Shailendra Kumar Joshi
-
మొక్కల్ని బతికించండి
సాక్షి,హైదరాబాద్: హరితహారంలో భాగంగా తెలంగాణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సూచించారు. నగరానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోందన్నారు. నగరంలోని గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలసి సీఎస్ ఎస్కే జోషి దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్బన్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ పార్కులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఐదో విడత హరితహారంపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ అభివృద్ధి్ద కార్పొరేషన్ ఎం.డి. రఘువీర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. హరీశ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి పేర్కొన్నారు. గురువారం తైవాన్‌లో జరిగిన తైవాన్–ఇండియా ఎక్సే్ఛంజ్– 2018 సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తోంది. తైవాన్ టెక్నాలజీ సంస్థలను మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాం’అని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రముఖ ఐటీ, లైఫ్ సైన్స్, ఏరో స్పేస్, మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మైక్రో ఇన్ఫో గ్లోబల్, స్కైరెక్ కంపెనీలు రిటైల్ వ్యాపార అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మైక్రో ఇన్ఫో గ్లోబల్‌తో స్కైరెక్ ఒప్పందం రిటైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రానికి చెందిన మైక్రో ఇన్ఫో గ్లోబల్ సంస్థతో తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్.కె.జోషి సమక్షంలో మైక్రో ఇన్ఫో సంస్థ చైర్మన్ అప్పిరెడ్డి, స్కైరెక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాన్సన్ వూ సంతకాలు చేశారు. -
తెలుగులోనూ ఉత్తర్వులివ్వండి
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉత్తర్వులు, అలాగే ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన ఉత్తర్వులు ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులతో పాటు అనువాద విభాగంలోని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక, సాధారణ పరిపాలన, హోం, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, అటవీ, పౌరసరఫరాలు, ఇరిగేషన్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, శాఖల మధ్య సమన్వయం, ప్రగతి సూచీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి శాఖ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని పనిచేయాలని సూచించారు. కలసి పనిచేయండి.. రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, మార్కెటింగ్, గోడౌన్ల సామర్థ్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు పంటల సాగుపై కలసి పనిచేయాలని, సం యుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ జోషి చెప్పారు. అలాగే మైక్రో, డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఎౖMð్సజ్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ శాఖల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. టెక్స్టైల్ పార్కు, ఫార్మాసిటీ, నిమ్జ్, ఈఓడీబీ, టీఎస్ఐపాస్, ఫుడ్ ప్రాసెసింగ్, జినోం వ్యాలీ, లెదర్ పార్కు, ఎంఎస్ఎంఈ, ఫైబర్ నెట్ వర్క్, ఈ–ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలపై పురోగతిని కూడా సీఎస్ సమీక్షించారు. ఐటీ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రా జేశ్వర్ తివారి, ముఖ్య కార్యదర్శులు అధర్ సిన్హా, రామకృష్ణారావు, సోమేశ్‌కుమార్, రజత్ కుమార్, రాజీవ్ త్రివేది, వికాస్ రాజ్, జయేశ్ రంజన్, శాలినీ మిశ్రా, కార్యదర్శు లు సందీప్‌కుమార్ సుల్తానియా, శివశంకర్, పార్థసారథి, నదీమ్ అహ్మద్, ఆర్.వి.చంద్రవదన్, శ్రీలక్ష్మి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అంజనీకుమార్, తేజ్‌దీప్ కౌర్ మీనన్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. సికింద్రాబాద్‌లోనే ‘రైల్వే’శిక్షణ 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఎనిమిది నెలలపాటు రైల్వేలో పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. అప్పట్నుంచే తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉంది. జోషి సివిల్ సర్వీసెస్ అధికారిగా మొదట నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐటీ, నీటిపారుదల, ఇంధన శాఖ, రెవెన్యూ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచీ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండు దఫాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. మధ్యాహ్నమే బాధ్యతలు కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి బుధవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం చంద్ర గ్రహణం మొదలవటంతో అంతకుముందే 3 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సమత బ్లాక్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ తన బాధ్యతలను జోషికి అప్పగించారు. ఈ సందర్భంగా జోషి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు జోషికి అభినందనలు తెలిపారు. సీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మంచి పేరు తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ జోషి అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నీటి పారుదల శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సైతం ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ అధీనంలో ఉన్న సీసీఎల్ఏ అదనపు బాధ్యతలను రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అప్పగించారు. సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు జీవితాశయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే తన స్వప్నమని కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీక రించిన శైలేంద్రకుమార్ జోషి పేర్కొన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రజలకు అంకితం చేయాలని ఉందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ద్వారా, ప్రత్యేకించి పాలమూరు ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీరందడం వృత్తిపరంగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పకడ్బందీగా అమలు చేయటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు ఈ అవకాశమిచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి సామర్థ్యాల మేరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు పునరంకితమవుతానని చెప్పారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. రాష్ట్రానికి మంచి పేరుంది. అధికారులు, ఉద్యోగులందరం కలిసికట్టుగా, ఒక జట్టుగా పని చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలన్నీ కాలవ్యవధి నిర్ణయించుకొని పూర్తి చేస్తాం. జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా శరవేగంగా పనులు చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తాం. గత మూడేళ్లలో పలు రంగాల్లో తెలంగాణ శరవేగంగా ప్రగతి సాధించింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్త నుంచి ఇప్పటిదాకా పని చేసిన అధికారులంతా అద్భుతమైన సేవలందించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాను’’అని చెప్పారు. తనకు రెండేళ్ల పదవీకాలం ఉందని, అందరినీ కలుపుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా పని చేస్తానన్నారు. సంతృప్తిగా పని చేశా: ఎస్పీ సింగ్ కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణ అనంతరం పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీడ్కోలు పలికారు, 13 నెలల పాటు చేసిన ఆయన సేవలను, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వాళ్లు. ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరిచిపోలేనిది. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు’’అని అన్నారు. తనకు ఏ వర్గాలూ లేవని, అందరితో టీం వర్క్ చేశానన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు పనులు తన నేతృ త్వంలో పూర్తవడం, మిషన్ భగీరథ పనులు 95%పూర్తవడం అత్యంత సంతోషాన్నిచ్చాయని చెప్పారు. తనకు గ్రూపులు, శత్రువులు లేరన్నారు. అధర్‌సిన్హా, అజయ్ మిశ్రా, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, రాజీవ్ త్రివేది, సురేష్ చందా, పీకే ఝా, హర్‌ప్రీత్ సింగ్, కళ్యాణ్ చక్రవర్తి, సీవీ ఆనంద్, బి.జనార్దన్‌రెడ్డి, అనితా రాజేంద్ర, శ్రీ లక్ష్మి, నవీన్ మిట్టల్ తదితర ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ నూతన సీఎస్‌గా ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) పదవీకాలం నేటితో ముగియనుంది. ఎస్పీ సింగ్ పదవీకాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో నూతన సీఎస్ నియామకం అనివార్యమైంది. 984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శైలేంద్ర కుమార్ జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ఆయన స్వస్థలం. ఢిల్లీ ఐఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం సివిల్స్ ర్యాంకు సాధించారు. రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్‌ల తర్వాత తెలంగాణకు నాలుగో సీఎస్ ఎస్కే జోషి. సీఎస్ నియామక ఉత్తర్వులు