నేడు ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశం
గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై జరగనున్న చర్చ
ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి నీళ్లను తరలించాలంటున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్‌వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని సైతం చేర్చినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్రానికి సమాచారం ఇచి్చంది.
అలాగైతే అన్నీ సమస్యలే: తెలంగాణ
ఆరు నెలల కిందట గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణకు అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ దానిపై అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బరాజ్ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ బరాజ్‌కి బ్యాక్‌వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు సైతం నష్టం కలుగుతుందని పేర్కొంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ పేర్కొంటుండగా, ఈ నీటి వినియోగం లెక్కలను సమరి్పంచాలని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ కోరింది.
దీంతో సమ్మక్కసాగర్ బరాజ్‌కి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బరాజ్ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలను తెలంగాణ అందించింది.
ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ తెలియజేసింది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ అంగీకారం లభించే పరిస్థితి లేకపోవడంతో సమక్కసాగర్ నుంచే నీటిని తరలించే అంశాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ సోమవారం నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది.
సిమ్యులేషన్ స్టడీకి కేంద్రం ఓకే
గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచి్చంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు.
అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బరాజ్ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బరాజ్ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించడంతో సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment