తుంగభద్ర డ్యామ్‌లోకి 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
నేడు మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా
గోదావరిలో మరింత పెరిగిన వరద
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 3.46 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం శనివారం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది.
నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 174 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 0.74 టీఎంసీలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీలోకి 6,064 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 6,596 క్యూసెక్కులను వదులుతున్నారు.
కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది.
పెరిగిన గోదా‘వడి’
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, శబరి ఉప నదులతో పాటు కొండ కాలువల నీళ్లు కూడా కలవడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 40.2 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరింది. పోలవరం ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్లను ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. శుక్రవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 7 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,48,191 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 1,800 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,46,391 క్యూసెక్కులను బ్యారేజీ నుంచి 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు.
శనివారం వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. జల వనరుల శాఖ అధికారుల అప్రమత్తమే ధవళేశ్వరంలోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment