ముంబయి : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేటి నుంచి మూసివేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గేట్లు మూసివేస్తారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం అక్టోబరు 29 నుంచి జూలై 1వరకూ గేట్లు మూసివేస్తారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకే మహారాష్ట్ర ప్రభుత్వం గేట్లను మహారాష్ట్ర సర్కార్ ముసివేస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఎస్సారెస్పీ అంతర్భాగంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మించిందని మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 28న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల దాహార్తి తీర్చడానికి 2.84 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాక అక్టోబర్ 29 నుంచి 30వ తేదీ వరకు గేట్లను కిందకు దించుకోవచ్చు. జూలై 1 తేదీ నుంచి అక్టోబర్ 28వరకు గేట్లను పైకి ఎత్తి ఉంచాలి. అంటే ఈ నాలుగు నెలలు ఇన్‌ఫ్లోను అడ్డుకోవద్దు. ప్రస్తుత ప్రాజెక్టు నిండినందున నీటి కొరతలేకున్నప్పటికీ వర్షాభావం ఏర్పడిన సమయాల్లో మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
కేవలం నాలుగు నెలలు మాత్రం నీటి ప్రవాహనికి అడ్డు ఉండదు. మిగతా ఎనిమిది నెలలు గేట్లు మూసి ఉంటాయి. అంతేగాక నిర్ణీత 2.84 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. ఎస్సారెస్పీకి పరివాహక ప్రాంతమంతా మహారాష్ట్రలోనే ఉంది. ఆంధ్ర పరివాహక ప్రాంతం చాలా తక్కువగా ఉంది. మహారాష్ట్ర నుంచి వరదనీరు వస్తేనే ప్రాజెక్టు నిండుతుంది.
నేటి నుంచి బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేత
Published Tue, Oct 29 2013 8:38 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
Advertisement