మెట్టూరు నీళ్లు విడుదల
సాక్షి, చెన్నై:కర్ణాటక వర్షాలతో కావేరి పది రోజులుగా ఉగ్రరూపం దాల్చింది. నీటి ఉధృతితో మెట్టూరు డ్యాం నీటిమట్టం క్రమంగా పెరిగింది. నాలుగు రోజులుగా నీటి ఉధృతి లక్షకు పైగా ఘనపుటడుగుల్లో వస్తుండడంతో నీటి మట్టం ఆదివారానికి 110 అడుగులకు చేరింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే, మెట్టూరు డ్యాం పూర్తిగా నిండడం ఖాయం. దీంతో సంబా సాగు నిమిత్తం ముందుగానే నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో మెట్టూరు డ్యాం నీటిని విడుదల చేయడానికి శనివారం రాత్రి అధికారులు చర్యలు చేపట్టారు.
కలెక్టర్ మకర భూషణం నేతృత్వం లో ఆ డ్యాం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ డ్యాం మీదుగా పెద్ద వాహనాల అనుమతికి నిషేధం విధిం చారు. ద్విచక్ర వాహనాలను మాత్రం అనుమతించే పనిలో పడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, రవాణా మంత్రి ఎడపాడి పళని స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంబా సాగుకు నీళ్లు విడుదల చేస్తూ గేట్లను కొంత మేరకు పెకైత్తారు. ప్రస్తుతం 9 వేల ఘనపుటడుగుల మేరకు నీళ్లు విడుదల చేస్తున్నా, కావేరి ఉధృతి ఆధారంగా ఆ సంఖ్యను భారీగా పెంచే అవకాశం ఉంది.
అప్రమత్తం : మెట్టూరు డ్యాం నీటి మట్టం 110 అడుగులకు చేరడంతో మొదటి వరద ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 115 అడుగులకు చేరగానే, రెండో హెచ్చరిక, పూర్తిగా నిండగానే మూడో హెచ్చరిక జారీ చేయనున్నారు. కర్ణాటక నుంచి ఉబరి నీరు మరింతగా వస్తుండడం, డెల్టా జిల్లాల్లో వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మపురి, సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, తిరుచ్చి, తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, కడలూరు జిల్లాలోని కావేరి తీరవాసులను అప్రమత్తం చేశారు. కావేరి నది దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నీటి ఉధృతి ఏ క్షణాన పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండారో వేయించారు. అలాగే, కావేరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులతో సంప్రదింపుల్లో ఉండాలని, నీటి ఉధృతి పెరిగిన మరుక్షణం పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.
జలపాతంలోకి అనుమతి లేదు : హొగ్నెకల్‌లో సందర్శకులకు నిషేధం విధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కావేరి తీరంలో ఉన్న ఈ హొగ్నెకల్ జలపాతం సందర్శకులకు ఓ కనువిందే. ప్రస్తుతం కావేరి పరవళ్లు తొక్కుతుండడంతో ఆ జలపాత వీక్షణం కోసం సందర్శకులు ఎగబడుతున్నారు. అయితే, కావేరి ఉధృతంగా ప్రవహిస్తుండడం, హొగ్నెకల్లోని పార్కులు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం నీళ్లు ముంచెత్తడంతో అధికారులు మేల్కొన్నారు. హొగ్నెకల్ జలపాతంలోకి సందర్శకులను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ఆ పరిసర వాసులు హొగ్నెకల్ వైపుగా వెళ్లొద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. హొగ్నెకల్‌కు 15 కిలో మీటర్ల దూరంలో ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేసి, వాహనాలను వెనక్కు పంపించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది.
127 అడుగులకు పెరియార్ : కేరళ వర్షాలతో థెక్కడైలోని పెరియార్ డ్యాం నీటి మట్టం పెరుగుతోంది. ఈ డ్యాంపై సర్వ హక్కులను తమిళనాడు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ డ్యాం నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచే విధంగా ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేరళ వర్షాలతో ఆ డ్యాంకు నీటి రాక పెరుగుతున్నది. సెకనుకు 2,300 ఘనపుటడుగుల మేరకు నీళ్లు డ్యాంలోకి వచ్చి చేరుతున్నారుు. దీంతో డ్యాం నీటి మట్టం 127 అడుగులకు చేరింది. నీటి మట్టం క్రమంగా పెరిగిన పక్షంలో తమకు పంటల సాగుకు, తాగునీటి నిమిత్తం నీళ్లు తగ్గుతాయన్న ఆశాభావంతో తేని, శివగంగై, విరుదునగర్, రామనాథపురం, మదురై వాసులు ఎదురు చూపుల్లో పడ్డారు.