సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న నదీ జలాలను.. నీటి కొరత ఉన్న నదులకు మళ్లించడం ద్వారా దేశంలో కరవు పరిస్థితులను రూపుమాపవచ్చుననే లక్ష్యంతో చేపట్టిన నదుల అనుసంధానానికి నదీ జల వివాదాల ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారాయని కేంద్రానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నివేదించింది. ట్రిబ్యునళ్ల అవార్డులను చూపి.. నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లోని రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడుతున్నాయని పేర్కొంది. నదుల అనుసంధానానికి వాటి బేసిన్‌ల పరిధిలోని రాష్ట్రాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో కెన్–బెటా్వమినహా మిగతా అనుసంధానాలు ప్రతిపాదన దశను దాటడం లేదని వివరించింది.
ఈ అంశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. దేశంలో హిమాలయ నదుల అనుసంధానానికి 14.. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 లింక్‌లను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానంపై బేసిన్‌ల పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది.
కాగా, పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మిగతా 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. కావేరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కూడా ఇదే రీతిలో నిర్ణయాలను ప్రకటించాయి. ఇప్పుడు ఆ ట్రిబ్యునళ్ల అవార్డులను చూపుతున్న రాష్ట్రాలు.. నదుల అనుసంధానం ద్వారా మళ్లించే నీటిలో అదనపు వాటా కోసం పట్టుబడుతున్నాయి.
గోదావరి–కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల) మీదుగా కావేరికి తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన అమలు చేస్తే.. కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటకలు పట్టుబడుతున్నాయి. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ డిమాండ్ చేస్తున్నాయి. దాంతో ఈ అనుసంధానంపై ఏకాభిప్రాయం సవాల్‌గా మారింది.
విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే..:
నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత తీవ్రంగా ఉన్న నదులకు మళ్లించే నీటి విషయంలో రాష్ట్రాలతో సంప్రదించి, కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే నదుల అనుసంధానం పట్టాలెక్కే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూడీఏనే స్పష్టం చేస్తోంది. ఒక నది నుంచి మళ్లించిన నీటికిగానూ.. మరొక నదిలో అదనపు వాటా వాడుకోవడానికి ట్రిబ్యునళ్లు ఇచ్చిన అనుమతిని నదుల అనుసంధానానికి మినహాయిస్తేనే నదుల అనుసంధానం సాకారమవుతుందని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment