Babli praject
-
అఖండ గోదావరి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదికి జలకళ మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్‌కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్! గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది. -
జల సంబురం
బాసర: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లు ఎత్తారు. ఆ నీరు బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద గల గోదావరి నదిలో చేరి నిండుకుండను తలపిస్తోంది. బాసరకు వచ్చిన భక్తులు, గ్రామస్తులు గోదావరి ఒడ్డుకు వచ్చి నీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ‘సాగర్’ నీరు విడుదల నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం నుంచి కృష్ణా డెల్టాకు బుధవారం ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. గతనెల 25వ తేదీ నుంచి ఈనెల 1వతేదీ దాకా వారంరోజులపాటు రోజుకు సుమారు ఆరువేల క్యూసెక్కుల చొప్పున 3.6టీఎంసీల నీటిని విడుదల చేశారు. మంగళవారం నాటికి కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే చేరిందని, తాగునీటి అవసరాలకు నీటివిడుదలను పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డు ఇన్చార్జ్ చైర్మన్ పాండ్యాను కోరింది. ఆ మేరకు బుధవారం మధ్యాహ్నం 12.40లకు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. పెరుగుతున్న శ్రీరామ్ సాగర్ నీటిమట్టం బాల్కొండ: మహారాష్ట్ర సర్కారు మంగళవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఉన్న శ్రీరామసాగర్లో నీటిమట్టం క్రమంగా పె రుగుతోంది. ప్రాజెక్ట్‌లోకి 0.7 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు 0.35 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీం తో ప్రాజెక్ట్ నీటి మట్టం 0.20 అడుగులు పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా బుధ వారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1,067.70 అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. -
నేటి నుంచి బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేత
ముంబయి : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేటి నుంచి మూసివేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గేట్లు మూసివేస్తారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం అక్టోబరు 29 నుంచి జూలై 1వరకూ గేట్లు మూసివేస్తారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకే మహారాష్ట్ర ప్రభుత్వం గేట్లను మహారాష్ట్ర సర్కార్ ముసివేస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఎస్సారెస్పీ అంతర్భాగంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మించిందని మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 28న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల దాహార్తి తీర్చడానికి 2.84 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాక అక్టోబర్ 29 నుంచి 30వ తేదీ వరకు గేట్లను కిందకు దించుకోవచ్చు. జూలై 1 తేదీ నుంచి అక్టోబర్ 28వరకు గేట్లను పైకి ఎత్తి ఉంచాలి. అంటే ఈ నాలుగు నెలలు ఇన్‌ఫ్లోను అడ్డుకోవద్దు. ప్రస్తుత ప్రాజెక్టు నిండినందున నీటి కొరతలేకున్నప్పటికీ వర్షాభావం ఏర్పడిన సమయాల్లో మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కేవలం నాలుగు నెలలు మాత్రం నీటి ప్రవాహనికి అడ్డు ఉండదు. మిగతా ఎనిమిది నెలలు గేట్లు మూసి ఉంటాయి. అంతేగాక నిర్ణీత 2.84 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. ఎస్సారెస్పీకి పరివాహక ప్రాంతమంతా మహారాష్ట్రలోనే ఉంది. ఆంధ్ర పరివాహక ప్రాంతం చాలా తక్కువగా ఉంది. మహారాష్ట్ర నుంచి వరదనీరు వస్తేనే ప్రాజెక్టు నిండుతుంది.