తెలుగులోనూ ఉత్తర్వులివ్వండి | give order in Telugu too TS CS SK Joshi to officials | Sakshi
Sakshi News home page

తెలుగులోనూ ఉత్తర్వులివ్వండి

Published Thu, Feb 8 2018 3:54 AM | Last Updated on Thu, Feb 8 2018 4:36 AM

give order in Telugu too TS CS SK Joshi to officials - Sakshi

తెలంగాణ సీఎస్‌ శైలేంద్ర కుమార్‌ జోషి (ఫైల్‌ పిక్‌)

సాక్షి, హైదరాబాద్‌:  వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉత్తర్వులు, అలాగే ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన ఉత్తర్వులు ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులతో పాటు అనువాద విభాగంలోని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక, సాధారణ పరిపాలన, హోం, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, అటవీ, పౌరసరఫరాలు, ఇరిగేషన్‌ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, శాఖల మధ్య సమన్వయం, ప్రగతి సూచీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి శాఖ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని పనిచేయాలని సూచించారు.

కలసి పనిచేయండి..
రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, మార్కెటింగ్, గోడౌన్ల సామర్థ్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు పంటల సాగుపై కలసి పనిచేయాలని, సం యుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్‌ జోషి చెప్పారు. అలాగే మైక్రో, డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఎౖMð్సజ్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌ శాఖల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. టెక్స్‌టైల్‌ పార్కు, ఫార్మాసిటీ, నిమ్జ్, ఈఓడీబీ, టీఎస్‌ఐపాస్, ఫుడ్‌ ప్రాసెసింగ్, జినోం వ్యాలీ, లెదర్‌ పార్కు, ఎంఎస్‌ఎంఈ, ఫైబర్‌ నెట్‌ వర్క్, ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ తదితర అంశాలపై పురోగతిని కూడా సీఎస్‌ సమీక్షించారు. ఐటీ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రా జేశ్వర్‌ తివారి, ముఖ్య కార్యదర్శులు అధర్‌ సిన్హా, రామకృష్ణారావు, సోమేశ్‌కుమార్, రజత్‌ కుమార్, రాజీవ్‌ త్రివేది, వికాస్‌ రాజ్, జయేశ్‌ రంజన్, శాలినీ మిశ్రా, కార్యదర్శు లు సందీప్‌కుమార్‌ సుల్తానియా, శివశంకర్, పార్థసారథి, నదీమ్‌ అహ్మద్, ఆర్‌.వి.చంద్రవదన్, శ్రీలక్ష్మి, అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.కె.ఝా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సి.వి.ఆనంద్, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు అంజనీకుమార్, తేజ్‌దీప్‌ కౌర్‌ మీనన్, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ అర్విందర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement