ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి కనీస నీటిమట్టం
41.15 మీటర్లకే పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈమేరకే ప్రాజెక్టు పూర్తికి నిధులిచ్చేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం
ఎత్తు తగ్గించినా కేంద్ర కేబినెట్ భేటీలో అభ్యంతరం చెప్పని టీడీపీ మంత్రి రామ్మోహన్‌నాయుడు
కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి మీడియాకు వెల్లడించడం రివాజు
కానీ.. పోలవరానికి రూ.12,157.53 కోట్ల నిధులు మంజూరు చేయడాన్ని కూడా వెల్లడించని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
ఎత్తు తగ్గింపు బహిర్గతమవుతుందనే ఆ రోజు ప్రస్తావించలేదంటున్న అధికారవర్గాలు
ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ జల్ శక్తి శాఖ రాసిన లేఖల్లోనూ అదే అంశం స్పష్టీకరణ
ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై నోరుమెదపని రాష్ట్ర ప్రభుత్వం
తగ్గించేందుకు అంగీకరించడం వల్లే నోరు విప్పడం లేదంటున్న అధికారవర్గాలు
పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు.. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు.. కానీ ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల గరిష్టంగా నిల్వ చేసేది 115.44 టీఎంసీలే
వరద రోజుల్లో మినహా మిగతా సమయాల్లో పోలవరం ఆయకట్టుకు నీటిని అందించడం అసాధ్యమే
గోదావరి, కృష్ణా డెల్టాల స్థిరీకరణ సవాలే
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా సైతం సాధ్యం కాదు
960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి విఘాతమే.. చంద్రబాబు చారిత్రక తప్పిదాలతో జీవనాడిని జీవచ్ఛవంగా మార్చేశారంటున్న అధికారవర్గాలు
2019–24 మధ్య పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం
ఇప్పుడు దాన్ని అస్త్రంగా చేసుకొని ఎత్తును కేంద్రం తగ్గించేసిందంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు.
కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..
⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.
⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.
⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.
జీవనాడి కాదు జీవచ్ఛవమే..!
⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.
⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.
⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.
⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తగ్గించేందుకు తలూపడం వల్లే..
పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు.
ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..
కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క.
సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment