సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద అప్రమత్తం
భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా నదికి జలకళ
మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్‌లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్‌కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది.
కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్!
గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు.
గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది.
Comments
Please login to add a commentAdd a comment