గోదావరి.. కావేరి కలిపేద్దాం | Telangana: Central Government Accelerating The process Of River Connection | Sakshi
Sakshi News home page

గోదావరి.. కావేరి కలిపేద్దాం

Published Wed, Oct 20 2021 1:09 AM | Last Updated on Wed, Oct 20 2021 8:59 AM

Telangana: Central Government Accelerating The process Of River Connection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నదుల అనుసంధాన ప్రక్రియపై కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న కేంద్రం..ఇటీవల ఆ ప్రక్రియపై వేగం పెంచుతోంది. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. పరీవాహక రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒక్కొక్కటీ పరిష్కరించి వారిని ఒప్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ భేటీ జరగనుంది.

కమిటీకి చైర్మన్‌గా ఉన్న కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. మరోవైపు జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నదుల అనుసంధానంపై తన తదుపరి సమావేశాన్ని ఈనెల 29న హైదరాబాద్‌లోని జలసౌధ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను ఆహ్వానించింది. నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటాలు, ఆయకట్టు, ముంపు సమస్యలతో పాటు రాష్ట్రాలు లేవనెత్తే ఇతర అంశాలపై ఇందులో చర్చించనుంది.  

తమిళనాడు ఒత్తిడితో ముందుకు... 
నదుల అనుసంధానంలో భాగంగా మహానది–గోదావరి–కృష్ణా–కావేరి గ్రాండ్‌ ఆనకట్టల వరకు నీటిని తరలించే ప్రక్రియ ఉన్నప్పటికీ.. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం మహానది–గోదావరి అనుసంధానాన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని   భావించింది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని పేర్కొంటూ, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలించేలా రూ.86 వేల కోట్లతో ప్రణాళిక రచించింది.

అయితే ఇంద్రావతి నీటిపై ఛత్తీస్‌గఢ్‌ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తాము కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ఇంద్రావతి నీరు సరిపోతుందని, అలాంటప్పుడు ఇంద్రావతిలో మిగులు జలాలు ఉండవని అంటోంది. దీనికి తోడు ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపడితే తమ ప్రాంతంలోని 4 గ్రామాలకు ముంపు సమస్య తలెత్తుతుందని పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలు కూడా గోదావరి–కావేరి అనుసంధానంపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. అయితే దిగువ రాష్ట్రమైన తమిళనాడు మాత్రం ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని పట్టుబడుతోంది.

తమ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా 200 టీఎంసీల మేర నీటినైనా తమ సరిహద్దు వరకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనితో పాటు పూండీ రిజర్వాయర్‌ను ఆరనియార్‌ రిజర్వాయర్‌తో అనుసంధానించాలని, దీనిద్వారా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న 609 చెరువులు నింపేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలు ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది.  

మిగులు స్వేచ్ఛను హరించొద్దన్న ఏపీ 
ఇక పోలవరం వద్ద నీటి లభ్యత విషయంలో ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్‌ల లెక్కల మధ్య పొంతన లేదని ఏపీ అంటోంది. నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరుతోంది. నికర జలాలు వాడుకోగా మిగిలిన జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ కి కేటాయించారని, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇచ్చారని, ఇప్పుడు నీటిని కావేరికి తరలించే క్రమంలో ఏపీ హక్కులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.

తమ హక్కుల పరిరక్షణలో భాగంగా పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల తరలింపు, గోదావరి–పెన్నా లింకు ద్వారా 320 టీఎంసీలు తరలింపు ప్రణాళికలను పరిశీలించాలని కోరుతోంది. వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.

మహానది నీటిని తరలించాకే అంటున్న రాష్ట్రం 
గోదావరి–కావేరి అనుసంధాన డీపీఆర్‌ ఆమోదించేందుకు ముందుగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత అంశాలపై రాష్ట్రాలు, కేంద్ర జలసం ఘం ఆమోదం తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. దీంతో పాటే మొత్తంగా తరలించే నీటిలో 50 శాతం నీటి వాటాను తెలంగాణకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా భూసేకరణ అవసరం కానున్న దృష్ట్యా ఆ రాష్ట్రాలతో చర్చించాకే తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని అంటోంది.

గోదావరి నీటిని కావేరికి తరలించే ముందు తెలంగాణలో ఇచ్చంపల్లి ఎగువన ఉన్న దేవాదుల, తుపాకులగూడెం అవసరాలు, దిగువన ఉన్న సీతారామ ఎత్తిపోతల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, డీపీఆర్‌ను ఆమోదించే ముందే ఆయా ప్రాజెక్టుల నెలవారీ అవసరాలను లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. గోదావరి–కావేరి అనుసంధానానికి ముందే మహానది–గోదావరి అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని, అక్కడి నుంచి మిగులు జలాలను గోదావరికి తరలించాకే, గోదావరి జలాలు కావేరికి తరలించాలని కోరుతోంది.

దీంతో పాటు నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్‌ రిజ ర్వాయర్‌గా ప్రతిపాదించే ముందు బచావత్, బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఉన్న కేటాయింపుల్లో కృష్ణా బేసిన్‌లో నీటి అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇచ్చంపల్లి ప్రతిపాదన తుపాకులగూడెం ఫోర్‌షోర్‌లో ఉన్న నేపథ్యంలో దీనిద్వారా దేవాదుల, ఎస్సారెస్పీలపై పడే ప్రభావా న్ని అధ్యయనం చేయాలని కూడా కోరుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement