ఆడి పెరుక్కు ఉత్సవం
సాక్షి, చెన్నై:కావేరి నదీ పరివాహక ప్రదేశాల్లో ఆడి పెరుక్కు ఆదివా రం కోలాహలంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రాన్ని, తమ జీవితాలను సుభిక్షం చేయాలని కావేరి తల్లిని వేడుకుంటూ పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆడి మాసం(ఆషాడం) వస్తే చాలు తమిళనాడులో భక్తి భావం మిన్నంటుతుంది. అమ్మ వారి సన్నిధుల్లో విశేష పూజలు జరుగుతాయి. గ్రామాల్లో కొలువుదీరిన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తుంటారు. అభిషేకాది పూజలతో, అంబలి పోసి, పొంగళ్లు పెట్టి, భక్తి భావంతో అమ్మవార్లను కొలుస్తుంటారు. ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు పెట్టి వారి ఆత్మల శాంతిని ఆకాంక్షిస్తుంటారు. అలాగే, ఈ నెలంతా ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటింటా పూజలతో భక్తి పారవశ్యం మిన్నంటుతుంది. నదీ తీరాల్లో కోలాహలంగా జరుపుకోవడం ఆనవాయితీ.
సంబరం: ఆడి 18వ రోజును ఆడి పెరుక్కుగా పిలుస్తుంటారు. కావేరి నదీ తీరంలో
అత్యంత వేడుకగా ఈ ఆడి పెరుక్కును జరుపుకుంటారు. ఇందు కోసం ప్రతి ఏటా మెట్టురు డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది కర్ణాటక వర్షాలతో మెట్టురుకు నీటి రాక పెరిగింది. దీంతో ఆ డ్యాం నుంచి రెండు వారాలుగా కావేరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీళ్లు ఆదివారం ఉదయానికి తిరుచ్చికి చేరారుు. సేలం, ఈరోడ్, నామక్కల్, తిరుచ్చి, ధర్మపురి, కృష్ణగిరిల్లో ఆడి పెరుక్కుకు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఉదయాన్నే నవ దంపతులు, కుటుంబాలు, అన్నదాతలు పెద్ద ఎత్తున కావేరి తీరానికి తరలి వచ్చారు. కావేరి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, నవదంపతులు గాజులు, బియ్యం, పసుపు కుంకుమలు, తమల పాకులను కలశాల మధ్య ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు.
పవిత్ర స్నానం ఆచరించినానంతరం తమ మంగళ సూత్రాలను మార్చుకున్నారు. నవ దంపతులు తమ వివాహ సందర్భంగా ఉపయోగించిన పూలమాలలను తీసుకొచ్చి కావేరి నదిలో కలిపేశారు. అన్నదాతలు విత్తనాలను, గత ఏడాది తమ చేతికి అందిన పంటలను కావేరి నదీ తీరంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆ పరిసరాల్లోని గ్రామ దేవతల ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు పసుపు తాడును కావేరి తీరంలో కలశాల మధ్యలో ఉంచి పూజలు చేశారు. పవిత్ర స్నానం అనంతరం ఆ తాడును తమ చేతికి కట్టుకున్నారు. ఆడి పెరుక్కును కోలాహలంగా జరుపుకుని కావేరి తల్లికి కృత జ్ఞతలు తెలియజేయడం ద్వారా తమ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని, మాంగల్య బలం గట్టిగా ఉంటుందని,
పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు అవుతాయని, పంటల దిగుబడి పెరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు పూజలు చేయడం విశేషం. అలాగే, ఇతర ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లల్లో పూజలు జరుపుకున్నారు. అలాగే, తమ పరిసరాల్లోని కొలనులు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లి పూజలు చేసుకున్నారు.నాగై, తంజైవాసుల్లో అసంతృప్తి : ఈ ఏడాది ఆడి పెరుక్కును కావేరి, భవానీ నది తీరవాసులు కోలాహలంగా జరుపుకున్నారు. సేలం, నామక్కల్, తిరుచ్చి వరకు కావేరి నదిలో మెట్టూరు నీళ్లు ప్రవహించాయి. ఈరోడ్డులో భవానీ నది నీళ్లు పొంగి పొర్లాయి. అలాగే, కావేరి, భవానీ, అముదం నదులు సంగమమయ్యే ప్రదేశంలో భక్త జనం పోటెత్తారు.
అయితే, తంజావూరు, నాగపట్నం జిల్లా వాసులు మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కావేరి నదీ జలాలు ఉదయానికి తిరుచ్చి అమ్మా మండపం చేరుకోవడంతో ప్రజలు ఆనందంలో మునిగారు. అయితే, ఆ నీళ్లు తంజావూరు, నాగపట్నం జిల్లాలకు చేరలేదు. ఇందుకు కారణం మెట్టూరు డ్యాం నుంచి నీళ్లు ఆలస్యంగా విడుదల చేయడమే. తమ జిల్లాల గుండా ప్రవహిస్తున్న కావేరి నదిలోకి నీళ్లు వస్తాయన్న ఆశతో తంజావూరు, నాగపట్నం తీర వాసులు ఎదురు చూశారు. అయితే, నీటి జాడ లేక పోవడంతో నిరుత్సాహంతో వెను దిరగాల్సి వచ్చింది. కొన్ని చోట్ల అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ గోతులు తవ్వి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెప్పించి అందులో పోశారు. చివరకు నిరుత్సాహంతో అక్కడి ప్రజలు ఆ నీటి ఆధారంగా ఆడి పెరుక్కును జరుపుకోవాల్సి వచ్చింది.