికి తరలించడానికి అనుమతించే ప్రశ్నే లేదని.. కాదూ కూడదని అనుసంధానం చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఛత్తీస్‌గఢ్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని నీటిని కావేరికి తరలించే ప్రతిపాదననే ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ తెరపైకి తేవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
సమ్మక్క నుంచే అనుసంధానం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని సైతం చేర్చినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్రానికి సమాచారం ఇచి్చంది. అలాగైతే అన్నీ సమస్యలే: తెలంగాణ ఆరు నెలల కిందట గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణకు అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ దానిపై అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బరాజ్ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ బరాజ్‌కి బ్యాక్‌వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు సైతం నష్టం కలుగుతుందని పేర్కొంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ పేర్కొంటుండగా, ఈ నీటి వినియోగం లెక్కలను సమరి్పంచాలని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ కోరింది.దీంతో సమ్మక్కసాగర్ బరాజ్‌కి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బరాజ్ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలను తెలంగాణ అందించింది.ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ తెలియజేసింది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ అంగీకారం లభించే పరిస్థితి లేకపోవడంతో సమక్కసాగర్ నుంచే నీటిని తరలించే అంశాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ సోమవారం నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. సిమ్యులేషన్ స్టడీకి కేంద్రం ఓకే గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచి్చంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు.అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బరాజ్ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బరాజ్ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించడంతో సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగయ్యాయి. -
కావేరికి గోదావరి.. ఇచ్ఛంపల్లి నుంచి లేనట్లే!
సాక్షి, అమరావతి : గోదావరి ట్రిబ్యునల్ అవార్డు.. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలన్న ప్రతిపాదనను జాతీయ జలవనరుల అభివృద్ధి (ఎన్‌డబ్ల్యూడీఏ) సంస్థ పునఃసమీక్షిస్తోంది. ఇచ్ఛంపల్లికి దిగువన సమ్మక్క బ్యారేజ్, కంతనపల్లి, పోలవరం ప్రాజెక్టుల నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై తాజాగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇచ్ఛంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా రెండున్నరేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎన్‌డబ్ల్యూడీఏ.. పరీవాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. కానీ, ఇచ్ఛంపల్లి నుంచి 85 టీఎంసీలను మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదని 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు..ఇచ్ఛంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 108 మీటర్లకు 1986–88లో తగ్గించారు. నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు ఎన్‌డబ్ల్యూడీఏ తగ్గించింది. బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు తగ్గించినా ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీనిపై ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి బేసిన్లో ఇంద్రావతి సబ్ బేసిన్‌లోని తమ కోటాలో వాడుకోని జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏని నిలదీసింది. కాదూ కూడదని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పింది.దిగువన కట్టాలని తెలంగాణ ప్రతిపాదన..ఇక ఇచ్ఛంపల్లికి 24 కిమీల దిగువన తెలంగాణ సర్కార్ ఇప్పటికే గోదావరిపై సమ్మక్క బ్యారేజ్‌ను నిర్మించింది. గోదావరిపై ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే.. గరిష్ఠంగా వరద వచ్చినప్పుడు ఆకస్మికంగా దిగువకు విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశముందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇచ్ఛంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ లేదా కంతనపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలని సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సర్కార్ల అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి గోదావరి తరలింపుపై ఎన్‌డబ్ల్యూడీఏ పునరాలోచనలో పడింది. -
‘సమ్మక్క’ నుంచే అనుసంధానం?
సాక్షి, హైదరాబాద్: గోదావరి –కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు నష్టం కలుగుతుందని తెలంగాణ చేసిన అభ్యంతరాలతో నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) పునరాలోచనలో పడింది. తమ రాష్ట్రం నిర్మించిన సమ్మక్క బ్యారేజీ నుంచే నీటిని తరలించాలని తెలంగాణ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలు అందించాలని ఎన్‌డబ్ల్యూడీఏ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ అభ్యంతరం నాలుగు నెలల క్రితం గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ..దీనిపై తెలంగాణ అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అలాగే దిగువన ఉన్న సమక్క సాగర్ బ్యారేజీకి బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 1980లోనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలు గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతిని చ్చింది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88 లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు. అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బ్యారేజీ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజీ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలనే తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం తెలుపడంతో సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగైనట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
‘నీటి’ మీద లెక్కలు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క కట్టింది. సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు. శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్‌డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. -
గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే!
సాక్షి, అమరావతి: ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాదని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య 1975, డిసెంబర్ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదు. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనను అమలుచేస్తే మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తక్కువ వ్యయంతో పనులు పూర్తిచేయవచ్చునని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ.. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) వరకూ నీటిని తరలించడం ద్వారా గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం చెప్పాయి. గోదావరి నికర జలాల్లో మిగులులేదని.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే అనుసంధానం చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మా కోటాలో నీటిని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. గోదావరి, ఉప నదులలోని నికర జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నీరు, వరద జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు పలుమార్లు కోరింది. పోలవరం నుంచైతేనే కావేరికి గోదావరి.. గోదావరి బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏ రాష్ట్రం హక్కులకు విఘాతం కలగదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు చేరిన గోదావరి జలాలను కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎత్తిపోసి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ, నిర్వాసితుల సమస్య తప్పుతుందని.. తక్కువ వ్యయంతో గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను న్యాయ, సాగునీటిరంగ నిపుణులు బలపరుస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఇదీ.. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు. మిగతా నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించాలి. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో మధ్యప్రదేశ్ 38 శాతం, మహారాష్ట్ర 35 శాతం, ఆంధ్రప్రదేశ్ 27 శాతం వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10 శాతం ఆంధ్రప్రదేశ్, 10.50 శాతం మహారాష్ట్ర, 11.40 శాతం మధ్యప్రదేశ్ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించాలి. -
మా హక్కులను పరిరక్షించాకే అనుసంధానం చేపట్టాలి
సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. తమ రాష్ట్ర హక్కులను పరిరక్షించాకే కావేరికి గోదావరి నీటిని తరలించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద నదుల అనుసంధానం చేపట్టనున్న తరహాలోనే రాష్ట్రంలోనూ నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కోరింది. ఈ అంశంపై చర్చించడానికి విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 72వ పాలకమండలి సమావేశం వర్చువల్ విధానంలో బుధవారం జరిగింది. ఇందులో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరాతోపాటు అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో సాగు, తాగునీటి కొరతను అధిగమించే లక్ష్యంతో చేపట్టటనున్న గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరిస్తూ అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించారు. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ తేల్చిన నేపథ్యంలో అనుసంధానం ఎలా చేపడతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని డిమాండ్ చేశాయి. నికర జలాల్లో మిగిలిన జలాలు, వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ పూర్తి హక్కులు ఇచ్చిందని.. వాటిని పరిరక్షిస్తూ అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అనుసంధానంపై బేసిన్‌లోని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకొస్తేనే గోదావరి–కావేరి చేపడతామని స్పష్టం చేశారు. -
గోదావరి–కావేరిపై సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై సంప్రదింపులు, టాస్‌్కఫోర్స్ సమావేశాలను నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీల్లో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్రాలకు అందజేస్తామని, అప్పటి నుంచి 15 రోజుల్లోగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఎంఓయూపై సంతకాలు చేయాలని వెదిరె శ్రీరామ్ సూచించారు. ఈ భేటీల నిర్ణయాలను ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి(గోదావరి)–మూసీ–నాగార్జునసాగర్–సోమశిల– గ్రాండ్ ఆనికట్ (కావేరి)లను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ వద్దు: తెలంగాణ గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు రక్షణ కల్పిస్తే అనుసంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతామని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టంచేశారు. ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50శాతం కేటాయించాలని కోరారు. గోదావరి జలాల్లో రాష్ట్రాల వారీగా వాటాలను నిర్థారించి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగకుండా ఫ్రీజ్ చేయాలన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కాకుండా కొంత ఎగువన బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని.. లేకుంటే దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి వద్దే నిర్మిస్తాం: వెదిరె శ్రీరాం తెలంగాణ సహా ఏ రాష్ట్ర వాటా నీటికీ నష్టం కలిగించమని వెదిరే శ్రీరామ్ సమాధానమిచ్చారు. భౌగోళికంగా ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్, ఇతర ఎగువ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్న గోదావరి జలాలనే తరలిస్తామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని నిర్థారించిన నేపథ్యంలో వాటిని సైతం వినియోగించబోమని హామీ ఇచ్చారు. తెలంగాణకు 50శాతం వాటా కేటాయింపును పరిశీలిస్తామన్నారు. తొలి విడత ప్రాజెక్టుకు కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని చెప్పారు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాస్తామని, సమ్మక్క బ్యారేజీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా వాటా పూర్తిగా వాడుకుంటాం: ఛత్తీస్‌గఢ్ గోదావరిలో తమ రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకుంటామని సమావేశంలో ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఇంజనీర్ కుబేర్‌సింగ్ గురోవర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు పూర్తిచేసి, సీడబ్ల్యూసీ నుంచి ప్రాథమిక స్థాయి అనుమతులు పొందామని చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాలను వాడుకోవడం ప్రారంభించిన వెంటనే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేస్తామని వెదిరె శ్రీరామ్ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టవచ్చని, ఆలోగా మహానది–గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నుంచే అనుసంధానం జరపాలి: ఏపీ గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని ఏపీ తరఫున శశిభూషణ్‌కుమార్ కోరారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాడుకోని జలాలను సాంకేతికంగా నిర్ధారించాలని కోరారు. గోదావరిలో 75శాతం లభ్యత ఆధారంగా నికర జలాల లభ్యత లేదని తేల్చుతూ సీడబ్ల్యూసీ ఇ చ్చిన నివేదికలో తారతమ్యాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిoచాలని సూచించారు. బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని హెచ్ఎల్సీ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించాలన్నారు. ఎగువ రాష్ట్రాల వినియోగంతో గోదావరిలో దిగువ చివరి రాష్ట్రం ఏపీ వాటాకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఏపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. దీనిపై స్పందించిన వెదిరె శ్రీరామ్.. తొలివిడతలో ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామని, తదుపరి దశల్లో ఇతర ప్రాంతాల నుంచి సైతం గోదావరి జలాల తరలింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ వాటాలకు రక్షణ కల్పించే విషయంలో రాజీపడబోమని భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల కింద ఇప్పటికే ఉన్న ఆయకట్టుతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు సైతం సాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
ఆల్మట్టి .. శ్రీశైలం నోట్లో మట్టి !
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన కృష్ణా జలాల నికర వాటా నుంచి కర్నాటకకు 15.89 టీఎంసీలు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై శుక్రవారం నగరంలోని జలసౌధలో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించిన ఎజెండాలో ఈ విషయాన్ని.. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) పొందుపరిచింది. ప్రాజెక్టులో భాగంగా 148 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీద నుంచి కావేరి బేసిన్‌కు తరలించనుండగా, అందులో తెలంగాణకు 45.06 టీఎంసీలు, ఏపీకి 43.86 టీఎంసీలు, తమిళనాడుకు 40.92 టీఎంసీలు, కర్ణాటకకు 15.89 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.18 టీఎంసీల వాటాలను కేటాయించనున్నట్టు తెలిపింది. కర్ణాటక రాష్ట్రానికి గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు ద్వారా నేరుగా కాకుండా, ప్రత్యామ్నాయ పద్ధతి(సబ్సిట్యూట్)లో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి జలాశయం నుంచి కేటాయించనున్నట్టు ఎజెండాలో ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ పద్ధతిలో ఆల్మట్టి జలాశయం నుంచి 15.89 టీఎంసీలను కర్ణాటక రాష్ట్రంలోని మలప్రభ(కే–4) సబ్ బేసిన్ పరిధిలో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనలు అమలైతే ఆల్మట్టి జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి రావాల్సిన నికర జలాల్లో 15.89 టీఎంసీలకు గండిపడే ప్రమాదం ఏర్పడుతుంది. శుక్రవారం జరగనున్న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 442 టీఎంసీల్లో 15.89 టీఎంసీలకు కోత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటాలున్నాయి. అందులో 369 టీఎంసీలకు రెండు రాష్ట్రాల పరిధిలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసే వర్షాలే ఆధారం కాగా, మిగిలిన 442 టీఎంసీలు ఆల్మట్టి జలాశయం(ఎగువ రాష్ట్రాల) నుంచి రావాల్సిందే. తాజా ప్రతిపాదనలతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి రావాల్సిన 442 టీఎంసీల్లో 15.89 టీఎంసీలు తగ్గనున్నాయి. ఇప్పటికే 35 టీఎంసీలు మళ్లింపు... పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడానికి బదులుగా, 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలను మ హారాష్ట్రకు గతంలో కేటాయించడంతో 35 టీ ఎంసీల కృష్ణా జలాలకు గండి ఏర్పడింది. ఇ ప్పుడు మరో 15.89 టీఎంసీలను కర్నాటకకు కేటాయిస్తే.. మొత్తం 50.89 టీఎంసీల కృష్ణా జలాలు తెలుగు రాష్ట్రాలు నష్టపోనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా నదిపై కర్నాటకలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టులతో ఇప్పటి కే దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద ప్రవాహానికి భారీగా గండిపడగా, తాజా ప్రతిపాదనలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా ట్రిబ్యునల్స్–1,2 కి విరుద్ధం.. గోదావరి ఉపనది మంజీర సబ్ బేసిన్‌కి సంబంధించిన కొంత భాగం మాత్రమే కర్ణాటక పరిధిలోకి వస్తుందని, దిగువన ఉన్న ఇంద్రావతి, ఇతర ఉప నదుల బేసిన్ల పరిధిలో కర్ణాటక రాష్ట్రం రాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చే స్తోంది. అయినా 15.89 టీఎంసీలను కర్ణాట కకు కేటాయించడం సమంజసం కాదని అ భ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్– 1 అవార్డు, కృష్ణా ట్రిబ్యునల్–2 నివేదికల కు ఇవి పూర్తి విరుద్ధమైన ప్రతిపాదనలని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో స్పష్టం చేయనుంది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకునే వరకు నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టరాదని కోరనుంది. ఛత్తీస్‌గఢ్ సమ్మతి లేకుండా ముందడుగు వద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సమ్మతి పొందిన తర్వాతే ముందుకు వెళ్లాలని మరోసారి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించగా, దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో ఇబ్బందులు వస్తామని తెలంగాణ అభ్యంతరం తెలియజేయనుంది. 148 టీ ఎంసీల్లో 50 శాతం జలాలను తెలంగాణకు కేటాయించాలని మరోసారి కోరనుంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని 13(బీ) నిబంధనల మేరకు బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ద్వారా తరలించనున్న 18 టీఎంసీల కృష్ణా జలాల్లో 50 శాతం.. అంటే 9 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. -
నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే అడ్డంకి!
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న నదీ జలాలను.. నీటి కొరత ఉన్న నదులకు మళ్లించడం ద్వారా దేశంలో కరవు పరిస్థితులను రూపుమాపవచ్చుననే లక్ష్యంతో చేపట్టిన నదుల అనుసంధానానికి నదీ జల వివాదాల ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారాయని కేంద్రానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నివేదించింది. ట్రిబ్యునళ్ల అవార్డులను చూపి.. నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లోని రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడుతున్నాయని పేర్కొంది. నదుల అనుసంధానానికి వాటి బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో కెన్–బెటా్వమినహా మిగతా అనుసంధానాలు ప్రతిపాదన దశను దాటడం లేదని వివరించింది. ఈ అంశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. దేశంలో హిమాలయ నదుల అనుసంధానానికి 14.. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 లింక్‌లను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానంపై బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. కాగా, పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మిగతా 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. కావేరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కూడా ఇదే రీతిలో నిర్ణయాలను ప్రకటించాయి. ఇప్పుడు ఆ ట్రిబ్యునళ్ల అవార్డులను చూపుతున్న రాష్ట్రాలు.. నదుల అనుసంధానం ద్వారా మళ్లించే నీటిలో అదనపు వాటా కోసం పట్టుబడుతున్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల) మీదుగా కావేరికి తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన అమలు చేస్తే.. కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటకలు పట్టుబడుతున్నాయి. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ డిమాండ్ చేస్తున్నాయి. దాంతో ఈ అనుసంధానంపై ఏకాభిప్రాయం సవాల్‌గా మారింది. విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే..: నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత తీవ్రంగా ఉన్న నదులకు మళ్లించే నీటి విషయంలో రాష్ట్రాలతో సంప్రదించి, కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే నదుల అనుసంధానం పట్టాలెక్కే అవకాశం ఉందని ఎన్డబ్ల్యూడీఏనే స్పష్టం చేస్తోంది. ఒక నది నుంచి మళ్లించిన నీటికిగానూ.. మరొక నదిలో అదనపు వాటా వాడుకోవడానికి ట్రిబ్యునళ్లు ఇచ్చిన అనుమతిని నదుల అనుసంధానానికి మినహాయిస్తేనే నదుల అనుసంధానం సాకారమవుతుందని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. -
ఏకాభిప్రాయం లేకున్నా ముందుకే!
సాక్షి, అమరావతి: గోదావరి – కావేరి నదుల అను సంధానంపై వాటి పరివాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. అనుసంధానం ప్రతిపాదనపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వచ్చే నెల 11న నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశం అజెండాలో గోదావరి – కావేరి అనుసంధానం ఒప్పందాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ చేర్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంద్రావతి సబ్ బేసిన్లో బచావత్ ట్రిబ్యునల్ తమకు చేసిన కేటాయింపుల్లో వాడుకోని నీటిలో 141.3 టీఎంసీలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే నిలదీసింది. తమను సంప్రదించకుండా తమ కోటా నీటిపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోకుంటే న్యాయస్థానంలో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా నీటి లభ్యతను తేల్చాకే అనుసంధానాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఒప్పందాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం అజెండాలో చేర్చడంపై నీటి పారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత తేల్చకుండానే గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2019 ఫిబ్రవరిలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు 80 టీఎంసీల చొప్పున కేటాయించి ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను మిగిలిన నీటిని కర్ణాటకకు ఇవ్వాలని ప్రతిపాదించింది. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సూచించడంతో ఎన్‌డబ్ల్యూడీఏ 2021లో మరో ప్రతిపాదన చేసింది. కావేరికి గోదావరి జలాలను తరలించే ప్రాంతాన్ని అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి ఇచ్చంపల్లి (జయశంకర్ భూపాల్పల్లి జిల్లా)కి మార్చింది. ఇచ్చంపల్లి వద్ద ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు అదనంగా 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. నాగార్జున సాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా ప్రతిపాదించింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. నికర జలాలు, వరద జలాలను ఎలా వర్గీకరిస్తారని ప్రశి్నంచాయి. తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని అభ్యంతరం చెప్పడంతో ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కనీసం ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించకుండానే ఛత్తీస్‌గఢ్‌కు ఇంద్రావతి బేసిన్లో కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా సోమశిల, కండలేరుకు తరలించి అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లేలా తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్‌్కఫోర్స్ కమిటీ ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను సంప్రదించకుండానే బేసిన్‌లోని మిగతా రాష్ట్రాలతో మార్చి 6న హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించకపోవడంపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఛత్తీస్‌గఢ్ సర్కారుతో ఈ అంశంపై చర్చిస్తారని టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరాం ఆ సమావేశంలో పేర్కొన్నారు. కానీ.. ఇప్పటివరకూ ఛత్తీస్‌గఢ్‌ను కేంద్రం సంప్రదించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏకంగా అనుసంధానంపై ఒప్పందాన్ని అజెండాగా చేర్చుతూ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం ఏర్పాటు చేసింది. -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్‌ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్‌ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
నికర జలాల మిగులు తేలాక కావేరికి గోదావరి
ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన: ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా వాటిని సోమశిల, కండలేరుకు తరలించి.. అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లాలి. ఆవిరి ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలి. దీని ప్రకారం పనులు చేపట్టాలంటే తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సారవంతమైన భూములను సేకరించాలి. ఇది ఖర్చుతోనూ కూడుకున్నది. సారవంతమైన భూములను సేకరించడం అతి పెద్ద సవాల్. సీఎం జగన్ చేసిన ప్రతిపాదన: పోలవరం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి కృష్ణా నది మీదుగా రివర్స్ పంపింగ్ చేస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలించి.., పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా తెలుగు గంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించి.. అక్కడి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలి. దీని ప్రకారం పనులు చేపట్టడానికి తెలంగాణలో అతి తక్కువ భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఏపీలో భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో గోదావరి–కావేరి అనుసంధానం చేయడమే కాదు దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చు. సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. 75 శాతం లభ్యత (నికర జలాలు) ఆధారంగా మిగులు జలాలు ఉన్నాయని తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన టాస్క్‌ఫోర్స్ 17వ సమావేశంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా – పెన్నాలను అనుసంధానం చేసి దేశంలో నదుల అనుసంధానికి ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని శశిభూషణ్‌కుమార్ గుర్తు చేశారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంలో దిగువ రాష్ట్రమైన తమ హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి కుడి కాలువ ద్వారా దేశంలో అతి పెద్ద నదులైన గోదావరి, కృష్ణాను అనుసంధానం చేసి, 80 టీఎంసీలను తరలిస్తామని చెప్పారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం సానుకూలంగా స్పందించారు. సత్వరమే పోలవరాన్ని పూర్తి చేయడానికి సరిపడా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సూచిస్తానని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే ఇచ్చంపల్లి వద్ద గోదావరిలో నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ ప్రతినిధులను ఆహ్వానించకుండా ఆ రాష్ట్ర కోటా నీటిని వాడుకుంటామని ప్రతిపాదించడంపై ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే అనుసంధానం చేపట్టాలని స్పష్టంచేశారు. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకునే సమయానికి గోదావరికి మహానది జలాలను తరలిస్తామని, వాటిని కావేరికి తీసుకెళ్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ చర్చలు జరుపుతారని తెలిపారు. పోలవరం నుంచి గోదావరి తరలింపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను వెదిరె శ్రీరామ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన మేరకు అనుసంధానం చేపడితే.. భూసేకరణ సమస్య లేకుండా, అతి తక్కువ వ్యయంతో కావేరికి గోదావరి జలాలను తరలించవచ్చని వివరించారు. దీనివల్ల ఐదు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం చేకూర్చవచ్చని చెప్పారు. సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని తెలంగాణ అధికారులు సూచించారు. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని వెదిరె శ్రీరాం చెప్పారు. -
గోదావరి–కావేరి అనుసంధానానికి రూ. 39,275 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్లో ఈ విషయాలను ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. ఏ బేసిన్‌కు ఎంత వాటా?: గోదావరి బేసిన్లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంటోంది. 141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్‌బేసిన్‌లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది. -
గోదావరి–కావేరి లింక్‌కు సై!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. తొలిదశలో 141 టీఎంసీలు, రెండోదశలో మరో 236 టీఎంసీలు కలిపి మొత్తం 377 టీఎంసీలను తరలిస్తామని వెల్లడించారు. గోదావరి జలాల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని వాటానే తొలిదశలో తరలిస్తామని, మహానది–కావేరి అనుసంధానం పూర్తైన తర్వాత దాని ద్వారా వచ్చే జలాలను రెండోదశలో తరలిస్తామని వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో నదుల అనుసంధానంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యప్రసాద్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైందని, దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అందులో భాగంగానే కెన్–బెట్వా అనుసంధానాన్ని చేపట్టామని గజేంద్రసింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నదుల అనుసంధానంపై రాష్ట్రాల అనుమానాలు తొలిగిపోతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల సమ్మతి కోసం ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు సైతం కేటాయించినట్టు గుర్తుచేశారు. మహానది–గోదావరి అనుసంధానం జరపాలి ముందుగా మహానది–గోదావరి ఆ తర్వాత గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాల లభ్యతలేదని నిర్ధారించిన తర్వాత ఛత్తీస్‌గఢ్ అనుమతి లేకుండా ఆ రాష్ట్రం వాడుకోని వాటాను ఏ విధంగా తరలిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడుతున్నందున రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో నీరందని ఆయకట్టుకు నీటిని కేటాయించాలని కోరింది. కృష్ణాలో 18 టీఎంసీలతో బెడ్తి–వారాదా అనుసంధానం ప్రాజెక్టును కర్ణాటకలో చేపడుతున్నందున ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆ నీటిలో భాగస్వామ్య రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో తెలంగాణకు 9 టీఎంసీలు కేటాయించాలని కోరింది. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుంచే చేపట్టాలని ఏపీ సూచించింది. పోలవరం నుంచి పులిచింతల, నాగార్జునసాగర్, రాయలసీమ మీదుగా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్‌పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు. -
గోదావరి.. కావేరి కలిపేద్దాం
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియపై కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న కేంద్రం..ఇటీవల ఆ ప్రక్రియపై వేగం పెంచుతోంది. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. పరీవాహక రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒక్కొక్కటీ పరిష్కరించి వారిని ఒప్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ భేటీ జరగనుంది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. మరోవైపు జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నదుల అనుసంధానంపై తన తదుపరి సమావేశాన్ని ఈనెల 29న హైదరాబాద్‌లోని జలసౌధ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను ఆహ్వానించింది. నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటాలు, ఆయకట్టు, ముంపు సమస్యలతో పాటు రాష్ట్రాలు లేవనెత్తే ఇతర అంశాలపై ఇందులో చర్చించనుంది. తమిళనాడు ఒత్తిడితో ముందుకు... నదుల అనుసంధానంలో భాగంగా మహానది–గోదావరి–కృష్ణా–కావేరి గ్రాండ్ ఆనకట్టల వరకు నీటిని తరలించే ప్రక్రియ ఉన్నప్పటికీ.. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం మహానది–గోదావరి అనుసంధానాన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని భావించింది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని పేర్కొంటూ, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలించేలా రూ.86 వేల కోట్లతో ప్రణాళిక రచించింది. అయితే ఇంద్రావతి నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తాము కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ఇంద్రావతి నీరు సరిపోతుందని, అలాంటప్పుడు ఇంద్రావతిలో మిగులు జలాలు ఉండవని అంటోంది. దీనికి తోడు ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపడితే తమ ప్రాంతంలోని 4 గ్రామాలకు ముంపు సమస్య తలెత్తుతుందని పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలు కూడా గోదావరి–కావేరి అనుసంధానంపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. అయితే దిగువ రాష్ట్రమైన తమిళనాడు మాత్రం ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని పట్టుబడుతోంది. తమ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా 200 టీఎంసీల మేర నీటినైనా తమ సరిహద్దు వరకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనితో పాటు పూండీ రిజర్వాయర్‌ను ఆరనియార్ రిజర్వాయర్‌తో అనుసంధానించాలని, దీనిద్వారా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న 609 చెరువులు నింపేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలు ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది. మిగులు స్వేచ్ఛను హరించొద్దన్న ఏపీ ఇక పోలవరం వద్ద నీటి లభ్యత విషయంలో ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ల లెక్కల మధ్య పొంతన లేదని ఏపీ అంటోంది. నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరుతోంది. నికర జలాలు వాడుకోగా మిగిలిన జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ కి కేటాయించారని, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇచ్చారని, ఇప్పుడు నీటిని కావేరికి తరలించే క్రమంలో ఏపీ హక్కులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ హక్కుల పరిరక్షణలో భాగంగా పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల తరలింపు, గోదావరి–పెన్నా లింకు ద్వారా 320 టీఎంసీలు తరలింపు ప్రణాళికలను పరిశీలించాలని కోరుతోంది. వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. మహానది నీటిని తరలించాకే అంటున్న రాష్ట్రం గోదావరి–కావేరి అనుసంధాన డీపీఆర్ ఆమోదించేందుకు ముందుగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత అంశాలపై రాష్ట్రాలు, కేంద్ర జలసం ఘం ఆమోదం తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. దీంతో పాటే మొత్తంగా తరలించే నీటిలో 50 శాతం నీటి వాటాను తెలంగాణకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా భూసేకరణ అవసరం కానున్న దృష్ట్యా ఆ రాష్ట్రాలతో చర్చించాకే తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని అంటోంది. గోదావరి నీటిని కావేరికి తరలించే ముందు తెలంగాణలో ఇచ్చంపల్లి ఎగువన ఉన్న దేవాదుల, తుపాకులగూడెం అవసరాలు, దిగువన ఉన్న సీతారామ ఎత్తిపోతల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, డీపీఆర్‌ను ఆమోదించే ముందే ఆయా ప్రాజెక్టుల నెలవారీ అవసరాలను లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. గోదావరి–కావేరి అనుసంధానానికి ముందే మహానది–గోదావరి అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని, అక్కడి నుంచి మిగులు జలాలను గోదావరికి తరలించాకే, గోదావరి జలాలు కావేరికి తరలించాలని కోరుతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్‌గా ప్రతిపాదించే ముందు బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ప్రకారం ఉన్న కేటాయింపుల్లో కృష్ణా బేసిన్లో నీటి అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇచ్చంపల్లి ప్రతిపాదన తుపాకులగూడెం ఫోర్‌షోర్‌లో ఉన్న నేపథ్యంలో దీనిద్వారా దేవాదుల, ఎస్సారెస్పీలపై పడే ప్రభావా న్ని అధ్యయనం చేయాలని కూడా కోరుతోంది. -
కావేరికి గోదారి.. ఏపీ అవసరాలను తీర్చాకే
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సహకరించాలన్న జల్‌శక్తి శాఖ కార్యదర్శి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడాన్ని అంగీకరించబోమంది. అదనపు వాటా కోసం పట్టు.. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్‌కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఏం చెప్పిందంటే.. ► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్‌కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్‌లో కావేరికి గోదావరిని తరలించరాదు. ► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది. -
AP: గోదావరి–పెన్నా అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో నిర్వహించే జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో నదుల అనుసంధాన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొంటారు. తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలకు తరలించి.. కావేరి గ్రాండ్ ఆనకట్టలోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదులను అనుసంధానం చేసేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించింది. ఈ డీపీఆర్‌పై ఆ నదీ పరీవాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. గోదావరిలో మిగులు జలాలే లేవని.. ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చాక మిగిలిన నీటినే కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) లెక్కలకు పొంతన లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని సూచించింది. గోదావరి నుంచి తరలించే నీటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఆయకట్టుకు నీళ్లందిస్తారో స్పష్టంగా చెప్పాలని సూచిస్తూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అధికారులు మరోసారి కేంద్రానికి వివరించనున్నారు. -
ముందుకా.. వెనక్కా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై మళ్లీ కదలిక వచ్చింది. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చిన ఇచ్ఛంపల్లి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు నీటి తరలింపుపై పరీవాహక రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యతపై భిన్న వాదనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మరోమారు సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 17న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్ బాడీ నదుల అనుసంధాన ప్రక్రియపై కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో చర్చించనుంది. మిగులు జలాల తరలింపు విషయంలో ఛత్తీస్‌గఢ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, రాష్ట్ర అవసరాలు తీరాకే నీటిని తరలించాలంటున్న తెలంగాణ, ఏపీ వాదనల నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇంద్రావతిలో మిగులుందని ముందుకు పోవద్దు.. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఇప్పటికే జనంపేట, అకినేపల్లి, తుపాకులగూడెం నుంచి నీటిని తరలించే ప్రణాళికలు తెరపైకి తెచ్చిన కేంద్రం వాటిపై తెలంగాణ ఆమోదం లేని నేపథ్యంలో మళ్లీ ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అటునుంచి నీటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనకు ప్రాణం పోస్తోంది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి మొత్తంగా ఇచ్ఛంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.86వేల కోట్ల అంచనాతో ఇదివరకే రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రాలకు పంపింది. అయితే ఇందులో ఇంద్రావతిలో లభ్యతగా ఉన్నాయని చెబుతున్న 273 టీఎంసీల నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలున్నాయంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీలు వినియోగిస్తామని అంటోంది. ఒకవేళ మిగులు ఉందని చెప్పి వేల కోట్ల ఖర్చుతో అనుసంధాన ప్రక్రియ చేపడితే, భవిష్యత్తులో తాము నీటి వినియోగం మొదలుపెట్టేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తే నీళ్లే ఉండవని, అప్పుడు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని హెచ్చరిస్తోంది. ఛత్తీస్‌గఢ్ వాదనతో తెలంగాణ సైతం ఏకీభవిస్తోంది. ఏ నదీ బేసిన్‌లోని నీటిని ఆ బేసిన అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు తరలించాలని ట్రిబ్యునల్స్, చట్టాలు చెబుతున్నాయని అంటోంది. ఛత్తీస్‌గఢ్ అవసరాలు తీరకుండా, వాటికి హక్కు ఇవ్వకుండా మిగులు నీటిని ఇతర బేసిన్లకు తరలించడం కష్టమేనని చెబుతోంది. ఇంద్రావతి జలాలపై స్పష్టత ఇచ్చాకే ముందుకెళ్లాలని అంటోంది. -
ఇచ్చంపల్లి నుంచే 'అనుసంధానం'!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆదేశించింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 85 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేందుకు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలను తరలిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని నీటి పారుదల, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) పరిధిలోని, అనుసంధానం వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా టాస్క్ ఫోర్స్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ 2 ప్రతిపాదనలు ఇవీ.. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట)కు మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించే 247 టీఎంసీల్లో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్ ఫోర్స్ కమిటీకి పంపింది. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం.. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తే టాస్‌్కఫోర్స్ కమిటీ పేర్కొన్న మేరకు ప్రయోజనం ఉండదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమై పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని పేర్కొంటున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. లోయర్ గోదావరి సబ్ బేసిన్(జీ–10)లో ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిరి్మంచడానికి 1975 డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 85 టీఎంసీలను మాత్రమే ఇచ్చంపల్లి నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వినియోగించుకోవాలి. ఇచ్చంపల్లిలో అంతర్భాగమైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో ఉమ్మడి ఏపీ 27 శాతం, మహారాష్ట్ర 35 శాతం, మధ్యప్రదేశ్ 38 శాతం చొప్పున భరించాలి. విద్యుత్‌ను ఇదే దామాషాలో పంచుకోవాలి. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసిన జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉంటుంది. అభిప్రాయాలను తీసుకోకుండానే.. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ జానంపేట నుంచి గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదనను తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జానంపేట పరిసర ప్రాంతాల నుంచి గోదావరి జలాలను తరలించడానికి ప్రాజెక్టులు చేపట్టిందని, వాటి ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని జానంపేట నుంచి చేపడితే తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు ఈ అనుసంధానం పరిధిలోకి వస్తుందని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచే కావేరికి గోదావరి జలాలను తరలించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ ప్రతులను ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు పంపిన టాస్‌్కఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం పనులు చేపట్టేలా డీపీఆర్ రూపొందించాలని ఆదేశించింది. బేసిన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకల అభిప్రాయాలను తీసుకోకుండానే కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని నీటిపారుదలరంగ, న్యాయ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
కృష్ణమ్మ కట్టడికి కర్ణాటక కాకి లెక్కలు!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సింహభాగం ప్రజలకు జీవనాధారమైన కృష్ణమ్మను కట్టడి చేసేందుకు కర్ణాటక సర్కారు కాకి లెక్కలతో మాస్టర్ ప్లాన్ వేసింది! సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2(కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్) తీర్పును కేంద్రం ఇంతవరకూ నోటిఫై చేయకున్నా ఆ తీర్పు ఆధారంగా దక్కిన 183 టీఎంసీల మిగులు జలాల్లో 174 టీఎంసీలను వినియోగించుకునేలా అప్పర్ కృష్ణా మూడో దశ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులను చేపట్టింది. అక్కడితో ఆగలేదు సరికదా లేని హక్కులను ఉన్నట్లుగా చిత్రీకరించి అదనంగా నీటిని వాడుకోవడానికి ఎత్తులు వేస్తోంది. తనకు తానే వాటాలు.. కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అప్పటి పరిస్థితులను బట్టి కర్ణాటకకు 21 టీఎంసీలు అదనంగా కేటాయించే అంశాన్ని పరిశీలించాలని గోదావరి ట్రిబ్యునల్ పేర్కొంది. దీని ప్రకారం కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు 23 టీఎంసీలు (21 టీఎంసీలు + రెండు టీఎంసీలు పునరుత్పత్తి ద్వారా వచ్చే నీరు) వాటా వస్తుందని కర్ణాటక సర్కార్ లెక్కలు వేసింది. మరోవైపు ద్వీపకల్ప నదులైన మహానది, కృష్ణా, గోదావరి, కావేరి, పెన్నాను అనుసంధానం చేయడం ద్వారా ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించే నీటికిగాను కృష్ణా జలాల్లో తమకు అదనంగా 216 టీఎంసీలు వాటా వస్తుందని తేలి్చంది. వెరసి 1,156 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టులను చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కర్ణాటక సర్కారు ఇటీవల ఆ రాష్ట్ర జలవనరులశాఖను ఆదేశించడంపై నీటిపారుదలరంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు ద్వీపకల్ప నదుల అనుసంధానం కార్యరూపం దాల్చేది ఎన్నడని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక సర్కార్ వాస్తవాలను విస్మరించి తనకు తానుగా వాటాలు కేటాయించుకుని ఆ మేరకు నీటిని వినియోగించుకోవడానికి ఏకపక్షంగా ప్రాజెక్టులను చేపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకుండానే.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెలీ్ప)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ఆ తీర్పును అమలు చేస్తూ కేంద్రం ఇప్పటిదాకా ఉత్తర్వులు (నోటిఫై) జారీ చేయలేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కర్ణాటకకు 734 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యతకూ.. 75 శాతం నీటి లభ్యతకు మధ్యన ఉన్న 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు(కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)కు కేటాయించింది. ఇందులో తమకు 183 టీఎంసీల వాటా వస్తుందని తేలి్చన కర్ణాటక అందులో 174 టీఎంసీలను వినియోగించుకోవడానికి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు మూడో దశ పనులను చేపట్టడానికి అనుమతి కోరుతూ సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కు ఇటీవలే డీపీఆర్ అందజేసింది. సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వకుండానే ఇప్పటికే పనులను కూడా ప్రారంభించడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. అనుసంధానం వద్దంటూనే వాటాలు.. నదుల అనుసంధానం ద్వారా దుర్భిక్షాన్ని తరిమికొట్టాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు దిశానిర్దేశం చేసి రెండు దశాబ్దాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 16 రకాల ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఆల్మట్టి(కృష్ణా)–కాలువపల్లి(పెన్నా) అనుసంధానాన్ని కర్ణాటక ప్రభుత్వమే వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. దీంతో నదుల అనుసంధానం కేవలం కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న కర్ణాటక సర్కార్ మరోవైపు ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు మళ్లించే జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు అదనంగా 216 టీఎంసీల వాటా వస్తుందని తనకు తానుగానే కేటాయించుకుని ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు జమయ్యాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్లూడీఏ) శుక్రవారం ఆ మొత్తాన్ని జమ చేసింది. గత శుక్రవారం ఈ మొత్తాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)కు నాబార్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్ చేస్తూ ఈ నిధులను ఎన్‌డబ్ల్యూడీఏ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.17,665.29 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఏప్రిల్ 1, 2014 తర్వాత రూ.12,529.42 కోట్లను ఖర్చు చేసింది. అందులో ఇప్పటివరకూ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రీయింబర్స్ చేసింది. తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ చేసిన రూ.2,234.28 కోట్లను కలుపుకుంటే.. రూ.10,741.54 కోట్లను రీయింబర్స్ చేసింది. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ.1787.88 కోట్లు బకాయి పడింది. -
మా అవసరాలను తీర్చాకే.. కావేరికి గోదావరిని తరలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవసరాలు పూర్తిగా తీర్చాకనే గోదావరి జలాలను కావేరి(గ్రాండ్ ఆనకట్ట) నదికి మళ్లించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ అనుసంధానంలో ఇచ్చంపల్లి, జానంపేటతోపాటు పోలవరం నుంచి తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా అధ్యక్షతన సోమవారం జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌బ్ల్యూడీఏ) సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానంపై వాటి బేసిన్ల పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ జలవనరుల శాఖ అధికారులతో కేంద్రమంత్రి ఈ సందర్భంగా సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. మా అవసరాలు తీర్చాకనే.. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. 1.ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట), 2.అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట) 3.జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట). గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలని ప్రతిపాదించింది. ఇక జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలంది. అయితే ఏపీలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల మా రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాల్ని మళ్లించాలని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేనేలేవన్నారు. లేని మిగులు జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్కలు తేల్చాలని సూచించారు. ప్రస్తుతం సముద్రంలో కలుస్తున్న జలాల్లో అధిక భాగం ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో వినియోగించుకోనివేనన్నారు. ఈ నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలన్నారు. కాగా, పోలవరం ఎగువ నుంచి గోదావరి–కృష్ణా–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్–పెన్నా–కావేరి అనుసంధానం ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నారాయణరెడ్డి సూచించారు. దీనివల్ల నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించవచ్చునన్నారు. ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. -
పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్మెంట్ కింద ఎన్‌డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమ చేయనుంది. కాగా 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి . ఇప్పటివరకు రూ.8,507 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇంకా రూ.1788 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.