సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.
ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్‌లో ఈ విషయాలను ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది.
ఏ బేసిన్‌కు ఎంత వాటా?: గోదావరి బేసిన్‌లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంటోంది.
141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్‌లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్‌లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్‌లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్‌బేసిన్‌లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు.
రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు
గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు.
ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది.
రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం
కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్‌లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment