గోదావరి–బనకచర్ల అనుసంధానంపై కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదికపై నిపుణుల విస్మయం
పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల నుంచి బనకచర్లకు నీటిని తరలించేలా ప్రతిపాదన
కానీ.. ప్రాజెక్టులో నీటి మట్టం 41.15 మీటర్లకే అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆయకట్టుకే నీళ్లందవంటున్న నిపుణులు
ఇక బనకచర్లకు జలాల తరలింపు అసాధ్యమని స్పష్టీకరణ
45.72 మీటర్లలో నీటిని నిల్వ చేస్తేనే వరదను గరిష్టంగా ఒడిసిపట్టే అవకాశం
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అంటే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు అంగీకరించిందన్న మాట. అయితే.. ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.
ఇదెలా సాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయగలిగితేనే.. జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి, ఇటు గోదావరి–బనకచర్ల, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి జీవం తీసి.. బనకచర్లకు తరలిస్తామనడం చూస్తే ఆ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవచ్చని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.
కుడి కాలువ ఆయకట్టు, కృష్ణా డెల్టాకే చాలవు..
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకూ నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
బనకచర్లకు గోదావరి ఇలా..
గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా నది, నాగార్జునసార్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల అభయారణ్యంలో 26.8 కిలీమీటర్ల టన్నెల్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరింది. ఆ నివేదికలో పేర్కొన్న మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ఇలా..
తొలి దశ..
– పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ–శాడిల్ డ్యాం, ఎఫ్–శ్యాడిల్ డ్యాం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచుతారు.
– తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1400 నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, 178 కిలోమీటర్ల వరకూ పొడగిస్తారు. ఇందులో 5 వేల క్యూసెక్కులను ఆయకట్టుకు, మిగతా 5 వేల క్యూసెక్కులను భలేరావు చెరువులోకి తరలిస్తారు.
– బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణా నదిలోకి తరలిస్తారు.
– తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు రూ.13,511 కోట్లు వ్యయం అవుతుంది.
రెండో దశ
– కృష్ణా నదిలో 12.5 మీటర్లు (సముద్ర మట్టానికి) ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు ఐదు దశల్లో రోజూ 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి.. నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకూ సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు.
– సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి, పల్నాడులో బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి.
– రెండో దశ పనులకు 28,560 కోట్లు వ్యయం అవుతుంది.
మూడో దశ:
– బొల్లాపల్లి రిజర్వాయర్‌లో 172 మీటర్ల నుంచి మూడు దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి.. నల్లమలలో తవ్వే సొరంగం ద్వారా తరలించి, అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు వ్యయం అవుతుంది.
– ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం. బొల్లాపల్లి రిజర్వాయర్, కాలువల తవ్వకానికి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాలు అటవీ భూమి.
Comments
Please login to add a commentAdd a comment