సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. గోదావరి బేసిన్‌లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ, ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి– కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... మొదట మహానది– గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి–కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది.
మహానదిలో మిగులు 100 టీఎంసీలే: ఒడిషా
ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది.
అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది. తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది.
అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాలోŠల్ కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహానది–గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి–కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది.
చత్తీస్‌గఢ్ కొర్రీ...
ఇక గోదావరి– కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటంతో వరంగల్ దగ్గర్లోని జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌న్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని కూడా తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మిగులు ఉన్నాయని చెబుతున్న ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే ఉపయోగించుకుంటామని ఎన్‌డబ్ల్యూడీఏ ముందు చత్తీస్‌గఢ్ గట్టిగా వాదిస్తోంది.
ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీల వినియోగం చేస్తామని అంటోంది. దీంతో తెలంగాణ సైతం మహానదిలో మిగులు నీటిని గోదావరికి తరలించి, రాష్ట్ర అవసరాలు తీర్చుతూ మిగులు నీటిని కావేరికి తరలించాలని పట్టుబడుతోంది. దీంతో పాటే ఎగువన రాష్ట్రాలు వారి రాష్ట్రాల సరిహద్దు పరిధిలో అంతర్గత నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాయని, దీనిద్వారా దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి లభ్యత తగ్గుతుందని అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment