గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలతో వెనక్కి తగ్గిన ఎన్‌డబ్ల్యూడీఏ
సమ్మక్క బ్యారేజ్, కంతనపల్లి, పోలవరం నుంచి కావేరికి గోదావరిపై అధ్యయనం
సమ్మక్క బ్యారేజ్ లేదా కంతనపల్లి నుంచి అనుసంధానం చేపట్టాలన్న తెలంగాణ
సాక్షి, అమరావతి : గోదావరి ట్రిబ్యునల్ అవార్డు.. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలన్న ప్రతిపాదనను జాతీయ జలవనరుల అభివృద్ధి (ఎన్‌డబ్ల్యూడీఏ) సంస్థ పునఃసమీక్షిస్తోంది. ఇచ్ఛంపల్లికి దిగువన సమ్మక్క బ్యారేజ్, కంతనపల్లి, పోలవరం ప్రాజెక్టుల నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై తాజాగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఇచ్ఛంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా రెండున్నరేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎన్‌డబ్ల్యూడీఏ.. పరీవాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. కానీ, ఇచ్ఛంపల్లి నుంచి 85 టీఎంసీలను మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదని 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు..
ఇచ్ఛంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 108 మీటర్లకు 1986–88లో తగ్గించారు. నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు ఎన్‌డబ్ల్యూడీఏ తగ్గించింది.
బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు తగ్గించినా ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీనిపై ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి బేసిన్‌లో ఇంద్రావతి సబ్ బేసిన్‌లోని తమ కోటాలో వాడుకోని జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏని నిలదీసింది. కాదూ కూడదని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పింది.
దిగువన కట్టాలని తెలంగాణ ప్రతిపాదన..
ఇక ఇచ్ఛంపల్లికి 24 కిమీల దిగువన తెలంగాణ సర్కార్ ఇప్పటికే గోదావరిపై సమ్మక్క బ్యారేజ్‌ను నిర్మించింది. గోదావరిపై ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే.. గరిష్ఠంగా వరద వచ్చినప్పుడు ఆకస్మికంగా దిగువకు విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశముందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తంచేసింది.
ఇచ్ఛంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ లేదా కంతనపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలని సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సర్కార్‌ల అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి గోదావరి తరలింపుపై ఎన్‌డబ్ల్యూడీఏ పునరాలోచనలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment