Cauvery
-
అంగీకరించకపోతే పక్కన పెట్టేస్తాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్రా లన్నీ సమ్మతి తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుడు వైఖరిని అవలంబిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదలదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టక తప్పదని తేల్చి చెప్పారు. రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంత గరిష్టంగా నీటి కేటాయింపులు చేశామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలే తరలిస్తున్నందున కేటాయింపులు పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని కూడా చెప్పారు. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధిపతులతో ఢిల్లీలో ప్రత్యక్ష విధానంలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దేబశ్రీ సూచించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తెలంగాణకు 50% కోటా ఇవ్వలేం..ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో 50 శాతం తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను దేబశ్రీ తోసిపుచ్చారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించడానికి బదులు సమ్మ క్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలనే తెలంగాణ ప్రతి పాదనలను పరిశీలి స్తున్నామని చెప్పారు. సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉండే నీళ్లను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించాలని, ఆ మేరకు నీటి లభ్యతను తేల్చడానికి సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలన్న రాష్ట్రం సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్రం చేసిన మరో ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చిన తర్వాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని చెప్పారు. తక్కువ భూసేకరణ చేసేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను రూపొందించాలని కోరగా దేబశ్రీ అంగీకరించారు. పోలవరం నుంచి అనుసంధానం సాధ్యం కాదుపోలవరం ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని దేబశ్రీ తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలిస్తే ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి మాత్రమే లబ్ధి పొందుతాయని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భాగస్వామ్యం కోల్పోతాయని స్పష్టం చేశారు. ఏపీ భూభాగం పరిధిలో రెండు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకకు కోటా పెంచలేం..తమ రాష్ట్ర భూభాగంలో మాత్రమే జరగనున్న బెడ్తి–వార్దా నదుల అనుసంధానం ప్రాజెక్టును గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిపై దేబశ్రీ ముఖర్జీ సానుకూలంగా స్పందించారు. గోదావరి–కావేరి ప్రాజెక్టులో కర్ణాటకకు 16 టీఎంసీల తాగునీరు మాత్రమే కేటాయించారని, సాగునీరును సైతం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. తాము ఇప్పటికే సమ్మతి తెలుపుతూ ఎంఓయూపై సంతకాలు చేశామని తమిళనాడు, పుదుచ్చేరిలు తెలిపాయి. తమ రాష్ట్రం సొంతంగా చేపట్టిన దామన్‌గంగా–వైతర్ణ–గోదావరి నదుల అనుసంధానాన్ని గోదావరి–కావేరి ప్రాజెక్టు కింద చేర్చాలని మహారాష్ట్ర విజ్ఞప్తి చేసింది. -
కావేరికి గోదావరి.. ఇచ్ఛంపల్లి నుంచి లేనట్లే!
సాక్షి, అమరావతి : గోదావరి ట్రిబ్యునల్ అవార్డు.. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలన్న ప్రతిపాదనను జాతీయ జలవనరుల అభివృద్ధి (ఎన్‌డబ్ల్యూడీఏ) సంస్థ పునఃసమీక్షిస్తోంది. ఇచ్ఛంపల్లికి దిగువన సమ్మక్క బ్యారేజ్, కంతనపల్లి, పోలవరం ప్రాజెక్టుల నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై తాజాగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇచ్ఛంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా రెండున్నరేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎన్‌డబ్ల్యూడీఏ.. పరీవాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. కానీ, ఇచ్ఛంపల్లి నుంచి 85 టీఎంసీలను మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదని 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు..ఇచ్ఛంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 108 మీటర్లకు 1986–88లో తగ్గించారు. నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు ఎన్‌డబ్ల్యూడీఏ తగ్గించింది. బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు తగ్గించినా ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీనిపై ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి బేసిన్లో ఇంద్రావతి సబ్ బేసిన్‌లోని తమ కోటాలో వాడుకోని జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏని నిలదీసింది. కాదూ కూడదని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పింది.దిగువన కట్టాలని తెలంగాణ ప్రతిపాదన..ఇక ఇచ్ఛంపల్లికి 24 కిమీల దిగువన తెలంగాణ సర్కార్ ఇప్పటికే గోదావరిపై సమ్మక్క బ్యారేజ్‌ను నిర్మించింది. గోదావరిపై ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే.. గరిష్ఠంగా వరద వచ్చినప్పుడు ఆకస్మికంగా దిగువకు విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశముందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇచ్ఛంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ లేదా కంతనపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలని సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సర్కార్ల అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి గోదావరి తరలింపుపై ఎన్‌డబ్ల్యూడీఏ పునరాలోచనలో పడింది. -
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
Operation Kaveri: సూడాన్ నుంచి మరో 754 మంది రాక
న్యూఢిల్లీ/కైరో: సూడాన్‌లో చిక్కుకుపోయిన మరో 754 మంది భారతీయులు ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం స్వదేశం చేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా 1,360 మందిని తీసుకొచ్చినట్టు చెప్పారు. వీరిలో 17 మంది తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ తెలిపింది. మరోవైపు సూడాన్‌లో హింస ఆగడం లేదు. 72 గంటల కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించి గంటలైనా కాకుండానే రాజధాని ఖార్టూమ్, ఒండుర్మన్, కఫౌరీల్లో పోరు తీవ్రమైంది. -
సూడాన్ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్ కావేరి
న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించింది. ‘ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నారు. మరికొందరు వస్తున్నారు. వీరి కోసం అక్కడ ఓడలు, విమానాలను సిద్ధంగా ఉంచాం. సూడాన్‌లోని ప్రతి భారతీయుడికీ సాయంగా నిలుస్తాం’అని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నేవీకి చెందిన ఒక షిప్‌ను సూడాన్‌లోని ఒక పోర్టులో కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. మరోవైపు, సూడాన్‌లో ఉండిపోయిన తమ పౌరులు, దౌత్య సిబ్బంది తరలింపును పలు యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం సూడాన్ నుంచి వెనక్కి తీసుకువచ్చిన 28 దేశాలకు చెందిన 388 మందిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. సూడాన్ నౌకాశ్రయంలో భారతీయులు -
ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదారి
లెక్కలకు పొంతనేదీ?: ఏపీ ♦గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), వ్యాప్కోస్, ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కలకు పొంతన లేదు. నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ♦75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిలో 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ లెక్క కట్టింది. ఇందులో 775 టీఎంసీలను వినియోగించుకునేలా ఏపీ, 655 టీఎంసీలను వాడుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టినందున కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదు. ♦జీ–1 నుంచి జీ–11 వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించింది. మిగులు జలాలపై స్వేచ్ఛ ఇచ్చింది. ♦అనుసంధానం చేపట్టేటప్పుడు దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించాలి. ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ♦కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యం. మహానది నుంచి 229 టీఎంసీలను పోలవరం దిగువన గోదావరిలో పోస్తే ఏం ప్రయోజనం? ధవళేశ్వరం నుంచి వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిందే. ♦లభ్యతను శాస్త్రీయంగా తేల్చి ఏపీలో దుర్భిక్ష ప్రాంతాల అవసరాలు తీర్చాకే మిగిలిన నీటిని ఇతర రాష్ట్రాలకు తరలించేలా అనుసంధానం చేపట్టాలి. మాకు గరిష్టంగా కేటాయించాలి: తెలంగాణ సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై తొమ్మిది రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. శాస్త్రీయంగా అధ్యయనం చేసి గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే అనుసంధానం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పష్టం చేయగా తమకు కేటాయించిన నీటిని తరలించేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్‌గఢ్ పేర్కొంది. కృష్ణా బేసిన్‌కు తరలించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబట్టగా కావేరి నీటిలో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. మహానదిలో నీటి లభ్యత లేని నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానంపై ఒడిశా, మధ్యప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కావేరికి కనీసం 216 టీఎంసీల గోదావరి జలాలనైనా తరలించాలని తమిళనాడు, పుదుచ్చేరి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాకే నదుల అనుసంధానాన్ని చేపడతామని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్ తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయం సాధించే లక్ష్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి భోపాల్‌సింగ్ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ వర్చువల్ విధానంలో తొమ్మిది రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. బేసిన్లు.. ట్రిబ్యునళ్ల అవార్డులు పక్కన పెట్టండి నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి జలాలను మళ్లించడం ద్వారా దేశంలో తాగు, సాగునీటి కష్టాలను అధిగమించేందుకు అనుసంధానం చేపట్టామని భోపాల్‌సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇచ్చంపల్లి నుంచి జూన్ – అక్టోబర్ల మధ్య 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ప్రతిపాదన రూపొందించామన్నారు. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 79.94, తెలంగాణకు 65.8, తమిళనాడుకు 84.01 టీఎంసీలను ఇస్తామన్నారు. తద్వారా కోటి మందికి తాగునీరు పది లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని చెప్పారు. రూ.85 వేల కోట్లతో చేపట్టే అనుసంధానం డీపీఆర్‌ను బేసిన్ పరిధిలోని తొమ్మిది రాష్ట్రాలకు పంపామన్నారు. మహానది– గోదావరి అనుసంధానం ద్వారా రెండో దశలో కావేరికి 229 టీఎంసీలను తరలిస్తామన్నారు. నీటి లోటు ఎదుర్కొంటున్న కృష్ణా, కావేరిలకు జలాలను తరలించాలనే కృత నిశ్చయంతో కేంద్రం ఉందన్నారు. బేసిన్లు, ట్రిబ్యునళ్ల అవార్డులను పక్కన పెట్టి దేశ విశాల ప్రయోజనాల కోసం అనుసంధానానికి సహకరించాలని కోరారు. -
మహానదే ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. గోదావరి బేసిన్లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ, ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి– కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... మొదట మహానది– గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి–కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. మహానదిలో మిగులు 100 టీఎంసీలే: ఒడిషా ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది. తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాలోŠల్ కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహానది–గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి–కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. చత్తీస్‌గఢ్ కొర్రీ... ఇక గోదావరి– కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటంతో వరంగల్ దగ్గర్లోని జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌న్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని కూడా తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మిగులు ఉన్నాయని చెబుతున్న ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే ఉపయోగించుకుంటామని ఎన్‌డబ్ల్యూడీఏ ముందు చత్తీస్‌గఢ్ గట్టిగా వాదిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీల వినియోగం చేస్తామని అంటోంది. దీంతో తెలంగాణ సైతం మహానదిలో మిగులు నీటిని గోదావరికి తరలించి, రాష్ట్ర అవసరాలు తీర్చుతూ మిగులు నీటిని కావేరికి తరలించాలని పట్టుబడుతోంది. దీంతో పాటే ఎగువన రాష్ట్రాలు వారి రాష్ట్రాల సరిహద్దు పరిధిలో అంతర్గత నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాయని, దీనిద్వారా దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి లభ్యత తగ్గుతుందని అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. -
మరో భారీ విగ్రహం.. ఈసారి కర్ణాటక వంతు
బెంగళూరు: దేశంలో నగరాల పేర్ల మార్పు, పోటాపోటిగా అతిపెద్ద విగ్రహాల నిర్మాణాల జోరు ఊపందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో నర్మదా నది తీరాన ఆవిష్కరించిన 597 అడుగుల ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వివిధ రాష్ట్రాలు కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంతకాకున్నా భారీ విగ్రహాలే నిర్మించేలా సన్నాహకాలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలు విగ్రహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా తాజాగా కర్ణాటక కూడా ఈ జాబితాలోకి చేరింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని రాజా సాగర రిజర్వాయర్‌లో 125 అడుగుల కావేరీ మాత విగ్రహాన్ని నిర్మించాలని జేడి(ఎస్)-కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇక్కడే ఓ మ్యూజియం కాంప్లెక్స్‌ను, రెండు గ్లాస్ టవర్స్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సుమారు 1200 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేయడం లేదని, విరాళాల ద్వారా సేకరిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే పటేల్ విగ్రహ నిర్మాణం కోసం భారీ ఖర్చుచేయడం పట్ల విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు కర్ణాటకలో తమ సంకీర్ణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్ట్‌పై ఏం సమాధానం చెబుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
కావేరిపై కేబినెట్
• మంత్రి ఓపీఎస్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చ • స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశమే నేపథ్యం సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత 33 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమ్మ అనారోగ్యంతో పరిపాలన కుంటు పడకుండా సీఎం స్వాధీనంలో ఉన్న శాఖలను సైతం గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇటీవల పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన తొలి కేబినెట్ సమావేశం జరుగగా, సోమవారం రెండోసారి కేబినెట్ సమావేశమైంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మంత్రి పన్నీర్‌సెల్వం సహా 31 మంది మంత్రులు హాజరయ్యారు. కావేరీ నదీ జలాలపై కర్ణాటక, తమిళనాడు మధ్య సాగుతున్న పోరు, విపక్షాల విమర్శల నేపథ్యంలోనే మంత్రివర్గం సమావేశమైనట్లు సమాచారం. కావేరీ అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహంపైనే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయవర్గాల కథనం. అలాగే కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ బిల్లు, రేషన్ బియ్యం ధర పెంపు, ఉదయ్ విద్యుత్ పథకాన్ని తమిళనాడుకు అనుసంధానం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత వేతన చట్టం అమలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే రాత్రి 9 గంటల వరకు కేబినెట్ సమావేశం వివరాలు అధికారికంగా వెలువడ లేదు. -
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
-
తీరాన ప్రేమ ప్రవాహం
గమనం నదుల స్వగత కథనం అనగనగా ఓ అందమైన ప్రదేశం. ఆ పేరు చెబితే మంచి కాఫీ గుర్తొస్తుంది. కాఫీ మొక్కలు మొలవక ముందే నేనా నేలను చూశాను. చూడడమేంటి నేనక్కడే పుట్టాను. బ్రహ్మగిరి కొండల్లో సముద్ర మట్టానికి 1320 మీటర్ల ఎత్తులో కర్ణాటక రాష్ట్రంలో ఉందా ప్రదేశం. అదే మంచి కాఫీలాంటి కూర్గ్. కొడగు జిల్లా బ్రహ్మగిరి కొండల్లో తల కావేరి నా పుట్టిల్లు. తులాసంక్రమణం రోజు ఎగిరెగిరి పడతానని నన్ను విచిత్రంగా చూస్తారు. తులాసంక్రమణం ఒక్కరోజే అన్న మాటేంటి? నా ప్రవాహమే ఓ మెరుపుతీగలా ఉంటుంది. విద్యుల్లతలా తాకుతుంది. కొండల్లో పుట్టి పీఠభూమి మీదకు జారి అలా ప్రవహిస్తానో లేదో ఉన్నట్లుండి నేల మీద నుంచి లోయలోకి దూకేస్తాను. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో సాగరంలో సంగమించే వరకు ఎన్నెన్ని వింతల్ని చూస్తానో! ఎన్నెన్ని విడ్డూరాలకు నేనే కారణమవుతానో మాటల్లో చెప్పలేను. ఆ పేరెలా వచ్చిందంటే..! బ్రహ్మగిరి కొండల్లో నివసించే కావేర రాజు పిల్లల కోసం బ్రహ్మను వేడుకుంటూ తపస్సు చేశాడు. బ్రహ్మ సంతోషించి లోపాముద్ర అనే పుత్రికను ప్రసాదించాడు. కావేర రాజు కుమార్తె కావడంతో లోపాముద్ర క్రమంగా కావేరిగా వాడుకలోకి వచ్చేసింది- ఇదీ స్థానికులు నా పుట్టుక గురించి చెప్పే కథనం. అలాగే రాజు కుమార్తె నదిగా ఎందుకు మారిందనే సందేహం వచ్చే వారి కోసం వేరే కథనాలున్నాయి. లోపాముద్రను అగస్త్య మునికిచ్చి వివాహం జరిపిస్తూ ‘తన కుమార్తెను ఒంటరితనానికి గురి చేయకూడద’నే షరతు పెడతాడు రాజు. దాంతో ముని కావేరిని నీటిగా మార్చి కమండలంలో దాచుకుని తన వెంటే తీసుకెళ్లేవాడనీ, ఎక్కడ కరువు తాండవిస్తే అక్కడ కమండలాన్ని వంచేవాడని, అక్కడ వర్షాలు కురిసేవని ఓ కథనం. కవులకు ప్రోత్సాహాన్ని! నేను నీటి ప్రవాహాన్ని మాత్రమే కాదు, ఉరకలెత్తే ఉత్సాహాన్ని కూడా. కూర్గ్‌లో కాఫీతోటలు, చందన వృక్షాలు, దేవదారు చెట్లు, తమలపాకు తీగలు, గుబురు పొదలకు తోడుగా ఏలకుల సువాసనలు నా ప్రవాహమార్గాన్ని మనోహరంగా మారుస్తుంటాయి. కవుల కలాలకు ఇతివృత్తాన్నయ్యాను. చిత్రకారుల కుంచెలకు ఓ రూపంలా గోచరించాను. ఇక ఇంజనీర్లయితే నేను పలువురికి ఉపయోగపడేటట్లు స్కెచ్‌లు వేశారు. ఏడాదంతా వ్యవసాయానికి సాయంగా మారాను, రోజంతా దాహం తీర్చి, రాత్రయితే వెలుగులు విరజిమ్ముతున్నాను. నా తీరాన నివసించేవారంతా నన్ను ప్రేమిస్తుంటారు. కానీ ఇరుగు-పొరుగు రాష్ట్రాల పాలకులు నా కోసం పోట్లాడుకుంటున్నారు. బహమండలం దగ్గర కనక, గజోతి అనే రెండు చిన్న నదులు వచ్చి కలిశాయి. అప్పటికీ నాకు పెద్ద నది హోదా రాలేదు. హేమావతి, లక్ష్మణ్ తీర్థం కూడా తోడయిన తర్వాత నేను ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో విస్తరించాను. కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ నా నీటిలో సింహభాగాన్ని మింగేస్తుంటే... బిడ్డ కడుపు నింపిన తల్లిగా తృప్తిగా చూసుకుంటూ ముందుకు సాగాను. మైసూర్ బృందావన్ గార్డెన్స్‌ను చూస్తూ ప్రవహిస్తుంటే నా గమనం మీద నాకే మురిపెం కలుగుతుంటుంది. రాముని కోసం! కుశాల్ నగర్ దగ్గర నా గమనాన్ని పశ్చిమ ముఖంగా కొద్దిగా దిశ మార్చుకునేది రామనాథపురాను తాకి పరవశించడం కోసమే. రాముడు రావణాసురుడిని హతమార్చిన తర్వాత ఇక్కడకొచ్చి ఓ లింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుని ప్రార్థించాడని చెబుతారు. అందుకే చుంచనకట్టె మీదుగా పయనించి కోదండరాముని దర్శించుకుంటాను. కొంచెం సేపు ఎగిరే పక్షులను చూద్దామనుకుంటూ టిప్పుసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం మీదుగా రంగనాధిట్టు బర్డ్ శాంక్చురీ వైపు మళ్లుతాను. రాయల్‌ప్యాలెస్‌లో సుల్తాన్ బంగారు, వెండితో తీర్చిదిద్దిన రంగనాథ్ ఆలయం చూపు తిప్పుకోనివ్వలేదు. మరో పాతిక కిలోమీటర్లు దాటి సోమనాథపురా చేరితే హొయసల రాజులు నిర్మించిన లక్ష్మీకేశ్వర ఆలయం అద్భుతంగా ఉంది. దీనిని క్రీ.శ 1268లో హొయసల రాజు ముమ్ముడి నరసింహరాయులు ప్రతినిధి సోముడు కట్టించాడు. ఇందులో శిల్పనైపుణ్యం చాలా గొప్పది. దౌడు తీస్తున్న గుర్రాలు, తొండంతో నీటిని విరజిమ్ముతున్న ఏనుగుల శిల్పాలను చూస్తుంటే అవన్నీ నిజంగా కళ్ల ముందు నిలిచినట్లే ఉంది. వీటిని చెక్కిన శిల్పులందరూ కళ్ల ముందు మెదులుతున్నారు. నా గమనంలో మరో ముఖ్యమైన ప్రదేశం తలకాడ్. ఇక్కడ నాలుగు పాయలుగా చీలి ప్రవహిస్తాను. పంచలింగేశ్వర ఆలయాన్ని నా తీరాన్నే కట్టడం... గొప్ప ఆనందం. శివన సముద్ర దగ్గర నేరుగా వంద మీటర్ల లోతున్న లోయలోకి దూకుతాను. దానికే శివనసముద్రం జలపాతమని పేరు. ఆ పాయలే గగన్‌చుక్కి, బారాచుక్కి అనే జలపాతాలు. బెంగళూరులో వెలిగే లైట్లన్నీ నేను ఇక్కడ నేలకు దూకడం వల్లనే వెలుగుతున్నాయంటే నాలో అహం పెరిగిందంటారో ఏమో! కానీ ఇది నిజం. మైసూర్ వడయార్లు కట్టిన ఆనకట్టలు, తిరుచిరాపల్లి - తంజావూరుల మధ్య కరైకాళ చోళుడు నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట కళ్లాణై. అలాగే మట్టూరు డ్యామ్, బాణసాగర్ డ్యామ్... ఇలా ఎన్ని కట్టినా ఆనందమే. బెంగళూరు నుంచి ధర్మపురి చేరేలోపు మరోసారి పాయలుగా నేలకు ఉరుకుతాను. వాటికిహొగెనక్కల్ జలపాతాలని పేరు. తమిళనాడులోకి... బెంగళూరు జిల్లా దక్షిణ సరిహద్దు నుంచి తమిళనాడులో ఒక సన్నటి పాయలాగ ‘మెకె దాతు’ పేరుతో అడుగుపెడుతాను. ఇక్కడే కణ్వ, అర్కావతి నదులు వచ్చి ‘నువ్వు పెద్ద నదివి, ఇలా ఉంటే కుదరదు’ అంటూ తొందరపెడతాయి. తిరుచ్చి, తంజావూరు జిల్లాల్లో పంటపొలాలను సస్యశ్యామలం చేస్తూ పరుగుల వేగం పెంచుతాను. ఎందుకంటే అల్లంత దూరాన బంగాళాఖాతం కనిపిస్తుంటుంది. శ్రీరంగం నుంచి నేను బంగాళాఖాతంలో కలిసే ప్రదేశానికి మధ్య నాకు ఇరువైపులా ఊరిని నిర్మించి ‘కావేరిపూమ్ పట్టిణమ్’ అని పేరు పెట్టేశాడు కరైకాళ చోళుడు. పూమ్ పుహార్ అన్నా కూడా అదే, తమిళులకు నేనంటే ఎంతటి మక్కువ అంటే... వారి పంటలు పండిస్తున్నందుకు కృతజ్ఞతగా నాకు ఏటా మిఠాయిలు, పండ్లు తినిపిస్తారు. ‘ఆడి’ మాసంలో పద్దెనిమిదవ రోజున దీపాలు వెలిగించి, అరటి ఆకుల్లో చెరకు ముక్కలు, బెల్లంతో పొంగలి వడ్డించి భోజనం పెడతారు. వారి జీవితాలను వడ్డించిన విస్తరి చేశానని వారికా ఆనందం. నైవేద్యాలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ‘ఆడి పదినెట్టామ్ పెరుక్కు’ పేరుతో పండుగ చేసుకుంటారు. అయినా నా జీవితం ఇవ్వడానికే అంకితం, తీసుకోవడానికి కాదు. వారు ఏమిచ్చినా ఇవ్వకున్నా నేను నేలమ్మ రుణం తీర్చుకుంటూనే ప్రయాణిస్తాను. ప్రెజెంటేషన్ : వాకా మంజులారెడ్డి కనక, గజోతి, హేమవతి, లక్ష్మణ్ తీర్థం, భవాని, నోయిల్, కక్కుబె, కాదనూర్, కుమ్మహోలె, శింష, కన్నిగె, పోరాల్, చెన్నార్, తోపార్, నొయ్యాల్, అమరావతి, కబిని, కణ్వ, అర్కావతి నదులు నాతో చెలిమి చేస్తూ ఏటా వచ్చి పలకరిస్తాయి. ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఇసుక తిన్నెల మీద విస్తరించి తిరుచినాపల్లికి పశ్చిమాన ముక్కోంబు ఆనకట్ట దగ్గర రెండుగా విడిపోతాను. అలా తంజావూరు జిల్లాలోకి అడుగుపెట్టి కొంతదూరం వెళ్తానో లేదో నన్ను వీడిన కొల్లిడమ్ పాయ వచ్చి నాలో కలిసిపోతుంది. ఈ మధ్యలో భూభాగమే శ్రీరంగం. జన్మస్థానం : కర్నాటక రాష్ట్రం, కొడగు జిల్లా తలకావేరి సంగమస్థానం : తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పూమ్పుహార్ లేదా కావేరిపూమ్ పుట్టిణమ్ ప్రవాహ దూరం : 765 కిలోమీటర్లు కావేరి -
దక్షిణాది నుంచే అనుసంధానం
మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానానికి కేంద్రం ప్రణాళిక గోదావరిలో 530 టీఎంసీల మిగులు జ లాలు ఉన్నాయంటున్న జల వనరుల శాఖ వీటిని కృష్ణా, కావేరిలకు తరలించాలని యోచన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. ఉన్న ప్రాజెక్టులకే నీళ్లు సరిపోవని వెల్లడి 15 ఏళ్ల నాటి లెక్కలను పరిగణన లోకి తీసుకోవడంపై అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టను న్న నదుల అనుసంధాన కార్యక్రమాన్ని దక్షిణా ది నుంచే మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి మరో నదికి నీటిని మళ్లించడంలో భాగంగా తొలుత దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరిల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. తెలంగాణ పరిధిలోని గోదావరి నది లో మిగులు జలాల లభ్యత ఉందని చెబుతున్న కేంద్ర జల వనరుల శాఖ... ఈ నది నీటిని కృష్ణాకు తరలించే అంశంపై కసరత్తు చేస్తోంది. అయితే గోదావరి నీటి తరలింపును తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిలో ఎక్కడా మిగులు జలాలు లేవని.. ప్రస్తుతం లభ్యమవుతున్న జలాలు తమ అవసరాలకే సరిపోవడం లేదని వాదిస్తోంది. అయినా కేంద్రం మాత్రం మొండిగా నదుల అనుసంధానంపై ముందుకు వెళ్లాలనే గట్టి పట్టుదలతో ఉంది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ఈ నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తుది మెరుగులు దిద్ది, ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఉత్తరాది నదు లకోసం ‘హిమాలయ నదుల అభివృద్ధి’, దక్షిణా ది నదుల కోసం ‘ద్వీపకల్ప నదుల అభివృద్ధి’ పథకాలను చేపట్టింది. ఇందులో హిమాలయ నదుల అభివృద్ధి పథకం కింద బ్రహ్మపుత్ర, గంగా, నర్మదా తదితర నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిం చినా... బ్రహ్మపుత్ర నదుల నీటి వాడకం విషయంలో పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌తో వివాదాలు ఉన్న దృష్ట్యా దానిని వాయిదా వేసింది. దీంతో దక్షిణాదిలోని నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. గోదావరిపైనే కన్ను..: మహానదిలో సుమా రు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా... వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలన్నది కేంద్ర జల వనరుల శాఖ వాదన. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తెలంగాణ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిపై ఆధారపడ్డ ప్రస్తుత ప్రాజెక్టులకే నీటి అవసరాలు సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదీగాక ప్రస్తుతం కేంద్రం చెబుతున్న 530 టీఎంసీల అదనపు జ లాలు ఎప్పుడో 15 ఏళ్ల కిందట 75 శాతం డిపెం డబిలిటీతో లెక్కించినవని.. ఇప్పడు ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయని చెబుతోంది. నిర్మాణంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే గోదావరిలో ఏపీ, తెలంగాణకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు తమ అవసరాలకే సరిపోవని స్పష్టం చేస్తోంది. తెలంగాణ పీఠభూమి ప్రాంతం అయినందున గోదావరి ప్రవాహం కింది రాష్ట్రమైన ఏపీకి ఉంటుందని.. అక్కడే అదనపు జలాల అవకాశం ఉంటుందని చెబుతోంది. రాష్ట్ర పరిధిలోని నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదని, అలాకాకుండా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నీటిని తరలిస్తామంటే అంగీకరించేది లేదని తెలంగాణ వాది స్తోంది. విషయాలను ఇటీవల కేంద్రం నిర్వహించిన జల్ మంథన్ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రానికి స్పష్టంగా వివరించినా, వాటిని కేం ద్రం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. -
ఈ ఏడాది ‘కావేరి’ సమస్య లేనట్లే !
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కావేరి సమస్య ఉత్పన్నం కాదని అటు ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి నది నీటి పంపకం విషయమై కావేరి ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి ప్రతి ఏడాది జల కాలెండర్ (జూన్ నుంచి మే) లోపు 192 టీఎంసీల నీటిని కర్ణాటక...తమిళనాడుకు విడుదల చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బాగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ఆనకట్టల వద్ద నీరు పుష్కలంగా చేరుతోంది. దీంతో ఇప్పటి వరకూ 138 టీఎంసీల నీటిని కర్ణాటక తమిళనాడుకు విడుదల చేసింది. ఇక కేవలం 54 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు ఇంకా 8 నెలల సమయం ఉంది. ట్రిబ్యునల్ సూచనలను అనుసరించి ఈ నెల కోటాకు సంబంధించి 18 టీఎంసీలు, నవంబర్‌లో 15 టీఎంసీలు, డిసెంబర్లో 8 టీఎంసీలు, జనవరిలో 3 టీఎంసీలు ఫిబ్రవరి నుంచి మే వరకూ 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మరో రెండు మూడు నెలలు మంచి వర్షాలు పడుతాయనే వాతావారణ శాఖ సూచనలతో సంబంధిత నెలల్లో తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడం కష్టం కాబోదని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గత రెండు మూడేళ్లుగా తమిళనాడు, కర్ణాటక మధ్య సాగుతున్న కావేరి జగడాలకు తాత్కాలికంగానైనా ఈ ఏడాది బ్రేక్ పడే సూచనలు కనిపిస్తుండటంతో అటు ప్రభుత్వంతో పాటు రైతులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. -
మెట్టూరు నీళ్లు విడుదల
సాక్షి, చెన్నై:కర్ణాటక వర్షాలతో కావేరి పది రోజులుగా ఉగ్రరూపం దాల్చింది. నీటి ఉధృతితో మెట్టూరు డ్యాం నీటిమట్టం క్రమంగా పెరిగింది. నాలుగు రోజులుగా నీటి ఉధృతి లక్షకు పైగా ఘనపుటడుగుల్లో వస్తుండడంతో నీటి మట్టం ఆదివారానికి 110 అడుగులకు చేరింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే, మెట్టూరు డ్యాం పూర్తిగా నిండడం ఖాయం. దీంతో సంబా సాగు నిమిత్తం ముందుగానే నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో మెట్టూరు డ్యాం నీటిని విడుదల చేయడానికి శనివారం రాత్రి అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ మకర భూషణం నేతృత్వం లో ఆ డ్యాం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ డ్యాం మీదుగా పెద్ద వాహనాల అనుమతికి నిషేధం విధిం చారు. ద్విచక్ర వాహనాలను మాత్రం అనుమతించే పనిలో పడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, రవాణా మంత్రి ఎడపాడి పళని స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంబా సాగుకు నీళ్లు విడుదల చేస్తూ గేట్లను కొంత మేరకు పెకైత్తారు. ప్రస్తుతం 9 వేల ఘనపుటడుగుల మేరకు నీళ్లు విడుదల చేస్తున్నా, కావేరి ఉధృతి ఆధారంగా ఆ సంఖ్యను భారీగా పెంచే అవకాశం ఉంది. అప్రమత్తం : మెట్టూరు డ్యాం నీటి మట్టం 110 అడుగులకు చేరడంతో మొదటి వరద ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 115 అడుగులకు చేరగానే, రెండో హెచ్చరిక, పూర్తిగా నిండగానే మూడో హెచ్చరిక జారీ చేయనున్నారు. కర్ణాటక నుంచి ఉబరి నీరు మరింతగా వస్తుండడం, డెల్టా జిల్లాల్లో వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మపురి, సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, తిరుచ్చి, తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, కడలూరు జిల్లాలోని కావేరి తీరవాసులను అప్రమత్తం చేశారు. కావేరి నది దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నీటి ఉధృతి ఏ క్షణాన పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండారో వేయించారు. అలాగే, కావేరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులతో సంప్రదింపుల్లో ఉండాలని, నీటి ఉధృతి పెరిగిన మరుక్షణం పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. జలపాతంలోకి అనుమతి లేదు : హొగ్నెకల్‌లో సందర్శకులకు నిషేధం విధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కావేరి తీరంలో ఉన్న ఈ హొగ్నెకల్ జలపాతం సందర్శకులకు ఓ కనువిందే. ప్రస్తుతం కావేరి పరవళ్లు తొక్కుతుండడంతో ఆ జలపాత వీక్షణం కోసం సందర్శకులు ఎగబడుతున్నారు. అయితే, కావేరి ఉధృతంగా ప్రవహిస్తుండడం, హొగ్నెకల్లోని పార్కులు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం నీళ్లు ముంచెత్తడంతో అధికారులు మేల్కొన్నారు. హొగ్నెకల్ జలపాతంలోకి సందర్శకులను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ఆ పరిసర వాసులు హొగ్నెకల్ వైపుగా వెళ్లొద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. హొగ్నెకల్‌కు 15 కిలో మీటర్ల దూరంలో ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేసి, వాహనాలను వెనక్కు పంపించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. 127 అడుగులకు పెరియార్ : కేరళ వర్షాలతో థెక్కడైలోని పెరియార్ డ్యాం నీటి మట్టం పెరుగుతోంది. ఈ డ్యాంపై సర్వ హక్కులను తమిళనాడు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ డ్యాం నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచే విధంగా ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేరళ వర్షాలతో ఆ డ్యాంకు నీటి రాక పెరుగుతున్నది. సెకనుకు 2,300 ఘనపుటడుగుల మేరకు నీళ్లు డ్యాంలోకి వచ్చి చేరుతున్నారుు. దీంతో డ్యాం నీటి మట్టం 127 అడుగులకు చేరింది. నీటి మట్టం క్రమంగా పెరిగిన పక్షంలో తమకు పంటల సాగుకు, తాగునీటి నిమిత్తం నీళ్లు తగ్గుతాయన్న ఆశాభావంతో తేని, శివగంగై, విరుదునగర్, రామనాథపురం, మదురై వాసులు ఎదురు చూపుల్లో పడ్డారు. -
సాగుకు నీళ్లు!
సాక్షి, చెన్నై: వర్షాభావ పరిస్థితులు కొన్నేళ్లుగా రాష్ట్ర అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచుతున్నాయి. గత ఏడాది సంబా సాగులో నిమగ్నమైన అన్నదాతలను చివరి క్షణంలో కర్ణాటకలో కురిసిన వర్షాలు ఆదుకున్నాయి. ఈ సారి కూడా సాగు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కర్ణాటక వర్షాలు మళ్లీ డెల్టా అన్నదాతల్ని ఆదుకుంటున్నాయి. గత నెల 12వ తేదీ మెట్టూరు డ్యాంలో కేవలం 44 అడుగుల మేరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో వర్షం లేకపోయినా, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో 20 రోజులుగా రాష్ట్రంలోకి కావేరి నదీ ప్రవాహం ఉరకలెత్తుతోంది. పెరిగిన నీటి మట్టం: కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వేలాది ఘనపుటడుగుల నీళ్లు మెట్టూరు డ్యాంలోకి చేరుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో ఆ డ్యాం నీటి మట్టం 50 అడుగులు పెరిగింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వికసిం చింది. డెల్టాలో సంబా సాగుబడికి నీళ్లు దక్కినట్టేనన్న నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ డ్యాం నుంచి నీళ్లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అన్న ఎదురు చూపులు పెరిగాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో గురువారం కృష్ణరాజ సాగర్, కబిని డ్యాంల నుంచి లక్షకు పైగా ఘనపుటడుగుల నీటిని విడుదల చేసిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మెట్టూరు డ్యాంలోకి లక్ష ఘనపుటడుగుల మేరకు నీళ్లు వచ్చే అవకాశం ఉండటంతో త్వరితగతిన పూర్తి స్థాయిలో ఆ డ్యాం నిండటం ఖాయం అన్న అంచనాకు నీటి పారుదల శాఖ అధికారులు వచ్చారు. దీంతో సంబా సాగు నిమిత్తం నీళ్ల విడుదలకు నిర్ణయించారు. 15న విడుదల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెల్టా అన్నదాతల్లో ఆనందాన్ని నింపే విధంగా సీఎం జయలలిత ప్రకటన చేశారు. పదిహేనో తేదీ నుంచి మెట్టూరు డ్యాం నీళ్లను సంబా సాగుకు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. డ్యాంలో గురువారం 94 అడుగుల నీటి మట్టం దాటిందని, 57.450 టీఎంసీల మేరకు నీళ్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఉదయానికి లేదా, సాయంత్రానికి మెట్టూరు డ్యాంకు లక్ష ఘనపుటడుగులకు పైగా నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా నీళ్లు సద్వినియోగం చేసుకునే విధంగా కావేరి, పెన్నారు, కల్లనై కాలువల ద్వారా నీటిని అనుబంధ డ్యాంలకు మళ్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. అలాగే, 12 లక్షల ఎకరాల్లో సంబా సాగు లక్ష్యంగా నీళ్లు విడుదల చేస్తున్నామని వివరించారు. సంబా సాగుకు నీళ్లు దక్కనుండడంతో డెల్టా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెట్టూరు డ్యాం పూర్తిగా నిండాలని, ఉబరి నీళ్లు ఇతర జలాశయాల్లోకి చేరే రీతిలో కావేరి పరవళ్లు తొక్కాలన్న ఆకాంక్షలో అన్నదాతలు పడ్డారు. హొగ్నెకల్ వద్ద కావేరి ఉగ్ర రూపం దాల్చుతోంది, సందర్శకులను ఆ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. అలాగే, నీటి ఉధృతి మరింత పెరగనున్న దృష్ట్యా, కావేరి తీరవాసులను మరింత అప్రమత్తం చేశారు. లోతట్టు గ్రామాల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఆడి పెరుక్కు ఉత్సవం
సాక్షి, చెన్నై:కావేరి నదీ పరివాహక ప్రదేశాల్లో ఆడి పెరుక్కు ఆదివా రం కోలాహలంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రాన్ని, తమ జీవితాలను సుభిక్షం చేయాలని కావేరి తల్లిని వేడుకుంటూ పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆడి మాసం(ఆషాడం) వస్తే చాలు తమిళనాడులో భక్తి భావం మిన్నంటుతుంది. అమ్మ వారి సన్నిధుల్లో విశేష పూజలు జరుగుతాయి. గ్రామాల్లో కొలువుదీరిన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తుంటారు. అభిషేకాది పూజలతో, అంబలి పోసి, పొంగళ్లు పెట్టి, భక్తి భావంతో అమ్మవార్లను కొలుస్తుంటారు. ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు పెట్టి వారి ఆత్మల శాంతిని ఆకాంక్షిస్తుంటారు. అలాగే, ఈ నెలంతా ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటింటా పూజలతో భక్తి పారవశ్యం మిన్నంటుతుంది. నదీ తీరాల్లో కోలాహలంగా జరుపుకోవడం ఆనవాయితీ. సంబరం: ఆడి 18వ రోజును ఆడి పెరుక్కుగా పిలుస్తుంటారు. కావేరి నదీ తీరంలో అత్యంత వేడుకగా ఈ ఆడి పెరుక్కును జరుపుకుంటారు. ఇందు కోసం ప్రతి ఏటా మెట్టురు డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది కర్ణాటక వర్షాలతో మెట్టురుకు నీటి రాక పెరిగింది. దీంతో ఆ డ్యాం నుంచి రెండు వారాలుగా కావేరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీళ్లు ఆదివారం ఉదయానికి తిరుచ్చికి చేరారుు. సేలం, ఈరోడ్, నామక్కల్, తిరుచ్చి, ధర్మపురి, కృష్ణగిరిల్లో ఆడి పెరుక్కుకు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఉదయాన్నే నవ దంపతులు, కుటుంబాలు, అన్నదాతలు పెద్ద ఎత్తున కావేరి తీరానికి తరలి వచ్చారు. కావేరి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, నవదంపతులు గాజులు, బియ్యం, పసుపు కుంకుమలు, తమల పాకులను కలశాల మధ్య ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. పవిత్ర స్నానం ఆచరించినానంతరం తమ మంగళ సూత్రాలను మార్చుకున్నారు. నవ దంపతులు తమ వివాహ సందర్భంగా ఉపయోగించిన పూలమాలలను తీసుకొచ్చి కావేరి నదిలో కలిపేశారు. అన్నదాతలు విత్తనాలను, గత ఏడాది తమ చేతికి అందిన పంటలను కావేరి నదీ తీరంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆ పరిసరాల్లోని గ్రామ దేవతల ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు పసుపు తాడును కావేరి తీరంలో కలశాల మధ్యలో ఉంచి పూజలు చేశారు. పవిత్ర స్నానం అనంతరం ఆ తాడును తమ చేతికి కట్టుకున్నారు. ఆడి పెరుక్కును కోలాహలంగా జరుపుకుని కావేరి తల్లికి కృత జ్ఞతలు తెలియజేయడం ద్వారా తమ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని, మాంగల్య బలం గట్టిగా ఉంటుందని, పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు అవుతాయని, పంటల దిగుబడి పెరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు పూజలు చేయడం విశేషం. అలాగే, ఇతర ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లల్లో పూజలు జరుపుకున్నారు. అలాగే, తమ పరిసరాల్లోని కొలనులు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లి పూజలు చేసుకున్నారు.నాగై, తంజైవాసుల్లో అసంతృప్తి : ఈ ఏడాది ఆడి పెరుక్కును కావేరి, భవానీ నది తీరవాసులు కోలాహలంగా జరుపుకున్నారు. సేలం, నామక్కల్, తిరుచ్చి వరకు కావేరి నదిలో మెట్టూరు నీళ్లు ప్రవహించాయి. ఈరోడ్డులో భవానీ నది నీళ్లు పొంగి పొర్లాయి. అలాగే, కావేరి, భవానీ, అముదం నదులు సంగమమయ్యే ప్రదేశంలో భక్త జనం పోటెత్తారు. అయితే, తంజావూరు, నాగపట్నం జిల్లా వాసులు మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కావేరి నదీ జలాలు ఉదయానికి తిరుచ్చి అమ్మా మండపం చేరుకోవడంతో ప్రజలు ఆనందంలో మునిగారు. అయితే, ఆ నీళ్లు తంజావూరు, నాగపట్నం జిల్లాలకు చేరలేదు. ఇందుకు కారణం మెట్టూరు డ్యాం నుంచి నీళ్లు ఆలస్యంగా విడుదల చేయడమే. తమ జిల్లాల గుండా ప్రవహిస్తున్న కావేరి నదిలోకి నీళ్లు వస్తాయన్న ఆశతో తంజావూరు, నాగపట్నం తీర వాసులు ఎదురు చూశారు. అయితే, నీటి జాడ లేక పోవడంతో నిరుత్సాహంతో వెను దిరగాల్సి వచ్చింది. కొన్ని చోట్ల అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ గోతులు తవ్వి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెప్పించి అందులో పోశారు. చివరకు నిరుత్సాహంతో అక్కడి ప్రజలు ఆ నీటి ఆధారంగా ఆడి పెరుక్కును జరుపుకోవాల్సి వచ్చింది. -
రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యల సృష్టి
మైసూరు : కావేరి నదీ జలాల పంపకం విషయంలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నూతన సమస్యలు ృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మైసూరులో స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరి నిర్వహణ మండలి ఏర్పాటు చేయబోమని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనతో కూడా చెప్పారని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గత ఏడాది 192 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా అధిక వర్షపాతం వల్ల ఇప్పటికే 260 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అయినా తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసుల పేరుతో సమస్యలు ృష్టిస్తోందన్నారు. ఇప్పటికీ కావేరి టిబ్యునల్‌కు సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ విషయం తేలేవరకూ కావేరి నిర్వహణ బోర్డు ఏర్పాటు కాబోదని సిద్ధరామయ్య వివరించారు. సీఎన్ఆర్ రావు.. అసాధ్యుడు.. : సీఎం సామాన్యుడిగా ఉంటూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి భారతరత్న సీఎన్ఆర్. రావు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. ఇక్కడి సార్వత్రిక విశ్వ విద్యాలయం, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లు సంయుక్తంగా శనివారం సీఎన్ఆర్. రావు అభినందన సభను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, సామాన్య కుటుంబంలో పుట్టిన రావు దేశంలోనే కాకుండా విదేశాల్లోని విశ్వ విద్యాలయాల నుంచి కూడా మొత్తం 63 డాక్టరేట్లను పొందారని ప్రశంసించారు. అనేక పరిశోధనల ద్వారా విజ్ఞాన రంగానికి విలువైన కానుకలు అందించారని పేర్కొన్నారు. రావును అభినందించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమని అన్నారు. ఈ నెల 18న బెంగళూరులో కూడా ఆయనను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎన్ఆర్. రావు దంపతులను ముఖ్యమంత్రి సన్మానించారు. -
మళ్లీ ‘కావేరి’ వివాదం
సాక్షి, చెన్నై:కర్ణాటక - తమిళనాడు మధ్య మళ్లీ కావేరి చిచ్చు రగలనుంది. కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి నదీ జలాల పర్యవేక్షణా కమిటీకి కర్ణాటకలో వ్యతిరేకత మొదలైంది. తమిళనాడు మేల్కొనే లోపు, జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో అక్కడి కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏకమవుతున్నారు. అయితే, రాష్ట్రంలో అలాంటి ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. అఖిల పక్షానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. తమిళనాడు - కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం కొత్తేమీ కాదు. ప్రతి ఏటా పోరాడి మరీ నీటిని పంపింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మెట్టూరు డ్యాం ఎండిపోవడంతో కావేరి నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత వారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో కావేరి జలాల పంపిణీ ప్రస్తావనను సీఎం జయలలిత తీసుకొచ్చారు. కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు జూన్‌లో తమిళనాడుకు పది టీఎంసీల నీటిని కర్ణాటక పంపింగ్ చేయాల్సిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, ట్రిబ్యునల్ తీర్పు మేరకే కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్డుకు వ్యతిరేకత : జయలలిత విజ్ఞప్తి మేరకు కేంద్రంలో చకచకా పనులు వేగవంతం చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. కావేరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు కసరత్తులు ఆరంభమైనట్టుగా మీడియాల్లో కథనాలు సైతం వెలువడడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఇదంతా ప్రచారమేనంటూ కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ కొట్టి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక హక్కుల్ని వదులకోబోమని, కావేరి నదీ జలాల వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనీయమని ప్రకటించడం వివాదానికి దారి తీస్తోంది. అదే సమయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన వ్యూహాలకు పదును పెట్టారు. కేంద్ర మంత్రి ప్రకటనతో బీజేపీ ఎంపీలను కలుపుకుని ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చినట్టు సమాచారం. కావేరి అభివృద్ధి బోర్డును అడ్డుకోవడం లక్ష్యంగా కర్ణాటకలోని పార్టీల ఎంపీలందరూ ఏకమవుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నట్టుంది. మోడీ వద్ద సమస్యను ఏకరువు పెట్టడంతో సరి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తున్నది. అయితే, అధికార వర్గాలు మాత్రం ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా ట్రిబ్యునల్ తీర్పును అమలు పరచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అఖిల పక్షానికి డిమాండ్: తమిళనాడు మేల్కొనేలోపు, తమ జాగ్రత్తల్లో తాముండాలన్న లక్ష్యంగా కర్ణాటకలోని ఎంపీలు ఏకమవుతున్న తరుణంలో, రాష్ట్రంలోనూ అన్ని పార్టీలను ఏకం చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆదివారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును చూస్తుంటే, ఏ మేరకు అన్నదాతల మీద చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కావేరి జల వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అన్నీ కేంద్రం చూసుకుంటుందిలే అన్నట్టుగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా సమయం మించింది లేదని, కర్ణాటకలోని పార్టీలకన్నా ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు ప్రతినిధులం కలుద్దామని సూచించారు. అన్ని పార్టీలను ఏకం చేస్తూ అఖిల పక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. -
కావేరి నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది
కావేరి నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. సెకనుకు 1.5 లక్షల ఘనపుటడుగులకుపైగా నీరు ప్రవహిస్తోంది. నదీ తీరంలోని 11 జిల్లాల్లో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు గ్రామ వాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మెట్టూరు డ్యాం నిండడంతో 16 గేట్ల ద్వారా ఉబరి నీటిని బయటకు పంపుతున్నారు. సాక్షి, చెన్నై: కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కావేరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎండిపోయిన మెట్టూరు డ్యాం నీటిమట్టం ఈ వర్షాల పుణ్యమా అని నెలన్నరలో వంద అడుగులు దాటింది. దీంతో సాంబా సాగుకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆదివారం వేకువజాము నుంచి కావేరి నది ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో వర్షాలు కొనసాగుతుండడంతో అక్కడి జలాశయాల నుంచి ఉబరి నీటి విడుదల పెరిగింది. సెకనుకు 1.5 లక్షల ఘనపుటడుగులకుపైగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. హొగ్నెకల్, మెట్టూరు డ్యాం వద్ద ప్రజాపనుల శాఖ ప్రధాన ఇంజినీర్ అశోకన్, ఆర్డీవో చంద్రన్, ఇంజినీర్లు సురేష్, కుమరేషన్ నేతృత్వంలో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మెట్టూరు గేట్ల ఎత్తివేత: ఎనిమిదేళ్ల తర్వాత ఆదివారం మెట్టూరు డ్యాం గేట్లను ఎత్తివేశారు. డ్యామ్‌లోకి సెకనుకు లక్షా పదిహేను వేల ఘనపుటడుగుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 120 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబా సాగు నిమిత్తం కాలువల ద్వారా సెకనుకు 40 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా ఉబిరి నీటిని బయటకు పంపించే పనిలో పడ్డారు. డ్యామ్ 16 ప్రధాన గేట్లు ఎనిమిదేళ్ల తర్వాత తెరుచుకున్నాయి. సెకనుకు 40 వేల ఘనపుటడుగుల ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి బయటకు వెళుతున్న నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. వీరిని కట్టడి చేయడం అధికారులకు తలకు మించిన భారమవుతోంది. డ్యామ్ నుంచి మొత్తం 80 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రికి లక్ష ఘనపుటడుగులు దాటే అవకాశం ఉంది. అప్రమత్తం: కావేరి ఉగ్ర తాండవం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. హొగ్నెకల్ పరిసరాల్లోని చిన్నచిన్న గ్రామా ల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరారుు. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తీరం వెంబడి గ్రామాల్లోని కల్వర్టులు, వంతెనల్ని తాకుతూ నీళ్లు ప్రవహిస్తున్నారుు. స్థానికులను పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూశాఖ అధికారులు అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. కావేరి తీరం వైపు ఎవరూ వెళ్లొద్దని, వంతెనల మీద బస్సులు, ఇతర వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని హెచ్చరికలు జారీ చేశారు. మెట్టూరు నుంచి ఉబరి నీరు విడుదల కావడంతో సేలం, నామక్కల్, ఈరోడ్, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, అరియలూరు తదితర 11 జిల్లాల్లోని లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చీప్ ఇంజినీర్ అశోకన్ మీడియాతో మాట్లాడుతూ మెట్టూరు గేట్ల ఎత్తి వేతతో తీర వాసుల్ని అప్రమత్తం చేశామన్నారు. ఉబరి నీటి కారణంగా కావేరి తీరంలోని 524 చెరువులు నిండే అవకాశం ఉందన్నారు. ఉబరి నీరు ఉద్ధృతంగా సముద్రంలో కలవని రీతిలో ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. కళ్లనై నీళ్లు విడుదల మెట్టూరు నిండడంతో ఆ నీటి మీద ఆధారపడి ఉన్న కళ్లనై జలాశయం నీటిని సైతం విడుదల చేశారు. కళ్లనై నీటిని తంజావూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై జిల్లాలకు సాగుబడి నిమిత్తం పంపిణీ చేయనున్నారు. పుల్లంబాడి, పుదియ కట్టలై మేడు వైపుగా ఉన్న కాలువల ద్వారా సాగుబడికి సోమవారం నీళ్లు విడుదల చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. నీలగిరుల్లో కురుస్తున్న వర్షాలకు భవానీ నది పరవళ్లు తొక్కుతోంది. పిళ్లూరు డ్యాం గేట్లను ఎత్తి వేయడంతో భవానీ సాగర్‌కు నీటి రాక పెరిగింది. దీంతో మేట్టుపాళయం పరిసరాల్లోని భవానీ నదీ తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. వర్ష సూచన పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు నీటి రాక పెరిగింది. ఈ పరిస్థితుల్లో 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి చెన్నై, కాంచీపురం తదితర జిల్లాల్లో వర్షం పడింది. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. నదిలో చిక్కుకున్న నలుగురు హొగ్నెకల్ వద్ద కావేరి ప్రవాహంలో ఆదివారం సాయంత్రం నలుగురు కొట్టుకెళ్లారు. వీరిని రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హొగ్నెకల్ వద్ద కావేరి ఉద్ధృతిలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. అతడ్ని రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు జాలర్లు సైతం కొట్టుకెళ్లారు. ఈ నలుగురూ ఓ చెట్టు ఆసరాగా నది మధ్యలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరిని రక్షించేందుకు జాలర్లు, గజ ఈతగాళ్లను అధికారులు రంగంలోకి దించారు. అయితే చీకటి కారణంగా పరిస్థితులు అనుకూలించడం లేదు. రాత్రి వేళ నీటి ఉద్ధృతి పెరిగిన పక్షంలో వీరు కొట్టుకెళ్లవచ్చన్న ఆందోళన నెలకొంది.