Govt Orders
-
మహిళా ప్రజాప్రతినిధులంటే అలుసా?
న్యూఢిల్లీ: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ మహిళా సర్పంచిని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును న్యాయస్థానం కొట్టివేసింది. మహిళలు గ్రామ సర్పంచి కావడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలనా సామర్థ్యాలు ఉంటాయని, వారిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీశ్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్ఖేడ్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలను మనీశ్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్‌ను సర్పంచి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచిగా విధులు నిర్వర్తించవచ్చంటూ తీర్పు వెలువరించింది. దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుండగా, మరోవైపు వారిని నిరుత్సాహపర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వారిని కింపచర్చడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది. పేర్కొంది. -
Telangana: ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. వాహన యజమానులకు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు మూడునాలుగేళ్లుగా వారు వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించటం లేదు. దీంతో ఒక్కో వాహనానికి రూ.30 వేల నుంచి రూ. 70 వేల వరకు పెనాల్టీలు పేరుకుపోయాయి. కొన్ని వాహ నాలకు ఏడేళ్లుగా కూడా ఫిట్నెస్ రెన్యువల్ లేకపోవటంతో రూ.లక్షకుపైగా పెనాల్టీలున్నాయి. దీంతో రోడ్డెక్కితే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వేల సంఖ్యలో వాహనాలను వాటి యజమానులు ఇళ్లకే పరిమితం చేశారు. ఫలితంగా వాటి రూపంలో ఆదాయం రాక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఫిట్నెస్ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రమే కల్పించింది. దాన్ని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ.650 కోట్ల బకాయిలు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర సరుకు రవాణా వాహనాలు.. ఇలా అన్ని రకాల రవాణా వాహనాల యజమానులు చాలాకాలంగా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం లేదు. వాటికి నిబంధన ప్రకారం రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తే రవాణా శాఖకు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. ఇప్పుడు ఈ పెనాల్టీ నుంచి మినహాయింపునివ్వడంతో అంతమేర ఆయా వాహనాల యజమానులకు వెసులుబాటు కలగగా, రవాణాశాఖ అంతమేర ఆదాయం కోల్పోయినట్టయింది. ఇక మళ్లీ రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సందడి ఈ పెనాల్టీ బకాయిలకు భయపడి వాటి యజమానులు ఆ వాహనాలను ఇళ్ల వద్దనే ఉంచేశారు. ఫలితంగా కొంతకాలంగా రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 35 వేల నుంచి 40 వేల ఆటోలు, 50 వేల క్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. కోవిడ్ సంక్షోభంతో మరో 30 వేల దాకా మాయమయ్యాయి. వెరసి లక్షకు పైగా ఆటోలు, క్యాబ్‌లు లేకపోయేసరికి నగరంలో క్యాబ్ బుక్ చేస్తే గతంలోలాగా వెంటనే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ వాహనాలు తిరిగి రోడ్డెక్కే అవకాశం ఉంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా.. రవాణా శాఖ నిఘా లేకపోవటాన్ని రవాణా వాహన యజమానులు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా పట్టుకునేవారే లేకపోవడంతో కొన్నేళ్లుగా వారు దానిమీద దృష్టిపెట్టడం లేదు. ఏడాదికి రూ.735 ఫీజు చెల్లిస్తే సరిపోయే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్‌ను పట్టించుకోవటం లేదు. వాహనాలు ఫిట్నెస్ తప్పి తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతున్నా రవాణాశాఖ పట్టించుకోవటం లేదు. ఇది వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే, వాహన యజమానుల్లో భయం వచ్చేలా రోజుకు రూ.50 పెనాల్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ భయంతో మిగతా వాహనాల యజమానులు ఠంఛన్‌గా ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రవాణా వాహన యజమానుల్లో మళ్లీ నిర్లక్ష్యం వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీన్ని నివారించాలంటే రవాణాశాఖ కఠినంగా ఉండాలని సీనియర్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. -
కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్ అంటూ నినదించారు. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. -
అధిక డివిడెండ్లపై సర్కారు ఆశలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో ఖజానా ఆదాయానికి గండి పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) చెల్లించే డివిడెండ్లపై కేంద్రం ఆశలు పెట్టుకుంది. వీలైనంత అధికంగా, సాధ్యమైనంత త్వరగా డివిడెండ్లు చెల్లించాలంటూ పీఎస్‌యూలకు సూచించింది. త్రైమాసికాలవారీగా చెల్లించేయాలంటూ కాస్త పటిష్టంగా ఉన్న సంస్థలను ఆదేశించింది. కనీస పరిమాణం చెల్లించాలన్న నిబంధనలను పట్టుకుని కూర్చోకుండా సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించేందుకు కృషి చేయాలని పేర్కొంది. దీనివల్ల విడతలవారీగా వచ్చే డివిడెండుపై కాస్త అంచనాకు వచ్చేందుకు, తగు ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు అన్ని పీఎస్‌యూల అధిపతులకు లేఖలు పంపింది. ‘‘మిగతావాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా డివిడెండ్లు చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ).. త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రతీ త్రైమాసికంలో మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశాలను పరిశీలించాలి. మిగతా సీపీఎస్ఈలు అర్ధ సంవత్సరానికోసారి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించవచ్చు. ఇక డివిడెండ్ చెల్లింపునకు పెద్దగా అవకాశం లేని సంస్థలు .. వార్షికంగా కట్టే అంశం పరిశీలించవచ్చు. రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన తర్వాత తమ తమ అంచనాల ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో కట్టవచ్చు’’ అని పేర్కొంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక అంచనాల్లో కనీసం 90 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా విడతలవారీగా మధ్యంతర డివిడెండ్ కింద కట్టడంపై దృష్టి పెట్టాలని దీపం సూచించింది. ప్రస్తుతం ఆఖర్లో చెల్లింపులు .. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ లాభాల్లో 30 శాతం లేదా నికర విలువలో 5 శాతం మేర కనీస డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. చాలా మటుకు కంపెనీలు సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తుంటాయి. అయితే, ఇలా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో చెల్లించేటప్పుడు ... ఇతరత్రా సరఫరాదారులకు, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు మొదలైన వాటికి కూడా చేతిలో ఉన్న నిధులనే సర్దుబాటు చేయాల్సి వస్తుండటం .. కంపెనీలకు సమస్యాత్మకంగా మారుతోందని దీపం అభిప్రాయపడింది. చివర్లో కాకుండా ముందు నుంచీ కొంత కొంతగా చెల్లించడం వల్ల ఇలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఇక స్థిరమైన డివిడెండ్ విధానమంటూ ఉంటే ఇన్వెస్టర్లకు కూడా సీపీఎస్ఈ షేర్లపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొంది. ‘‘తరచుగా లేదా మూణ్నెల్లకోసారి డివిడెండ్లు చెల్లిస్తున్న పక్షంలో నాణ్యమైన ఇన్వెస్టర్లు.. ఆయా సంస్థల స్టాక్స్‌పై ఆసక్తి చూపవచ్చు. భవిష్యత్ డివిడెండ్లపై ఆశతో వాటిని అట్టే పెట్టుకుని కూడా ఉండవచ్చు’’ అని దీపం తెలిపింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్లే తాజా ఆదేశాలు తెరపైకి వచ్చి ఉంటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణం. పీఎస్‌యూలు ఒకేసారి గాకుండా రెండు లేదా నాలుగు విడతల్లో గానీ చెల్లిస్తే అవి నగదును మెరుగ్గా నిర్వహించుకోగలవు. అలాగే, ప్రభుత్వం తన రుణ అవసరాలను బేరీజు వేసుకునేందుకు వీలుంటుంది. రుణ సమీకరణ ప్రణాళికలను అర్ధాంతరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బాండ్ మార్కెట్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు. పీఎస్‌యూలకు ఆర్థికంగా ప్రతికూలం.. మరింత ఎక్కువగా డివిడెండ్ చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి పెంచితే వాటి ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధిక డివిడెండ్ చెల్లింపుల కారణంగా అవి తమ పెట్టుబడి వ్యయాల కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మరింత ఎక్కువ డివిడెండ్ చెల్లించే పరిస్థితిలో కూడా పీఎస్‌యూలు లేవని తెలిపారు. గడిచిన అయిదేళ్లలో ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, వంటి దిగ్గజాలు తమ లాభదాయకత తగ్గుతూ, రుణభారం పెరుగుతూ ఉన్నప్పటికీ డివిడెండ్లను అదే స్థాయిలోనో లేదా అంతకు మించే చెల్లిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో 55 లిస్టెడ్ పీఎస్‌యూలు రూ. 82,750 కోట్ల లాభాలపై రూ. 47,000 కోట్ల మేర డివిడెండ్ చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో నమోదైన 70% పోలిస్తే ఇది కాస్త తగ్గి 57 శాతానికే పరిమితమైనప్పటికీ.. మిగతా కార్పొరేట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే. నిఫ్టీ50 సూచీలోని టాప్ సంస్థలు తమ లాభాల్లో సగటున 45% మాత్రమే చెల్లించాయి. అదే అయిదేళ్ల వ్యవధిలో చూస్తే ఈ 55 సంస్థలు సుమారు రూ. 3.85 లక్షల కోట్ల లాభాలపై మొత్తం రూ. 2.75 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించాయి. అంటే రికార్డు స్థాయిలో లాభాల్లో ఏకంగా 71.5% చెల్లించాయి. నిఫ్టీ 50 సంస్థలు చెల్లించిన దానికి (32 శాతం) ఇది రెట్టింపు. ఇవి కాకుండా షేర్ల బైబ్యాక్‌ల రూపంలోనూ ప్రభుత్వానికి పీఎస్‌యూలు గణనీయంగా చెల్లించాయి. -
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్
-
విశాఖ మెట్రో : ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలించేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతుంది. (8 కారిడార్లు.. 140.13 కి.మీ) గతంలో డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్ఫ్రా కాన్సార్షియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్వరుల్లో పేర్కొంది. మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం కోసం డీపీఆర్‌ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడరన్ ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. (మెట్రో రీ టెండరింగ్) (విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు) -
'ప్రభుత్వ జీవోలను వెబ్సైట్లలో ఉంచాలి'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలందరూ చూసే విధంగా ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేరాల శేఖర్ అనే వ్యక్తి ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇప్పటివరకూ లక్షకుపైగా జీవోలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయగా అందులో 42,500 జీవోలను వెబ్సైట్లలో పొందుపరచలేదని ఆయన తన పిటిషన్లో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఆర్డినెన్స్ ప్రతులు చించిన బీసీ నేతలు
హైదరాబాద్: 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం హేయకరమైన చర్య అని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్ వద్ద ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రతులను చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి మాకు బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలను కలచివేస్తుందన్నారు. పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్లను కల్పించినట్లయితే కేటీఆర్ అన్న మాటను మేము ఆహ్వానించేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా వ్యతిరేకంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు పాల్గొన్నారు. -
తెలుగులోనూ ఉత్తర్వులివ్వండి
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉత్తర్వులు, అలాగే ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన ఉత్తర్వులు ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులతో పాటు అనువాద విభాగంలోని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక, సాధారణ పరిపాలన, హోం, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, అటవీ, పౌరసరఫరాలు, ఇరిగేషన్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, శాఖల మధ్య సమన్వయం, ప్రగతి సూచీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి శాఖ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని పనిచేయాలని సూచించారు. కలసి పనిచేయండి.. రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, మార్కెటింగ్, గోడౌన్ల సామర్థ్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు పంటల సాగుపై కలసి పనిచేయాలని, సం యుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ జోషి చెప్పారు. అలాగే మైక్రో, డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఎౖMð్సజ్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ శాఖల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. టెక్స్టైల్ పార్కు, ఫార్మాసిటీ, నిమ్జ్, ఈఓడీబీ, టీఎస్ఐపాస్, ఫుడ్ ప్రాసెసింగ్, జినోం వ్యాలీ, లెదర్ పార్కు, ఎంఎస్ఎంఈ, ఫైబర్ నెట్ వర్క్, ఈ–ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలపై పురోగతిని కూడా సీఎస్ సమీక్షించారు. ఐటీ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రా జేశ్వర్ తివారి, ముఖ్య కార్యదర్శులు అధర్ సిన్హా, రామకృష్ణారావు, సోమేశ్‌కుమార్, రజత్ కుమార్, రాజీవ్ త్రివేది, వికాస్ రాజ్, జయేశ్ రంజన్, శాలినీ మిశ్రా, కార్యదర్శు లు సందీప్‌కుమార్ సుల్తానియా, శివశంకర్, పార్థసారథి, నదీమ్ అహ్మద్, ఆర్.వి.చంద్రవదన్, శ్రీలక్ష్మి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అంజనీకుమార్, తేజ్‌దీప్ కౌర్ మీనన్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌లోని పీసీసీఎఫ్ ఆఫీసులో ఏపీసీసీఎఫ్(ఎల్ఆర్)గా పనిచేస్తున్న వై.బాబూరావును మహబూబ్‌నగర్ ఏపీసీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా నియమించారు. పీసీసీఎఫ్ కార్యాలయంలో ఏపీసీసీఎఫ్(జేఎఫ్ఎం)గా పనిచేస్తున్న ఎం.సి.పర్గేయిన్ను అచ్చంపేట (హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏపీసీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఎస్ఎన్ కుక్రెటీని రంగారెడ్డిజిల్లాలోని అదే పోస్టులో నియమించారు. సీసీఎఫ్ డబ్ల్యూఎల్ఎం సర్కిల్, ఎఫ్‌సీఆర్ డీన్‌గా ఉన్న జి.చంద్రశేఖర్‌రెడ్డిని హైదరాబాద్‌లో ని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్‌లోని సీసీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న ఏకే సిన్హాను మెదక్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా నియమించా రు. అచ్చంపేట(హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) ఆమ్రాబాద్ టైగ ర్ రిజర్వ్ సీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్ వినయ్‌కుమార్‌ను నిజామాబాద్ జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీచేశారు. నిర్మల్ (హైదరాబాద్‌లో తాత్కాలిక హెడ్‌క్వార్టర్స్) కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీసీఎఫ్/ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సంజీవ్కుమార్గుప్తాను అక్కడే పీడీగా, ఆదిలాబాద్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఉన్న టీపీ తిమ్మారెడ్డిని అక్కడే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా సవరించిన పరిధిని బట్టి కొనసాగించనున్నారు. వరంగల్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఉన్న మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్‌ను వరంగల్‌లోనే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా కొనసాగిస్తారు. వరంగల్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీఅండ్‌ఈ సర్కిల్‌గా ఉన్న పీవీ రాజారావును భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీఅండ్‌ఈ సర్కిల్‌గా ఉన్న బి.ఆనంద్‌మోహన్‌ను కరీంనగర్ జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బదిలీ చేశారు. ఖమ్మం సీఎఫ్/కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్న జి.నరసయ్యను అదే జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా కొనసాగిస్తారు. పాల్వంచ డీఎఫ్‌వోగా ఉన్న సి.శరవణన్‌ను భద్రాద్రిజిల్లా కొత్తగూడెం హెడ్‌క్వార్టర్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. హైదరాబాద్ డీఎఫ్‌వోగా ఉన్న బి.శ్రీనివాస్‌ను రంగారెడ్డి డీఎఫ్‌వోగా బదలీచేశారు. కరీంనగర్(పశ్చిమ) డీఎఫ్‌వోగా ఉన్న సీపీ వినోద్‌కుమార్‌ను హైదరాబాద్ డీఎఫ్‌వోగా బదిలీచేశారు. నిజామాబాద్ డీఎఫ్‌వోగా ఉన్న వీఎస్ఎన్వీ ప్రసాద్‌ను సవరించిన పరిధి మేరకు అక్కడే కొనసాగిస్తారు. కొత్తగూడెం డీఎఫ్‌వోగా ఉన్న ఎస్.శాంతారాంను నల్లగొండ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. ఖమ్మం డీఎఫ్‌వోగా ఉన్న సునీల్ ఎస్. హిరేమత్‌ను సవరించిన పరిధి మేరకు అక్కడే కొనసాగిస్తారు. భద్రాచలం డీఎఫ్‌వోగా ఉన్న శివాల రాంబాబును ఆదిలాబాద్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. కరీంనగర్ (తూర్పు) డీఎఫ్‌వోగా ఉన్న టి.రవికిరణ్‌ను జయశంకర్ జిల్లా డీఎఫ్‌వోగా బదిలీచేశారు. -
విభజన.. హైరానా!
అందరి దృష్టి జూన్ 2 పైనే - తలమునకలవుతున్న ప్రభుత్వం - ఉద్యోగుల బిల్లులు మినహా తక్కిన పనులన్నీ వాయిదా - నెలాఖరునే పదవీ విరమణ లబ్ధి - మొరాయించిన ఆన్లైన్ సర్వర్లు - జూన్ ఒకటి సహా మే నెల వేతనం బిల్లుల సమర్పణ గడువు పొడిగింపు? సాక్షి, కర్నూలు: ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతులు.. పోస్టింగ్‌లు.. కౌన్సెలింగ్‌లు.. అన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బిల్లులు మినహా మిగిలిన పనులేవీ ఇప్పుడు కాదని తేల్చి చెప్పింది. విభజన నేపథ్యంలో చక్కబెట్టాల్సిన పనులపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉద్యోగులు వారి జీతాల బిల్లులు సమర్పించేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు పొడిగించడంతో ఆదివారం కూడా ఖజానా కార్యాలయాలు పనిచేశాయి. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు 65వేల పైమాటే. పింఛన్‌దారులు 35వేల మంది ఉన్నారు. అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ తుది గడువుగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జూన్ 2న అమల్లోకి రానుండటంతో ఆ నెల 1వ తేదీకి సంబంధించి ఒక్కరోజు ఉద్యోగుల జీతం బిల్లును కూడా ముందుగానే సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుల తయారీకి ఉద్యోగులు హైరానా చెందుతున్నారు. ఇదిలాఉండగా ఐసీడీఎస్ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులతో పాటు వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధులను కూడా ఒకే పద్దు కింద డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు మూడు రోజుల్లోనే నిధులన్నీ డ్రా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన అమల్లోకి వస్తే ఆ తర్వాత నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో తెలియని నేపథ్యంలో ఐసీడీఎస్ పథకాలు నిలిచిపోకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాఖల కుదింపు ప్రస్తుతం ప్రభుత్వ శాఖల విభాగాలన్నీ కలిపి 114 ఉండగా.. వీటిని కుదించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ విభాగాలను సగం కన్నా తక్కువ సంఖ్యలో కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ డెరైక్టరేట్లోనూ ఆయా శాఖలను పర్యవేక్షించే సిబ్బందిని కుదించనున్నారు. ఈ కసరత్తును ఈనెల 24వ తేదీలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 24వ తేదీ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఖర్చును అనమతించరాదని నిర్ణయించారు. ఉద్యోగులు జీపీఎఫ్, కంటింజెంట్, జీతాల బిల్లులు, నెలాఖరుకు పదవీవిరమణ చేసే వారి గ్రాట్యూటీ, ఇతర బిల్లులను ఈ గడువులోగానే సమర్పించాల్సి ఉంది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన బిల్లులను కూడా ఈ గడువులోపే అందజేయాలని ఆదేశించారు. అందుబాటులోకి రాని సర్వర్లు విభజన ముంచుకొస్తున్న సమయంలో ఆన్లైన్ మొండికేసింది. శని, ఆదివారం సర్వర్లు మొరాయించగా.. సోమవారం ఉదయం కొంతసేపు పనిచేసినా ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. ఉద్యోగులు బిల్లులు సమర్పించేందుకు సోమవారం ఆఖరు కావడంతో గందరగోళానికి తావిచ్చింది. సర్వర్లు పని చేయని కారణంగా గడువును 23వ తేదీ వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ట్రెజరీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా విభజన కారణంగా ప్రతి శాఖలోనూ ఉద్యోగులపై ఒత్తిడి అధికమైంది.