వారిని ఇష్టారాజ్యంగా పదవి నుంచి తొలగించడం తగదు
ఎన్నికల్లో కష్టపడి గెలిచిన మహిళలను కించపరచొద్దు
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ మహిళా సర్పంచిని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును న్యాయస్థానం కొట్టివేసింది.
మహిళలు గ్రామ సర్పంచి కావడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలనా సామర్థ్యాలు ఉంటాయని, వారిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీశ్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్ఖేడ్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలను మనీశ్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్‌ను సర్పంచి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాలు చేశారు.
హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచిగా విధులు నిర్వర్తించవచ్చంటూ తీర్పు వెలువరించింది. దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుండగా, మరోవైపు వారిని నిరుత్సాహపర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వారిని కింపచర్చడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది. పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment