గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే!  | 85 TMC from Ichchampally can be used by the united Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే! 

Published Sun, Dec 24 2023 5:59 AM | Last Updated on Sun, Dec 24 2023 5:59 AM

85 TMC from Ichchampally can be used by the united Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాదని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య 1975, డిసెంబర్‌ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదు.

ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు స్పష్టంచేసింది. గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనను అమలుచేస్తే మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం, గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించినట్లవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయి ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తక్కువ వ్యయంతో పనులు పూర్తిచేయవచ్చునని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.  

ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ.. 
ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ (అప్పటి మధ్యప్రదేశ్‌)కు గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్‌ ఆనకట్ట (కావేరి) వరకూ నీటిని తరలించడం ద్వారా గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం చెప్పాయి.

గోదావరి నికర జలాల్లో మిగులులేదని.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే అనుసంధానం చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది.

దీనిపై ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మా కోటాలో నీటిని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. గోదావరి, ఉప నదులలోని నికర జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నీరు, వరద జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్‌ ఇచ్చింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు పలుమార్లు కోరింది. 

పోలవరం నుంచైతేనే కావేరికి గోదావరి.. 
గోదావరి బేసిన్‌లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏ రాష్ట్రం హక్కులకు విఘాతం కలగదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు.

పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు చేరిన గోదావరి జలాలను కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎత్తిపోసి.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరి గ్రాండ్‌ ఆనకట్టకు తరలించేలా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ, నిర్వాసితుల సమస్య తప్పుతుందని.. తక్కువ వ్యయంతో గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను న్యాయ, సాగునీటిరంగ నిపుణులు బలపరుస్తున్నారు.   

మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఇదీ.. 
గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975, డిసెంబర్‌ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్‌ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు.

మిగతా నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించాలి. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో మధ్యప్రదేశ్‌ 38 శాతం, మహారాష్ట్ర 35 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 27 శాతం వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10 శాతం ఆంధ్రప్రదేశ్, 10.50 శాతం మహారాష్ట్ర, 11.40 శాతం మధ్యప్రదేశ్‌ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే నిర్వహించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement