Orders issued
-
10 శాతం మించడానికి వీల్లేదు
ముంబై: ఆరోగ్య బీమా రంగ కంపెనీలు ఇకపై సీనియర్ సిటిజన్ల వార్షిక ప్రీమియంలో పెంపుదలను 10 శాతంలోపునకే పరిమితం చేయవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. తక్కువ ఆదాయ వనరులతో జీవించే సీనియర్ సిటిజన్లకు దీంతో ఉపశమనం లభించనుంది. వయసురీత్యా పలు కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వయసురీత్యా ఆరోగ్య పరిరక్షణ మరింత అవసరమయ్యే వీరికి పెరుగుతున్న బీమా ప్రీమియంలు ఆర్థికంగా భారమవుతున్న సంగతి తెలిసిందే. -
కారుణ్య మరణానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి బెంగళూరు: తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించక, వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం కర్ణాటకలో ఈ చారిత్రక చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. మొండి వ్యాధి బాధితులు, మరణాంతక రోగగ్రస్తులు లేదా కోమా స్థితిలో ఉన్న వారికి, ఎలాంటి చికిత్స అందించినా బతకడం అసాధ్యం అనే వారికి ఈ ఆదేశాల ద్వారా గౌరవప్రదమైన మరణానికి అవకాశం లభించింది. కారుణ్య మరణానికి అవకాశం కల్పించేందుకు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్యులు కారుణ్య మరణానికి ఆ రోగి అర్హుడా కాదా అనే విషయాన్ని ధ్రువీకరిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా వైద్య నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ తొలుత సంబంధిత రోగి ఎలాంటి చికిత్స అందించినా ఫలితం ఉండబోదని ధ్రువీకరించిన తర్వాతే కారుణ్య మరణానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఆ రోగి కుటుంబ సభ్యుల వినతి మేరకు మాత్రమే వైద్యుల బృందం ఈ పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతించాక రోగి లైఫ్ సపోర్టు సిస్టమ్‌ను తొలగిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. -
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు! అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు! నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి. సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్‌కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
ఢిల్లీ ఎల్జీకి ఫుల్ పవర్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు, కమిషన్, అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలనైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది. అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులను కూడా ఇకపై ఎల్జీయే నియమించవచ్చు. ఈ మేరకు ఆర్టికల్ 239, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం–1991 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి వద్ద ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ప్రతిష్టాత్మకమైన అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మోదీ సర్కారు ఈ చర్యకు దిగడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి పదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండటం తెలిసిందే. ఢిల్లీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు తరచూ కోర్టుల దాకా వెళ్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు ఆప్‌కు అనుకూలంగా వచ్చినా చట్ట సవరణల ద్వారా కేంద్రం వాటిని పూర్వపక్షం చేస్తూ వస్తోంది. -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి! 978 మంది భారతీయులు వెనక్కు బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్‌లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.ఇదీ సమస్య... 1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది. -
ఐబీ చీఫ్ డేకా పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2025 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని సోమవారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీన ముగియనున్న డేకా పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు కేబినెట్ నియామ కాల కమిటీ ఆమోదించిందని వెల్లడించింది. 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన డేకా 1998లో ఐబీలో చేరారు. 2022 జూలై ఒకటో తేదీన ఆయన ఐబీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా, జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సెక్రటరీ జనరల్ భరత్ లాల్ పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచి్చంది. -
అమృత్‌పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
రాజ్‌భవన్ ఆవరణను తక్షణమే ఖాళీ చేయండి
కోల్‌కతా: రాజ్‌భవన్ వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కోల్‌కతా పోలీసు సిబ్బంది తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ నార్త్‌గేట్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టును ప్రజావేదికగా మార్చాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్, మమతా బెనర్జీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామమే దీనికి కారణమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచి్చన సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ నేతల బృందాన్ని రాజ్‌భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ బీజేపీ నేతలను వెనక్కి పంపించి వేశారు. గవర్నర్ రాతపూర్వకంగా అనుమతి ఇచి్చనప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించడం వివాదస్పదమైంది. దీనిపై సువేందు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం.. గవర్నర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
Lok Sabha elections 2024: సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్‌సభ స్థానం పరిధిలోని మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది. వారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయొచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో ఈ నిబంధనను విధిగా పాటించాలని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను సొంత జిల్లాల్లో కొనసాగించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కొనసాగించవద్దంటూ ఆదేశాలిచి్చంది. -
నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ గురువారం నుంచి ఆరంభం కానుంది. కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరికొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దృష్ట్యా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభుత్వం రేషనలైజేషన్ ఉద్యోగుల సర్దుబాటుకు పూనుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయగా.. జిల్లాలో సర్దుబాటు ప్రక్రియకు సంబంధి«ంచిన తేదీల వారీగా షెడ్యూల్‌ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ ధ్యాన్‌చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు ఇలా.. ♦ గురువారం (22వ తేదీ)కల్లా జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు.. 8 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందిస్తారు. ♦ ఈ నెల 24వ తేదీకల్లా 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగి రి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు. ♦ ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పనిచేసే అవకాశం ఉన్నంతవరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు. ♦ సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి, సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపడతారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వా ర్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సర్దుబాటు ప్రక్రియలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు స్థానచలనం కలిగే పరిస్థితి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ♦ మరోవైపు సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే.. ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయా ల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పిస్తారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగానూ, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవ కాశం కల్పించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
క్రెడిట్ కార్డు.. కొంచెం కష్టమే!
ముంబై: క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణ మంజూరీల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఇకపై మరింత కఠినతరం కానున్నాయి. ఈ విషయమై బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ తాజా ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. అటువంటి క్రెడిట్ మరింత ఖరీదైనదిగా మారడంతో ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. తాజా నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరుగుతుంది. కాగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించవని రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ రుణ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. -
హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడింది. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా పని చేసిన వీరవల్లి సుందరం (వీఎస్) సంపత్ హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) లావు నాగేశ్వరరావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ మొత్తం వీఎస్ సంపత్ నేతృత్వంలోనే జరుగుతుంది. -
బిహార్‌లో కుల గణనపై స్టే
పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణనకు ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఈ సర్వేని నిలిపివేయాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సేకరించిన డేటాని తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ పిటిషన్‌దారులు డేటా సమగ్రత, భద్రతపై వెలిబుచ్చిన ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదంటూ పిటిషన్‌దారులు పేర్కొనడాన్ని కూడా ప్రస్తావించింది. కులాల గణాంకాలు ఇతరుల చేతుల్లో పడితే దాని వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. నితీశ్ ప్రభుత్వం జనవరి 7 నుంచి 21 వరకు తొలి విడత కులగణన నిర్వహించింది. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మే 15వరకు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఇది కులగణన కాదని, ఆర్థికంగా వెనుకబడిన వారు ఏయే కులాల్లో ఉన్నారో తెలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్న ఉద్దేశంతోనే దీనిని చేపట్టినట్టుగా వాదిస్తోంది. -
‘దహీ’పై వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
చెన్నై/బెంగళూరు: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్ ‘కర్డ్’కు బదులుగా హిందీలోని ‘దహీ’ముద్రించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కి తగ్గింది. కర్డ్‌ను కొనసాగిస్తూనే పక్కనే సమానార్థం.. తెలుగులో అయితే పెరుగు, కన్నడలో మొసరు, తమిళమైతే తాయిర్ అని ప్రాంతీయ భాషను ముద్రించవచ్చని స్పష్టతనిస్తూ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులుగా హిందీ సమానార్ధం ‘దహీ’ని ముద్రించాలంటూ ఈ నెల 10వ తేదీన ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తమిళనాడు కో ఆపరేటివ్ మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ ‘ఆవిన్’బ్రాండ్‌తో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) నంది బ్రాండ్‌తో పెరుగును విక్రయిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎప్పటిలాగానే తమిళ ‘తాయిర్’నే వాడుతామని, ‘దహీ’అని మాత్రం వాడబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐకి సమాధానమిచ్చింది. అధికార డీఎంకే పార్టీ ‘నహీ టు దహీ’అంటూ ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘దహీ’వివాదంపై తమిళనాడు బీజేపీ విభాగం అభ్యంతరం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్‌తో తీసుకువస్తున్న పెరుగు ప్యాకెట్లపై హిందీ దహీ పక్కన బ్రాకెట్లలో కన్నడ (మొసరు) ముద్రించాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన మార్గదర్శకాలపై రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఈ చర్య కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనన్నారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. -
Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్ అరెస్టయితే అంతర్యుద్ధమా?
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తోషఖానా కేసులో తనపైనున్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఇమ్రాన్ తనంతట తాను లొంగకపోతే మార్చి 18లోగా అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సెషన్స్ న్యాయమూర్తి జఫర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేయాలని ఆదేశించామని మళ్లీ వారెంట్ల రద్దు పిటిషన్ ఎందుకు వేశారని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. దీంతో ఇమ్రాన్ ఎదుట ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాడు ఆయన అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి 10 రోజుల క్రితం పోలీసులు ప్రయత్నించినప్పట్నుంచి పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. పోలీసులు ఇమ్రాన్ నివాసానికి వెళ్లిన ప్రతీసారి ఆయన ఇంట్లో లేకపోవడం, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది. ఏమిటీ తోషఖానా కేసు..? తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. 1974లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వ అధికారులకొచ్చే కానుకల్ని ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిని చేపట్టాక తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. అంతేకాదు తనకు వచ్చిన కానుకల్ని ఎంతో కొంత ధర ఇచ్చి తోషఖానా నుంచి తీసుకొని వాటిని తిరిగి అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా 101 కానుకలు వచ్చాయి. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వాటికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ముకున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు లేదు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ అయిన రెండు నెలల తర్వాత పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఆ కానుకల్ని అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎంతో కొంత ధర చెల్లించి ఆయన ఆ కానుకల్ని తన సొంతం చేసుకున్నారని చెప్పింది. అయితే ఆయన అనైతికంగా ఈ పని చేస్తూ తప్పు దారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది. 37 కేసులు ఇమ్రాన్‌ఖాన్‌పై తోషఖానాతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 37 కేసులు నమోదయ్యాయి. ► పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) ప్రధాన ఎన్నికల అధికారి సికందర్ సుల్తాన్ రజాకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌తో పాటు పీటీఐ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఒక కేసు నమోదైంది ► ఎన్నికల కమిషన్ అయిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అనర్హత వేటు వేసినప్పుడు ఈసీపీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించడంపై కేసు దాఖలైంది ► పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్ఛ్ంజ్ యాక్ట్ నియమాలను ఉల్లంఘిస్తూ విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలపై కేసు ► పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు కేసు ► పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత మొహ్సిన్ షానావజా రంజా ఇమ్రాన్ ఆదేశాల మేరకే తనను పోలీసులు కొట్టి చంపడానికి వచ్చారంటూ హత్యా యత్నం కేసు పెట్టారు అరెస్టయితే అంతర్యుద్ధం తప్పదా..? ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయితే పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్ అయితే ఏం చెయ్యాలన్న దానిపైనా ఇమ్రాన్ పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. దానిని సరైన సమయంలో బయటపెడతానని ఆయన చెబుతున్నారు. తమ నేతపై చెయ్యి వేస్తే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆత్మాహుతి దాడులకి దిగుతామని ఇప్పటికే పార్టీ నాయకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి పీటీఐ కార్యకర్తల సవాల్ ఎదుర్కోవడం కూడా క్లిష్టంగా మారింది. మరోవైపు పంజాబ్ ర్యాలీలో ఇమ్రాన్‌పై దాడి జరిగిన దగ్గర్నుంచి ఆయనను హత్య చేస్తారన్న ఆందోళనలూ ఉన్నాయి. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇప్పటివరకు కోర్టు ఎదుట కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పెద్దలే తనను హత్య చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఇమ్రాన్ తనకు అనుమానం ఉన్న వారందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తనని జైలుకు పంపినా, చంపేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపవద్దంటూ అనుచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, గణపవరం/ భీమవరం(పశ్చిమ గోదావరి): గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గణపవరం మండలాన్ని ఏలూరు రెవెన్యూ డివిజన్ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ పేరుమీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే 30 రోజుల్లోపు కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ఈ ఏడాది మే నెలలో గణపవరంలో జరిగిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతామని సభాముఖంగా ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 20 మండలాలతో జిల్లా జిల్లాల పునర్విభజనతో పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమలో విలీనం చేయడంతో మండలాల సంఖ్య 20కి చేరనుంది. అలాగే 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత్ విద్యుత్ పథకంలో అక్రమాలు జరిగాయని, ఇందులో లోపాలున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించాయి. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ న్యాయవాద వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నాయి. ఉచిత విద్యుత్‌ను అడ్డుకొనే కుట్ర: కేజ్రీవాల్ తాము ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం పట్ల గుజరాత్ ప్రజలు ఆకర్శితులు అవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే ఢిల్లీలో ఉచిత్ విద్యుత్‌కు అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుజరాత్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ప్రజల రక్తం పీల్చేస్తోందని, వారికి కొంత ఊరటనివ్వాలని తాము సంకల్పిస్తే బీజేపీ సహించలేకపోతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సర్కారు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. -
గిరిజనులకు 10% కోటా.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం హామీ నేపథ్యంలో.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ‘గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా వారం రోజుల్లో జీవో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ..మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటావా ఆలోచించుకో..’ అని ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఏడేళ్లు గడిచినా రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడాన్ని ఈ సభలో సీఎం కేసీఆర్ తీవ్ర స్థా యిలో తప్పుబట్టా రు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో జారీ చేసుకుంటా మన్నారు. సీఎం హామీ ఇచ్చి వారం రోజులు గడిచిన నేపథ్యంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన త ర్వాత రాష్ట్ర ప్రభు త్వం ఆఘమేఘాల మీద రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసింది. తమిళనాడులో 28 ఏళ్లుగా 69 శాతం రిజర్వేషన్లు అమలవుతుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిపదికగా జీవోలో చూపింది. 66 నుంచి 70 శాతానికి రిజర్వేషన్లు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మొత్తం రిజర్వేషన్లు 70 శాతానికి పెరిగాయి. అగ్రకుల పేదల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ గతేడాది మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 65 జారీ చేయడంతో అప్పట్లో మొత్తం రిజర్వేషన్ల శాతం 66 శాతానికి పెరిగింది. తాజాగా ఎస్టీ కోటాను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో 70 శాతానికి చేరింది. -
వారికి గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. చదవండి: ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా? -
ఎన్ఐఏ చీఫ్‌గా దినకర్ గుప్తా
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ దినకర్ గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుప్తా నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఐఏ చీఫ్‌గా ఆయన 2024 మార్చి 31 దాకా కొనసాగుతారు. సంస్థకు ఏడాది తర్వాత రెగ్యులర్ చీఫ్ నియామకం జరిగింది. గతేడాది మేలో వై.సీ.మోదీ రిటైరయ్యాక సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్‌కు అదనపు బాధ్యతలిచ్చారు. -
AP: సమయానికి రాకపోతే ‘సెలవే’
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమ యంలోగా కార్యాలయానికి రావాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్–19 తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్ల సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ పని దినాల్లో ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి రావాలని, సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా రాని అధికారులకు, ఉద్యోగులకు ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. ఆయన ఆదేశాలు ఇవీ.. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ►ఉదయం 10 నుంచి 10.10 గంటల్లోపు తప్పనిసరిగా విధులకు హాజరవడం తోపాటు పనిచేయడం ప్రారంభించాలి ►ఉదయం 10.10 నుంచి 11 గంటల్లోపు ఆలస్యంగా హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అనుమతి. ►ఒక పూట హాజరును ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిగణిస్తారు ►ఉదయం 11 గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం 1 గంటలోపే వెళ్లిపోయినా లేదా నిర్ణీత సమయంలోగా వచ్చి మధ్యా హ్నం 1 గంటకన్నా ముందే వెళ్లిపోయినా ఒక పూట సెలవుగా పరిగణిస్తారు ►మధ్యాహ్నం 1 గంట తరువాత హాజరైతే ఆ రోజు సెలవుగా లేదా గైర్హాజరుగా పరిగణిస్తారు ►ఉదయం 10 గంటలకు హాజరై సాయంత్రం 5.30 తరువాత కార్యాలయం నుంచి వెళ్తే పూర్తి రోజు హాజరైనట్లు ►ఉద్యోగులు ముందుగా అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంవల్ల పని వాతావరణం దెబ్బతింటోంది. ఇక నుంచి సెలవుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా సెలవు పెడితే అనధికార గైర్హాజరుగా పరిగణిస్తారు. ఒక పూట సెలవు కోసం ముందస్తు సమాచారం ఇవ్వాలి. ►అధికారులు, ఉద్యోగులందరూ పనివేళ లను కచ్చితంగా పాటించాలి. క్రమశిక్షణను, పని వాతావరణాన్ని నెలకొల్పాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రావత్ స్పష్టం చేశారు. ►కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత అన్న మాటకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీగా నియామకాలు చేపట్టిన, చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ వైద్య విధాన పరిషత్‌లో మరో 2,588 పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ పోస్టులు సృష్టించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: AP: 'దారి'కొస్తున్నాయి.. ఒక్క ఏడాదిలో రూ.2,205 కోట్లు కొత్తగా సృష్టించిన పోస్టుల్లో 485 డాక్టర్, 60 నర్సింగ్, 78 ఫార్మసీ, 644 పారామెడికల్ క్లాస్–4, 279 ల్యాబ్ టెక్నీషియన్, పోస్ట్‌మార్టమ్ సహాయకుల పోస్టులు 39, ఆసుపత్రి పరిపాలన విభాగానికి సంబంధించి 54 పోస్టులు ఉండగా, ఇతరత్రా పోస్టులు 949 ఉన్నాయి. వీటిలో పలు పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్సోరి్సం గ్ విధానంలో, మరికొన్ని పోస్టులను పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైద్య, ఆరోగ్య శాఖలో 39 వేల పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టుల భర్తీ పూర్తవగా మిగిలిన పోస్టుల భర్తీ ఈ నెలాఖరుతో పూర్తికానుంది. ఇదే తరుణంలో మరో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వడం ప్రజారోగ్యానికి ప్రభుత్వం వేస్తున్న పెద్దపీటకు అద్దం పడుతోంది. -
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం
న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్ రాబోతోంది. అదే యోగా బ్రేక్.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ వై–బ్రేక్ యాప్ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్ సమయంలో వై–బ్రేక్ యాప్‌లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ యాప్‌లో ఏముంది ? పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్‌ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్ యాప్‌ని ప్రారంభించింది. -
వైజాగ్ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం(గాజువాక): వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్ (పర్సనల్) కె.సి.దాస్ ఇన్చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మహంతి ఇన్చార్జ్ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆదేశాలు అందుకున్న నూతన సీఎండీ అతుల్ భట్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. -
వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల జప్తు!
ముంబై: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల స్తంభన, జప్తునకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల ప్రమోటర్లు తమ ఆస్తుల తనఖా, వేలం, అమ్మకంసహా వాటిపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. కీలక ఆదేశాల్లో అంశాలను పరిశీలిస్తే... ► సీడీఎస్ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌లకు..: వీడియోకాన్ ప్రమోటర్లకు ఏదైనా కంపెనీ లేదా సొసైటీలో ఉన్న షేర్లను స్తంభింపజేయలని, ఎటువంటి అమ్మకం, బదలాయింపునైనా నిషేధించాలని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లను ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఆలాగే ఆయా వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు తెలియజేయాలని కూడా సూచించింది. ► సీబీడీటీకి..: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తులకు సంబంధించి తెలిసిన వివరాలను వెల్లడించాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)ను కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రమోటర్ల బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను వెల్లడించాలని, తక్షణం ఆయా అకౌంట్లను లాకర్లను స్తంభింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆదేశాలు ఇచ్చింది. ► పీఎంసీఏకు సూచనలు: వీడియోకాన్ ప్రమోటర్లకు ఉన్న చరాస్తుల వివరాలను గుర్తించి తెలియజేయలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖలు రాయడానికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కేసు వివరాలు ఇవీ... కంపెనీలోఆర్థిక అవకతవకలు, కుంభకోణాల విషయంలో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఎండీ వేణుగోపాల్ ధూత్, ఇతర మాజీ డైరెక్టర్లు, సీనియర్ అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోడానికి, అక్రమ సంపాదన రికవరీకి తగిన అనుమతులు ఇవ్వాలంటూ కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వీడియోకాన్ లిమిటెడ్‌లో మిగులు, నిల్వలు మొత్తంగా రూ.10,028.09 కోట్లని 2014 ఫైనాన్షియల్ రిపోర్ట్ పేర్కొంది. కేవలం ఐదేళ్ల కాలంలో (2018–19 నాటికి) కంపెనీ రూ.2,972.73 కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోవడంపై భాస్కర పంతుల్ మహన్, నారిన్ కుమార్ భోలాలతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కంపెనీరుణాలు రూ.20,149.23 కోట్ల నుంచి రూ.28,586.87 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం. ‘‘మునిగిపోతున్న నౌకకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ భారీగా రుణాలను మంజూరు చేయడం, అదే సంస్థ దివాలా కోడ్ సెక్షన్ 7 కింద పిటిషన్ దాఖలు చేయడం అశ్చర్యంగా ఉంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆయా అంశాలన్నింటిపై సమగ్రంగా విచారించాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర మోసపూరితమైన కేసులను విచారించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు కూడా తన ఉత్తర్వు ప్రతిని అందించాలని ఆదేశించింది. -
మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భాల్లో న్యాయమూర్తులు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనచేసింది. ధర్మాసనాల అభిప్రాయాలు కేవలం తీర్పులు, ఉత్తర్వుల ద్వారా వ్యక్తంకావాలని, అప్పుడే జ్యుడీషియల్ రికార్డుల్లో ఆ అభిప్రాయాలు నమోదవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. మౌఖిక ఆదేశాలు లెక్కలు మిక్కిలి పెరిగితే న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంలోని మూలసూత్రాన్ని కోల్పోతామని, ఇలాంటి పద్ధతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. చీటింగ్, నమ్మకద్రోహం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ గుజరాత్‌కు చెందిన సలీమ్‌భాయ్ హమీద్‌భాయ్ మీనన్ గుజరాత్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకూడదంటూ గుజరాత్ హైకోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీం బెంచ్ ఈ సూచనలు చేసింది. ‘రాతపూర్వక ఆదేశాలు మాత్రమే కార్యశీలకమైనవి. అరెస్ట్ చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు జ్యుడీషియల్ రికార్డులో భాగం కాబోవు. ఈ పద్ధతిని త్యజించండి. ధర్మాసనం తమ అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి. మౌఖిక ఆదేశాలపై న్యాయవ్యవస్థలో విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మౌఖిక ఆదేశాలతో అరెస్ట్‌ను అడ్డుకోవడం సక్రమ పద్ధతికాదని జడ్జీలు అన్నారు. ‘కేసులోని ఇరు పక్షాలు కోర్టు బయట సెటిల్ చేసుకునే అవకాశం కల్పించేందుకు నిందితుడి తరఫు లాయర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అరెస్ట్ నుంచి నిందితుడికి తాత్కాలిక రక్షణగా ఆ ఆదేశాలు ఉపయోగపడాలంటే జడ్జీలు ఉత్తర్వులు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు నుంచి సంబంధిత ఉత్వర్వు అందకుంటే అరెస్ట్‌ను పోలీసు అధికారి సైతం ఆపలేడు. అయినా, తీర్పు అనేది నిందితులు, బాధితుల వ్యక్తిగత విషయం కాదు. దేశంలో శాంతిభద్రతలతో ముడిపడిన అంశం. ఎవరి నడతపైనైనా అభిప్రాయాలు వ్యక్తంచేసే జడ్జీలు, ప్రభుత్వాధికారులు తమ నడవడికనూ ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆశారాంకు జైల్లోనే చికిత్స లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపూకి జైల్లోనే ఆయుర్వేద చికిత్స అందిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం రెండు నెలలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అతను చేసిన నేరం సాధారణమైనది కాదని, శిక్షను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆశారాం బాపూకి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం దృష్టికి తెచ్చింది. దీనిపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీం బెంచ్ స్పందించింది. ‘‘ఆశారాం బాపూ చేసిన నేరం సాధారణమైనది కాదు. జైల్లోనే మీకు కావల్సిన చికిత్స లభిస్తుంది. అంతేకానీ శిక్షను కొంతకాలమైనా సస్సెండ్ చేయడం కుదరదు’’ అని చెప్పింది. ఆశారాం బాపూ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంత్ వాదిస్తూ అనారోగ్య సమస్యలన్నింటీకి సంపూర్ణమైన చికిత్స అందించడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ అందుకు సుప్రీం నిరాకరించింది. -
బీఎస్ఎఫ్ డీజీగా పంకజ్ కుమార్
