కొత్త సీఎస్ ఎస్‌కే జోషిని అభినందిస్తున్న మాజీ సీఎస్ ఎస్పీ సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు.
సికింద్రాబాద్‌లోనే ‘రైల్వే’శిక్షణ
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఎనిమిది నెలలపాటు రైల్వేలో పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. అప్పట్నుంచే తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉంది. జోషి సివిల్ సర్వీసెస్ అధికారిగా మొదట నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు.
తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐటీ, నీటిపారుదల, ఇంధన శాఖ, రెవెన్యూ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచీ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండు దఫాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు.
మధ్యాహ్నమే బాధ్యతలు
కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి బుధవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం చంద్ర గ్రహణం మొదలవటంతో అంతకుముందే 3 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సమత బ్లాక్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ తన బాధ్యతలను జోషికి అప్పగించారు. ఈ సందర్భంగా జోషి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు జోషికి అభినందనలు తెలిపారు. సీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పాత సీఎస్ ఎస్‌పీ సింగ్‌కు వీడ్కోలు పలికారు.
ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మంచి పేరు
తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ జోషి అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నీటి పారుదల శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సైతం ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ అధీనంలో ఉన్న సీసీఎల్‌ఏ అదనపు బాధ్యతలను రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అప్పగించారు. సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment