సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క కట్టింది.
సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్‌లకు తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.
ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో?
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు.
శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్‌డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్‌లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
‘నీటి’ మీద లెక్కలు
Published Thu, Dec 28 2023 4:45 AM | Last Updated on Thu, Dec 28 2023 3:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment