సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు.
గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు.
ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం..
గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది.
ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్‌ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్‌ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది.
ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతున్నా..
టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి.
ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment