జల సంబురం
బాసర: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లు ఎత్తారు. ఆ నీరు బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద గల గోదావరి నదిలో చేరి నిండుకుండను తలపిస్తోంది. బాసరకు వచ్చిన భక్తులు, గ్రామస్తులు గోదావరి ఒడ్డుకు వచ్చి నీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
‘సాగర్’ నీరు విడుదల
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం నుంచి కృష్ణా డెల్టాకు బుధవారం ఎన్‌ఎస్‌పీ అధికారులు నీటిని విడుదల చేశారు. గతనెల 25వ తేదీ నుంచి ఈనెల 1వతేదీ దాకా వారంరోజులపాటు రోజుకు సుమారు ఆరువేల క్యూసెక్కుల చొప్పున 3.6టీఎంసీల నీటిని విడుదల చేశారు. మంగళవారం నాటికి కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే చేరిందని, తాగునీటి అవసరాలకు నీటివిడుదలను పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డు ఇన్‌చార్జ్ చైర్మన్ పాండ్యాను కోరింది. ఆ మేరకు బుధవారం మధ్యాహ్నం 12.40లకు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు.
పెరుగుతున్న శ్రీరామ్ సాగర్ నీటిమట్టం
బాల్కొండ: మహారాష్ట్ర సర్కారు మంగళవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఉన్న శ్రీరామసాగర్‌లో నీటిమట్టం క్రమంగా పె రుగుతోంది. ప్రాజెక్ట్‌లోకి 0.7 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు 0.35 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీం తో ప్రాజెక్ట్ నీటి మట్టం 0.20 అడుగులు పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా బుధ వారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1,067.70 అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.