varada
-
ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం శనివారం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 174 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 0.74 టీఎంసీలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీలోకి 6,064 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 6,596 క్యూసెక్కులను వదులుతున్నారు. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. పెరిగిన గోదా‘వడి’తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, శబరి ఉప నదులతో పాటు కొండ కాలువల నీళ్లు కూడా కలవడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 40.2 మీటర్ల(సముద్ర మట్టానికి)కు చేరింది. పోలవరం ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్లను ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. శుక్రవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 7 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,48,191 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 1,800 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,46,391 క్యూసెక్కులను బ్యారేజీ నుంచి 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. శనివారం వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. జల వనరుల శాఖ అధికారుల అప్రమత్తమే ధవళేశ్వరంలోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. -
‘సాక్షి’ చొరవ.. 31 మంది సురక్షితం
ఏలూరు (మెట్రో): ‘సాక్షి’ చొరవతో వరద నీటిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 31 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉంది. నారాయణపురం, బచ్చువారిగూడెం మధ్య కట్టమైసమ్మ గుడి వద్ద ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి మీదుగా కొయిదా ఆసుపత్రికి పలువురు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గురువారమూ పలువురు వైద్య సిబ్బంది, ప్రజలు కొయిదా బయల్దేరారు. వారు పెద్ద వాగు బ్రిడ్జి పైకి చేరుకున్న సమయంలోనే వాగులోకి ఒక్కసారిగా వరద రావడంతో గేట్లు ఎత్తేశారు. దీంతో భారీగా వరద నీరు బ్రిడ్జిమీదుగా ప్రవహించింది. మరోపక్క గోదావరి వరద కూడా పెరగడంతో నది బ్యాక్ వాటర్ కూడా మరోపక్క నుంచి బ్రిడ్జిని చుట్టుముట్టింది. దీంతో కొయిదా ఆస్పత్రి సిబ్బంది సహా 31 మంది బ్రిడ్జిపైన వరద నీటి మధ్యలో చిక్కుకుపోయారు. వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్థానికులు ఈ విషయాన్ని ‘సాక్షి’ మీడియాకు తెలిపారు. తక్షణమే స్పందించిన ‘సాక్షి’ సిబ్బంది జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణికి సమాచారం అందించారు. కలెక్టర్ వెంటనే స్థానిక ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, పాల్వంచ ఆర్డీవో, అశ్వారావుపేట తహసీల్దార్‌తోనూ మాట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. బోట్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడి, నౌకా దళం హెలికాప్టర్‌ను రప్పించారు. నౌకాదళం సిబ్బంది సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రమించి అందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. -
పెరుగుతున్న గోదా‘వడి’
సాక్షి, అమరావతి/ ధవళేశ్వరం: నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 88,409 క్యూసెక్కులు చేరుతుండగా బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.30 అడుగులకు చేరింది. 10,200 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన 78,209 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలో మొత్తం 175 క్రస్ట్‌గేట్లకుగాను 129 గేట్లను పైకిలేపి జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు విడుదల చేసిన నీటిలో తూర్పు డెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,200, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు వదిలారు. ఆల్మట్టిలోకి 23,678 క్యూసెక్కులుపశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణా, ఉపనదుల్లో వరద తగ్గింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 23,678 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పిత్తి చేస్తూ 3,980 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 90.33 టీఎంసీల నీరుంది. ఆల్మట్టి నిండాలంటే 39 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర నదిలోను వరద ప్రవాహం తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 12,194 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 31.7 టీఎంసీలకు చేరింది. ఇక తెలుగురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలంలోకి 1,060 క్యూసెక్కులు చేరుతుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో నీటినిల్వ 36.24 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. -
సీరియల్ హీరోయిన్‌తో పెళ్లి.. విడాకులిచ్చిన విలన్
ప్రేమ-పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. జీవితకాలం ప్రేమించడం, కలిసుండటం కష్టమే అని చేతులెత్తేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మలయాళ సెలబ్రిటీ జంట జిషిన్ మోహన్- వరద వచ్చి చేరింది. వీరు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా మాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇది నిజమేనని ధ్రువీకరించాడు జిషిన్. తాము విడిపోయామని వెల్లడించాడు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అంత టైం లేదు తాను ఓ సీరియల్ నటిని పెళ్లాడినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. దేవుడి దయ వల్ల సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేంత సమయం లేదు అని చెప్పుకొచ్చాడు. రీల్ లైఫ్‌లో హీరోయిన్- విలన్‌గా ఉన్న వీరు రియల్ లైఫ్‌లో మాత్ం జోడీ కట్టారని సంతోషించేలోపే ఇలా జరిగిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏడుస్తూ ఉండనక్కర్లే! తాజాగా వరద సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టింది. 'నిన్న నవ్వాను, ఈ రోజు నవ్వుతూనే ఉన్నాను. రేపు కూడా నవ్వులు చిందిస్తూనే ఉంటాను. జీవితం చాలా చిన్నది. ఏడుస్తూ గడపడం కాదు జీవితమంటే..!' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. మీ ఇద్దరి మధ్య ఏమైంది? ఎందుకని విడిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అమల అనే సీరియల్లో వరద హీరోయిన్గా, జిషిన్ విలన్‌గా నటించాడు. ఆ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు విడాకులు తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చదవండి: కథ వినలేదు, జోక్యం చేసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా.. అదీ అతడి గొప్పతనం! -
ఆపద వేళ.. ఆపన్న హస్తం
వేలేరుపాడు: ‘ఉన్నట్టుండి గోదావరికి వరద పోటు చేరింది. పెద్దవాగులోకి నీళ్లు ఎగదన్నాయి. దారులన్నీ మూసుకుపోయి రుద్రమకోట ఓ ద్వీపంలా మారిపోయింది. అటు కుక్కునూరు వెళ్లలేని పరిస్థితి. ఇటు వేలేరుపాడు రాలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం క్షణాల్లో అధికారులను పంపించింది. వారిచ్చిన సూచనల మేరకు మేమంతా సమీపంలోని ఓడగుట్టపైకి వెళ్లిపోయి తలదాచుకున్నాం. వరదలో మునిగిన పశువుల్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బోట్ల సాయంతో ఓడగుట్టపైకి చేర్చారు. తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి.. జనరేటర్ల సాయంతో వెలుగులు నింపారు. వరద తగ్గే వరకు ఇక్కడే ఆశ్రయం కల్పించారు. ఆహారం సమకూర్చా’రంటూ రుద్రమకోట గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. వరదల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పట్ల ఎంతో ఔదార్యం చూపారని.. ఆపద వేళ ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట వరద బాధితుల కోసం ఓడగుట్టపై ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో గ్రామానికి చెందిన 440 కుటుంబాల వారు ఆశ్రయం పొందుతున్నారు. ఏ లోటూ లేకుండా చూస్తున్నారు వరదల వల్ల తాము గ్రామం వదిలిపోవాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని నిర్వాసితులు చెప్పారు. తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారని తెలిపారు. గోదావరి గట్టుపైనే తమ గ్రామం ఉన్నందున చిన్నపాటి వరదొచ్చినా వరద తాకిడికి గురవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడల్లా ఓడగుట్ట పైకి చేరి నానా అగచాట్లు పడేవారమని, తమను పట్టించుకునే నాథుడు ఉండేవారు కాదని చెప్పారు. ముఖ్యమంత్రి ముందస్తు ఆదేశాల మేరకు ఇక్కడ జనరేటర్లు ఏర్పాటు చేశారని, గ్రామానికి రెండు బోట్లు కేటాయించారని గ్రామస్తులు వివరించారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామస్తులందరినీ బోట్లలో ఓడగుట్టకు తరలించారని, పశువులను కూడా బోట్లలో ఓడగుట్టకే తరలించారు. అక్కడే తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసి.. నిత్యావసర వస్తువులన్నీ సమకూర్చారని తెలిపారు. అప్పట్లో రెండు కేజీల బియ్యం ముఖాన కొట్టేవారు తెలుగుదేశం హయాంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తాము పడిన బాధలను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో వరదలు వచ్చినప్పుడు రెండు కిలోల బియ్యం, లీటర్ కిరోసిన్ చొప్పున తమ ముఖాన కొట్టి చేతులు దులుపుకునేవారని చెప్పారు. అవి అయిపోతే తమను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయ వల్ల తాము అన్ని సౌకర్యాలు పొందగలిగామని, ఏ లోటూ లేకపోవడంతో ఓడగుట్టపై ధైర్యంగా గడపగలుగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తమ గ్రామానికి ఎంతో సాయపడిందన్నారు. సచివాలయంలో పనిచేసే వీఆర్వో, వలంటీర్, పోలీస్, ఏఎన్ఎం, పశు వైద్యశాఖ ఏహెచ్ఏ తమను కంటికి రెప్పలా చూసుకున్నారన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు తాగునీరు, పాలు, ఐదు రోజులకు సరిపడా కూరగాయలు, బ్రెడ్, చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించి వరద బాధితులకు కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎప్పుడూ ఇంత సాయం అందలేదు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత సాయం అందలేదు. మేం గుట్టకు వెళ్లిన వెంటనే మంచినీటి ప్యాకెట్లు అందించారు. కూరగాయలు ఇచ్చారు. ఏ లోటూ రాకుండా చూశారు. – కణితిరెడ్డి లక్ష్మీనర్సయ్య, వరద బాధితుడు పశువుల్ని కూడా కాపాడారు గోదావరి నీటిలో మునిగిన పశువులను కూడా కాపాడారు. గ్రామంలో ఉన్న వందలాది పశువులను బోట్లలో ఓడగుట్టకు తరలించారు. పశు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్‌కు ధన్యవాదాలు – షేక్ షఫీ, వరద బాధితుడు అప్పట్లో బియ్యంతో సరిపెట్టారు టీడీపీ హయాంలో కేవలం రెండు కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 25 కేజీల బియ్యంతోపాటు కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, తక్షణ సాయంగా 2వేల నగదు అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు అన్నీ సమకూర్చారు. విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గ్రామస్తులకు జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. – జి.భాస్కర్, రుద్రమకోట గ్రామస్తుడు -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి దూకుడు ప్రదర్శిస్తోంది. ఆదివారం సాయంత్రం బ్యారేజ్‌లోకి 16,43,480 క్యూసెక్కులు (142.02 టీఎంసీలు) చేరుతుండటంతో నీటిమట్టం 16 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చి న గరిష్ట ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గోదావరి డెల్టాకు 10,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 16,32,780 క్యూసెక్కులను (141.09 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 831.357 టీఎంసీల గోదావరి మిగులు జలాలు కడలిపాలవడం గమనార్హం. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు వస్తున్న ప్రవాహం 13.06 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 50.9 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి 13,80,216 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం స్పిల్ వేకు ఎగువన 34.28, దిగువన 26.21, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 35.43, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 25.47 మీటర్లకు చేరుకుంది. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి 13.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్‌లలోకి చేరే ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టనుంది. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల వరద తగ్గుముఖం పట్టింది. గోదావరి వరద శనివారం అర్థరాత్రి నుంచి తగ్గుతుండగా శబరినది వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గసాగింది. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చింతూరు మండలంలో వరదనీరు జాతీయ రహదారులపై నిలిచిపోవడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ప్రజలను, అధికారులను ఆందోళనకు గురిచేసిన వరద ప్రభావం ఆదివారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరదతో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పలు ఇళ్లు నీట మునిగాయి. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి 833 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తోందని ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం 348.27 అడుగుల మట్టంలో నీరు ఉంది. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి గంటకు 881 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఏలూరు మండలం కోమటిలంక గ్రామం వద్ద నాగరాజు కోడు (పోలరాజు డ్రెయిన్) వద్ద కాజ్‌వేపై వరద నీరు ప్రమాదకర పరిస్థితిలో ప్రవహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి వద్ద గోదావరి నిలకడగానే ప్రవహిస్తోంది. నరసాపురం పట్టణంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారులు ఏటిగట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, మర్రిమూల, పెదమల్లంలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 9 మండలాల్లోని 30 గ్రామాలు వరద బారిన పడ్డాయి. ఇక్కడ శనివారం కన్నా ఆదివారం ఒక అడుగు ఎత్తున ముంపు పెరిగింది. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. పి.గన్నవరం పాత అక్విడెక్టు, అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే మూడుచోట్ల కాజ్‌వేలు మునిగిపోగా, కొత్తగా పలు కాజ్‌వేల మీదకు వరద నీరు చేరింది. పి.గన్నవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, అయినవిల్లి మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. -
భద్రకాళి చెరువుకు గండి!
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ అర్బన్/ వరంగల్/ ఖిలావరంగల్/ హనుమకొండ అర్బన్: ఇప్పటికే నీట మునిగి అతలాకుతలమైన వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం గండిపడింది. చెరువుకు ఒక్కసారిగా వరద పెరగడంతో.. పోతననగర్ వైపు కట్టకు కోతపడింది. దీంతో పోతననగర్, సరస్వతినగర్ కాలనీల జనం భయాందోళనకు గురయ్యా రు. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఈ రెండు కాలనీలతోపాటు కాపువాడ కాలనీ, రంగపేటల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండిపడిన ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేపట్టారు. చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌లు పరిశీలించారు. కాలనీల ప్రజలను ముందు జాగ్రత్తగా మాత్రమే తరలించామని.. చెరువు గండి కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా.. భద్రకాళి చెరువు శిఖం భూముల్లో ఆక్రమణలే ప్రస్తుత దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పాత రికార్డుల ప్రకారం భద్రకాళి చెరువు విస్తీర్ణం 621 ఎకరాలు అయి తే.. సుమారు41 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు చెప్తున్నారు. ఇంకా నీటిలోనే పలు కాలనీలు..: భారీ స్థాయిలో వరదలతో జలమయమైన వరంగల్ నగరంలో ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. 33వ డివిజన్ సీఆర్‌నగర్, 34వ శివనగర్, 39వ డివిజన్ శాకరాసికుంట కాలనీ రోడ్లపై వరద నీరు పారుతూనే ఉంది. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఖిలా వరంగల్ అగర్త చెరువుల మత్తడి నీరు మైసయ్యనగర్ మీదుగా శివనగర్‌లోని రహదారులపై పారుతోంది. ఇక మిగతా ప్రాంతాల్లోని కాలనీల్లో వరద తగ్గిపోవడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ ఇళ్ల నిండా బురద ఉండటం, సామగ్రి అంతా తడిసిపోవడాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో వరద నష్టం రూ. 414కోట్లు: వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ఊహించని విధంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని.. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.414 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా ల్లో 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 38 రెస్క్యూ టీమ్‌ల ద్వారా 2,055 మందిని వివరించారు. 207 ఇళ్లు పూర్తిగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించినట్టు తెలిపారు. బాధితులు ఆందోళన చెందవద్దని, త్వరలో పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. -
చంద్రబాబు నిర్వాకం ఫలితం.. ముంపు ముంగిట్లో రాజధాని అమరావతి
తాడికొండ : ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పిన గొప్పలు చిన్నపాటి వర్షానికే వెక్కిరిస్తున్నాయి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని, శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు వంటి నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను తొక్కిపెట్టిన చంద్రబాబు నారాయణ కమిటీ వేసి తనకు అనుకూలంగా రాజధాని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా రాజధాని ప్రాంతానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, చీకటి వాగుకు వచ్చే భారీ వరద నీటిని మళ్ళించేందుకు గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సచివాలయం, హైకోర్టును వరద నీరు భారీగా చుట్టుముట్టింది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు వెళ్లే రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొండవీటి వాగుకు భారీగా వచ్చిన వరదతో పెదపరిమి, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు ప్రాంతాల్లో పొలాలు, రోడ్లు ముంపునకు గురయ్యాయి. కోటేళ్ల వాగుకు బు«ధ, గురువారాలు ఉప్పొంగడంతో సచివాలయ, హైకోర్టు ఉద్యోగులు మంగళగిరి మీదుగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేకుండా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అఖండ గోదావరి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదికి జలకళ మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్‌కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్! గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది. -
మునిగిన మోరంచపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు పోటెత్తడంతో.. కుందయ్యపల్లి గ్రామ సరిహద్దు నుంచి లక్ష్మారెడ్డిపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పున వరద ప్రవహించింది. మధ్యలో ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. గ్రామంలోని 280 ఇళ్లలోని సుమారు వెయ్యి మంది సమీపంలోని భవనాలపైకి ఎక్కి తడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇద్దరు వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయారు. వరదలో గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగడి సరోజన, గడ్డం మహాలక్ష్మి, మరికొందరు గల్లంతయ్యారు. బోట్ల సాయంతో కొందరిని రక్షించారు. సాయంత్రానికి వరద తగ్గింది. ఇక బాధితులను కాపాడేందుకు వచ్చిన రెండు హెలికాప్టర్లు.. చిట్యాల మండలంలో మోరంచవాగులో చిక్కుకున్న అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు బ్రిడ్జి నిర్మాణ కార్మికులను కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ♦ పెద్దవంగర మండలం పొచంపల్లి ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. కొంపల్లి, మహబూబ్‌పల్లి గ్రామాల మధ్య కాలువలో కొట్టుకుపోయి జోగు సంజీవ్ అనే వ్యక్తి చనిపోయాడు. ♦ ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం మారేడుగొండ చెరువుకు గురువారం తెల్లవారుజామున 3 చోట్ల గండిపడటంతో పక్కనే నివసించే బండ సారయ్య, ఆయన భార్య, తల్లి వరదలో కొట్టుకుపోయారు. సారయ్య మృతదేహం లభ్యమైనా మిగతా వారి ఆచూకీ దొరకలేదు. ♦ హనుమకొండ జిల్లా కన్నారం గ్రామానికి చెందిన పొన్నాల మహేందర్ (32) కన్నారం చెరువు మత్తడి నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. ♦ వరంగల్‌లోని 56వ డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ–2కు చెందిన గట్టు రాజు(37) వరదలో గల్లంతయ్యాడు. -
జూరాలకు కొనసాగుతున్న వరద
జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం ఎనిమిది క్రస్టుగేట్లు ఎత్తి 1,14,121 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 47వేల క్యూసెక్కులు విడుదల చేశారు. మొత్తం 1,62,786 క్యూసెక్కుల వరదను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల రిజర్వాయర్ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.71 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 1300 క్యూసెక్కులు వదులుతున్నారు. భీమా లిఫ్ట్–2 ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1 ద్వారా 1300 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.