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీ విధులతో పాటు ఐటీబీపీ డీజీగా పని చేస్తున్న ఎస్ఎస్ దేశ్వాల్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం పంకజ్ కుమార్ బాధ్యతలు చేపడతారని కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వెంట 6,300 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను బీఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. బీఎస్ఎఫ్లో సుమారు 2.65 లక్షల మంది సైనికులు ఉన్నారు. పంకజ్ కుమార్ తండ్రి ప్రకాశ్ సింగ్ కూడా ఐపీఎస్ ఆఫీసరే కావడం గమనార్హం. ఆయన కూడా గతంలో బీఎస్ఎఫ్ డీజీగా పని చేశారు. పంకజ్‌తో పాటు తమిళనాడు కేడర్‌కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ సంజయ్ ఆరోరాను ఐటీబీపీ డీజీగానూ, ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన బాలాజీ శ్రీవాస్తవ్‌ను బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)గా నియమించింది. -
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ (అగ్రవర్ణ పేదల) రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ కోటా కింద రిజర్వేషన్ పొందడంలో.. ఆదాయ ధ్రువీకరణ పత్రమే కీలకంగా ఉండనుంది. ఆయా అభ్యర్థులు/విద్యార్థులు అందజేసిన అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాక నిబంధనలకు అనుగుణంగా తహసీల్దార్లు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారంఉత్తర్వులు జారీ చేశారు. ఎవరెవరు అర్హులు? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకురాని వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అర్హులు. వీరి కుటుంబ స్థూల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. వేతనం, వ్యవసాయం, వృత్తి, వ్యాపారం తదితర అన్నిమార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరే వ్యక్తితోపాటు వారి తల్లిదండ్రులు, 18ఏళ్లలోపు ఉన్న తోబుట్టువులు, జీవిత భాగస్వామి, 18ఏళ్లలోపు వయసున్న సంతానాన్ని కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటారు. తోబుట్టువులు, సంతానం 18 ఏళ్లపైన వయసున్న వారైతే.. వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష, ఇతర ఫీజుల మినహాయింపులు సమానంగా వర్తిస్తాయి. బ్యాక్లాగ్ నియామకాలకు నో.. ఏదైనా నియామక సంవత్సరం (రిక్రూట్మెంట్ ఇయర్)లో సరైన అర్హుల్లేక ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులు భర్తీ కాకుంటే.. ఆ పోస్టులను తర్వాతి నియామక సంవత్సరానికి బ్యాక్లాగ్ పోస్టుగా బదిలీ (క్యారీ ఫార్వర్డ్) చేయకూడదు. వికలాంగులు/ఎక్స్‌సర్వీ స్‌మెన్ కోటా కింద ఈడబ్ల్యూఎస్‌కు చెందిన వ్యక్తులెవరైనా ఎంపికైతే.. వారికి ఈడబ్ల్యూఎస్ రోస్టర్ వర్తింపజేయాలి. అన్రిజర్వ్డ్ పోస్టులకు పోటీపడే హక్కును ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిరాకరించరాదు. ఈడబ్ల్యూఎస్ వ్యక్తులు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెరిట్ ఆధారంగా (అన్రిజర్వ్డ్, ఓపెన్ కోటాల కింద) ఎంపికైతే.. వారి ఎంపికను ఈడబ్ల్యూఎస్ కోటా కింద లెక్కించరాదు. ఈడబ్ల్యూఎస్ కోటాలో అంతర్గతంగా మహిళలకు 33 1/3 శాతం కోటా అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేశారు. ప్రతి 100 ఖాళీల భర్తీలో.. 9, 17 (మహిళలు), 28, 36, 50 (మహిళలు), 57, 65 (మహిళలు), 76, 86, 100 స్థానాల్లో వీటిని కేటాయిస్తారు. తప్పుడు మార్గాల్లో అనర్హులు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అనర్హులు ఎంపికైతే సర్వీసు నుంచి తొలగించాలి. ఇకపై జరిపే అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులను చేర్చుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఉన్నత విద్యాసంస్థ కూడా వివిధ కోర్సులు/ బ్రాంచీ/ ఫ్యాకల్టీలో సీట్ల సంఖ్యను పెంచాలి. ‘ఆదాయ’ ధ్రువీకరణ తర్వాతే ఉద్యోగం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైనా ఉద్యోగానికి ఎంపికైనా.. వారి ‘ఆదాయ ధ్రువీకరణ పత్రం’ తనిఖీ ప్రక్రియను సంబంధిత వర్గాలు పూర్తిచేసే వరకు ఆ నియామకం తాత్కాలికమే. అక్రమంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందినట్టు గుర్తిస్తే వెంటనే ఎలాంటి కారణాలు తెలపకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఈ విషయాలను అభ్యర్థులకు జారీచేసే నియామక ఉత్తర్వుల్లో పొందుపర్చాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అభ్యర్థి సమర్పించిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేసిన అధికారి ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు. చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి -
విమాన చార్జీలకు రెక్కలు
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులను 9.83 శాతం – 12.82 శాతం మేర పెంచుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 40 నిమిషాల లోపు వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి రూ. 2,600 నుంచి రూ. 2,900కి (11.53 శాతం) పెంచింది. అలాగే గరిష్ట పరిమితిని 12.82 శాతం పెంచడంతో ఇది రూ. 8,800కి చేరింది. అలాగే 60–90 నిమిషాల వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి 12.5 శాతం పెరిగి రూ. 4,500కి, గరిష్ట చార్జీ 12.82 శాతం మేర పెరిగి రూ. 13,200కి చేరినట్లవుతుంది. మొత్తం మీద ఇకపై 90–120, 120–150, 150–180, 180–210 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉండే దేశీ ఫ్లయిట్ల కనిష్ట చార్జీల పరిమితి వరుసగా రూ. 5,300, రూ. 6,700, రూ. 8,300, రూ. 9,800గాను ఉంటుంది. కరోనా వైరస్ కట్టడి కోసం గతేడాది రెండు నెలల పాటు విధించిన లాక్డౌన్ ఎత్తివేశాక మే 25 నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సంక్షోభం లో ఉన్న ఎయిర్‌లైన్స్‌ని గట్టెక్కించే ఉద్దేశంతో ప్రభుత్వం కనిష్ట చార్జీలపైన, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు గరిష్ట చార్జీలపైనా కేంద్రం పరిమితులు విధించింది. -
వరంగల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు జిల్లాల సరిహద్దులతోపాటు వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ప్రభావం ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై, పాలకవర్గాలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల పాలక వర్గాలు కొనసాగుతాయని, పాత జిల్లాల ప్రాతిపదికనే వీటి అధికార పరిధి అమల్లో ఉంటుందని తెలిపింది. హన్మకొండ జిల్లా స్వరూపం... వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ రెవెన్యూ డివిజన్లోని హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వెలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వరంగల్ రూరల్ జిల్లా.. పరకాల రెవెన్యూ డివిజన్లోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలతో కొత్తగా హన్మకొండ జిల్లా ఏర్పాటైంది. వరంగల్ జిల్లా స్వరూపం..: వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ రూరల్ జిల్లా.. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలతో కొత్త వరంగల్ జిల్లా ఏర్పాటైంది. -
దళితబంధు నిధుల విడుదల: వాసాలమర్రిలో కొత్త పండుగ!
సాక్షి, యాదాద్రి, తుర్కపల్లి: ‘దళితబంధు’ పథకం అమలుతో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం గ్రామంలోని దళిత కుటుంబాలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. వాసాలమర్రిలోనే దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు గురువారం సాయంత్రం గ్రామంలోని దళితులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రా«థమిక వివరాలను సేకరించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే యూనిట్ల గ్రౌండింగ్, శిక్షణ అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయనున్నారు. వీలైనంత త్వరగా సొమ్ము జమ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. డప్పు దరువులతో కోలాహలం వాసాలమర్రి గ్రామంలోని దళితులు గురువారం ఉదయం నుంచే సంబరాల్లో మునిగారు. వ్యవసాయం, రోజుకూలి, ఇతర పనులకు వెళ్లేవారు గ్రామంలోనే ఉండిపోయారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకాలు చేశారు. పూలమాలలు వేశారు. గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు పలుగుల నవీన్‌తోపాటు దళితులంతా రంగులు చల్లుకున్నారు. డప్పుదరువులతో కోలాటం ఆడారు. కేసీఆర్‌ను స్తుతిస్తూ బతుకమ్మ పాటలు పాడారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ‘దళితబంధు’తో తమ బతుకులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. కూరగాయల సాగు చేస్తాం.. దళితుల బతుకుల్లో వెలుగులు నింపుతున్న అభినవ అంబేడ్కర్ కేసీఆర్. మా అమ్మ కూరగాయలు అమ్ముతుంటుంది. దళితబంధు నిధులతో మా ఎకరం భూమిలో బోరు వేసుకొని, డ్రిప్ పద్ధతిలో కూరగాయల సాగు చేసుకుంటాం. పాడి పశువులు పెంచాలన్న ఆలోచనలో ఉన్నాం. – చెన్నూరి మమత, బీటెక్ వ్యాపారం చేయాలని ఉంది కేసీఆర్ సార్ మా ఇంటికొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడిండు. మా సంగతులన్నీ చెప్పిన. వ్యాపారం చేస్తనన్న. ‘ఆలోచించి ముందుకు దిగు. పైసా పైసా పెరిగేటట్టు చూసుకో. నీ బతుకు మారుతది’ అని ఓ అన్న లెక్క చెప్పిండు. దళిత బంధు పైసలతో వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడతా. –బొట్టు నరేశ్ ఇసొంటి సీఎంను సినిమాల్లోనే చూసిన మేం ఆరుగురం.. చిన్న గుడిసెలో ఉంటం. చేసిన కష్టం తిండికే సరిపోతోంది. సీఎం సార్ మా ఇంటికి వచ్చిండు. ఇల్లు కట్టిస్త అని చెప్పిండు.పది లక్షల రూపాయలు ఇస్త ఏంచేస్తరన్నడు. అది విని నోట మాట రాలే, ఇసోంటి సీఎంను సినిమాల్లోనే చూసినం. –చెన్నూరి కవిత -
నెడ్కాప్ చైర్మన్‌గా కేకే రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ
అమరావతి: నెడ్కాప్ (న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ- NREDCAP) చైర్మన్‌గా కె.కన్నప్పరాజు నియమితులయ్యారు. రెండేళ్లపాటు చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 137 కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల భర్తీని ఏపీ చేపట్టింది. అందులో కేకే రాజును కూడా నియమించగా తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెడ్కాప్ చైర్మన్‌గా త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కేకే రాజుగా గుర్తింపు పొందిన కన్నప్పరాజు విశాఖపట్టణం జిల్లాకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. -
కొత్త ప్రాజెక్టులపై సర్వే.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ ఆదేశాల మేరకు కొత్త ప్రాజెక్టుల సర్వేకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు నీళ్లు అందకుండా పోయే ప్రమాదముందని కేబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తాగునీటికీ ఇక్కట్లు తప్పవని సమావేశంలో పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు చేరకముందే మళ్లించేలా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. కొత్త ప్రాజెక్టుల సర్వేకు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఆదేశించిన పనులు ఇవే.. ►శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్‌లో జోగుళాంబ బ్యారేజీ నిర్మించి 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేస్తారు. ►భీమా నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి గ్రామం నుంచి వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతారు. ►ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల గ్యాప్ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి సుంకేశుల బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో కొత్త ఎత్తిపోతల పథకం చేపడతారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు దీని ద్వారా నీళ్లిస్తారు. ►కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తారు. ►పులిచింతల డ్యాం ఫోర్‌షోర్‌లో ఎత్తిపోతల పథకం చేపట్టి నల్లగొండ జిల్లాలోని అప్ల్యాండ్ ప్రాంతాల్లో గల 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తారు. ►నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి కాల్వ చివరి, ఎగువ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లిస్తారు. -
బెంగాల్లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. బెంగాల్లో హింసకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గవర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో చెలరేగిన హింస దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటుచేయనుంది. 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రతను కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: Tamil Nadu: పెత్తనం.. పళనిదే! -
డీఎస్పీగా హిమదాస్
భారత యువ అథ్లెట్ హిమ దాస్‌ను ప్రోత్సహిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఈ అమ్మాయి ప్రస్తుతం 400 మీటర్ల పరుగు జూనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కూడా. -
చేతికి బ్యాండ్లు, ముఖానికి మాస్కులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల హామీ మేరకు కరోనాపై యుద్ధం ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా కాకుండా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైట్‌హౌస్‌లో కరోనా నిబంధనల అమలు ప్రారంభించారు. చేతికి రిస్ట్ బ్యాండ్లు (ఈ బ్యాండ్‌లో ట్రాకర్ సాయంతో కోవిడ్ రోగుల్ని గుర్తించవచ్చు) ముఖానికి మాస్కులు తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా ఉద్యోగుల సీట్లను ఆరడగుల దూరంలో ఏర్పాటు చేశారు. కరోనాపై పోరాటమే తన ప్రథమ ప్రాధాన్యంగా బైడెన్ గురువారం పలు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘కరోనాతో మరణించే వారి సంఖ్య 4 లక్షలు దాటిపోయింది, రెండో ప్రపంచ యుద్ధ మృతులు కంటే ఇది ఎక్కువ. వచ్చే నెల మృతులు 5 లక్షలు దాటిపోతాయి. అందుకే ఈ వైరస్‌పై యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేయాలి’’ అని బైడెన్ చెప్పారు. అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు డాక్టర్ ఫాసీ, ఇతర వైద్య రంగ ప్రముఖుల సహకారంతో కరోనా కట్టడికి వ్యూహాన్ని రచించారు. కరోనా కట్టడికి వ్యూహం ► బహిరంగ ప్రదేశాల్లో 100 రోజుల పాటు అందరూ మాస్కులు ధరించాలి. ► ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లోకి వచ్చినప్పుడు భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. ► శ్వేత సౌధానికి వచ్చే వారంతా చేతికి కరోనా ట్రాకర్ బ్యాండ్ ధరించాలి. ► అమెరికాకు వచ్చే ప్రతీ ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకున్నా కే విమానం ఎక్కాలి ► అమెరికాలో దిగాక విధిగా హోంక్వారంటైన్లో ఉండాలి. -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్‌కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్
వాషింగ్టన్ : కరోనా వైరస్ కట్టడికి ఉత్తర కొరియా షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా యూఎస్ ఫోర్సెస్ కొరియా (యూఎస్ఎఫ్కే) కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ వెల్లడించారు. చైనాతో సరిహద్దుల్ని పంచుకున్నప్పటికీ ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ ఉత్తర కొరియాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో కరోనా కేసు చైనాలో బయటపడిన వెంటనే జనవరిలోనే కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. ఒక వ్యక్తికి కరోనా వైరస్ అనుమానం ఉందనే చెప్పింది తప్ప, అధికారికంగా కొరియా నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి తరుణంలో యూఎస్ఎఫ్కే కమాండర్ రాబర్ట్ వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆన్లైన్ సదస్సులో పాల్గొన్నారు. కరోనా కట్టడికి ఉత్తర కొరియా అధికారులు షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కరోనా ఎవరికైనా సోకిందని తెలిసిన వెంటనే వారిని కాల్చి చంపేయాలని ఉత్తర కొరియా స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు -
టిక్‌టాక్.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి
వాషింగ్టన్: అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని 90 రోజుల్లోగా అమ్ముకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ అమెరికాకు చెందిన సమాచారాన్ని సేకరిస్తోందని, అది జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ టిక్‌టాక్‌ను ఇటీవల నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా యూజర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా తమకు అప్పగించాలని, ఆస్తులను 90 రోజుల్లోగా అమ్ముకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలపై తాజాగా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. -
మిత్ర దేశాలకు అమెరికా డ్రోన్లు..!
వాషింగ్టన్: మిత్ర దేశాలకు విక్రయించే డ్రోన్ల విషయంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. గంటకు 800 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న డ్రోన్ల ఎగుమతులకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్) చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే డ్రోన్లను ఇప్పటివరకు బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియాలకు మాత్రమే అమెరికా విక్రయించింది. తాజా నిర్ణయం అమెరికా మిత్రదేశాలు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టులతోపాటు ముఖ్యంగా భారత్‌కు లాభించనుంది. లిబియా, యెమెన్ అంతర్యుద్ధంలో వివిధ పక్షాలు వాడుతున్న చైనా డ్రోన్లకు దీటుగా మిత్ర దేశాలకు వీటిని విక్రయించాలని కూడా అమెరికా యోచిస్తోంది. ‘800 కిలోమీటర్ల నిబంధన’ను చైనా అనుకూలంగా మార్చుకుని, డ్రోన్ల తయారీ భారీగా చేపట్టి, మార్కెట్ అవకాశాలను పెంచుకుంది. అదే సమయంలో అమెరికా డ్రోన్ పరిశ్రమ అవకాశాలను కోల్పోతూ వచ్చింది. అమెరికా మిత్ర దేశాలైన ఈజిప్టు, సౌదీ అరేబియాలకు సైతం చైనా డ్రోన్లను విక్రయించింది. అమెరికాతోపాటు ఇతర భాగస్వామ్య దేశాల భద్రత ఈ పరిణామంతో ప్రమాదంలో పడింది’అని ట్రంప్ యంత్రాంగం అంటోంది. ‘మా మిత్ర దేశాల అత్యవసర జాతీయ భద్రత అవసరాలు తీరనున్నాయి’అని విదేశాంగ శాఖ ఉన్నతాధికారి క్లార్క్ కూపర్ వెల్లడించారు. అయితే, ట్రంప్ చర్యతో అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆయుధ నియంత్రణ వ్యవస్థ బలహీనపడినట్లేనని సెనేటర్ బాబ్ మెనెండెజ్ అంటున్నారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ..500 కిలోల బరువైన బాంబులు, హెవీ వార్‌హెడ్స్ తదితర పేలుడు సామగ్రిని మోసుకెళ్లే డ్రోన్లను కూడా స్వేచ్ఛగా విక్రయించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎలియట్ ఎంగెల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌కు పొసీడన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చైనాతో సరిహద్దు వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికా నుంచి మరో 6 లాంగ్రేంజ్ పొసీడన్–8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమైంది. 6 ప్రిడేటర్–బి ఆర్మ్డ్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక తయారు చేస్తోంది. 6 పొసీడన్–8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం 1.8 బిలియన్ డాలర్లు(రూ.13,400 కోట్లు) వెచ్చించనున్నారు. ఈ మేరకు అభ్యర్థన లేఖను అమెరికా ప్రభుత్వానికి పంపించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. పొసీడన్–8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సరిహద్దుల్లో, సముద్ర ఉపరితలంపై నిఘా కోసం ఉపయోగిస్తారు. ఇందులో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్లు ఉంటాయి. భారత్‌కు లాభమెంత? చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా నిర్ణయం భారత్‌కు అనుకూలంగా మారింది. 22 ప్రిడేటర్–బి రకం డ్రోన్లను విక్రయించేందుకు భారత్‌తో అమెరికా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. గంటకు 482 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే నిఘా డ్రోన్లు ప్రిడేటర్–బి, 629 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గ్లోబల్ హాక్‌లను అమెరికా నుంచి సమకూర్చుకునేందుకు వీలు కలుగనుంది. ఈ రెండు రకాల డ్రోన్లు సడలింపునకు లోబడి గంటకు 800 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించేవే కావడం గమనార్హం. ఇవి 4హెల్ఫైర్ క్షిపణులతోపాటు 225 కిలోల లేజర్ గైడెడ్ బాంబులను తీసుకెళ్లగలవు. మానవ సహిత యుద్ధ విమానాల స్థానంలో పర్వత ప్రాంతాల్లో విధులు చేపట్టేందుకు డ్రోన్లతో స్వా్కడ్రన్లను ఏర్పాటుచేయాలని భారత్ యోచిస్తోంది. -
ఎట్టకేలకు ఉస్మానియా ఖాళీ
సాక్షి, హైదరాబాద్ : పూర్తిగా శిథిలావస్థకు చేరిన చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాలని ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనంలోని రోగులు, ఇతర కార్యాలయాలను వేరే భవనాల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఆదేశాలు జారీ కావడంతో ఆస్పత్రి యంత్రాంగం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. భవనాన్ని ఖాళీ చేసింది. 1925లో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. నిర్వహణ లోపం వల్ల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం పై అంతస్తుల్లోని పైకప్పు తరచూ పెచ్చులూడి పడుతోంది. గోడలు బీటలు వారాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షానికి పాత భవనంలోని వార్డులను వరద ముంచెత్తడం, మురుగు నీటి మధ్యే రోగులకు చికిత్స అందించాల్సి రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలు అందించడం ఏ మాత్రం సురక్షితం కాదని భావించిన ప్రభుత్వం తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర భవనాల్లో సర్దుబాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవలే ఆధునికరించిన హౌజ్ సర్జన్ల భవనంలో 150 పడకలు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటుచేసిన రాత్రి వసతిగృహంలో 250 పడకలు, మరో భవనంలో ఇంకో 100 పడకలను సర్దుబాటు చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయం సహా పలు ఆపరేషన్ థియేటర్లను ఖాళీ చేస్తున్నారు. ఉస్మానియా పాత భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి అక్కడ కొత్తగా ట్విన్ టవర్స్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత భవనాన్ని కూల్చి అదే స్థలంలో నిర్మాణం చేపట్టిన తర్వాత మిగతా భవనాలను కూల్చివేయనున్నారు. భవిష్యత్తులో రోగుల రద్దీని తట్టుకోవాలంటే.. ఇప్పటికే గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్లుగా మార్చింది. సాధారణ రోగులకు ప్రస్తుతం అక్కడ చికిత్సలు అందించలేని పరిస్థితి. తాజాగా ఉస్మానియా పాత భవనం కూడా ఖాళీ చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటికే 1,500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు ఇక్కడ చికిత్సలు ఇబ్బందిగా మారుతాయి. ఇటీవల గచ్చిబౌలిలో ప్రారంభించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను తాత్కాలికంగా ఉస్మానియాకు కేటాయించి, ప్రస్తుతం ఇక్కడ ఉన్న çకొన్ని విభాగాలను అక్కడికి తరలించడం వల్ల రోగుల రద్దీని నియంత్రించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపాదించిన పదేళ్ల తర్వాత మళ్లీ కదలిక చారిత్రక ఈ భవనంలో వైద్యసేవలు ఇటు రోగులకు..అటు వైద్యులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని దివంగత నేత ,అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. నాలుగు ఎకరాల విస్త్రీర్ణంలో ఏడు అంతస్థుల భవనాన్ని నిర్మించాలని భావించి ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కోసం ఓ పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏడు అంతస్థుల భవనానికి ఆర్కియాలజీ విభాగం అ«భ్యంతరం చెప్పడంతో నాలుగు అంతస్థులకు కుదించారు. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించారు. వారం రోజుల్లో పాత భవనాన్ని ఖాళీ చేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. తాత్కాలికంగా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులకు పలు వార్డులను తరలించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో పడకలు కూడా సిద్ధం చేశారు. అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో రోగుల తరలింపు నిలిచిపోయింది. ఇదే సమయంలో పాతభవనం కూల్చివేతకు ఇటు ఆర్కియాలజీ..అటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మరో రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పునాదిరాయి కూడా వేయలేదు. రక్షణ లేని ఈ పాతభవనంలో వైద్యసేవలు అందించలేక పోతున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది 2018లో వందరోజుల పాటు ఆందోళన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా వార్డుల్లోకి వరద నీరు చేరడంతో పాతభవనం ఖాళీ, కొత్త భవన నిర్మాణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. -
సిబ్బంది వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో సిబ్బంది వ్యవహరాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, దివ్యాంగులైన అధికారులు, సిబ్బందికి విధులకు హాజరు కావడం నుంచి మినహాయింపు కల్పించింది. ఇతర వ్యాధులతో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహాయింపు వర్తింపచేసింది. వ్యాధులతో బాధపడేవారికి కరోనా మహమ్మారి ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి : లాక్డౌన్ ఎత్తేయాలి: రాజీవ్ బజాజ్ -
హైకోర్టుకు 183 సూపర్‌న్యూమరరీ, 267 అదనపు పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు పరిధిలో 183 సూపర్ న్యూమరరీ, 267 పోస్టుల కల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఈ మేరకు కేటగిరీల వారీగా ఆయా పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్‌న్యూమరరీ పోస్టుల్లో భాగంగా జాయింట్ రిజిస్ట్రార్(1), డిప్యూటీ రిజిస్ట్రార్ (3), అసిస్టెంట్ రిజిస్ట్రార్(10), సెక్షన్ ఆఫీసర్ (50),జడ్జిలు, రిజిస్ట్రార్లకు పీఎస్‌లు(11), డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లు(12), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు(24), ఎగ్జామినర్(3), డ్రైవర్(30), రికార్డు అసిస్టెంట్(39) పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇక అదనపు పోస్టుల విషయానికి వస్తే జిల్లా కోర్టులు, అదనపు జిల్లా సెషన్స్ కోర్టులు, కమిషనర్లు, ఎస్పీ కార్యాలయాలు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టులు, ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు 267 పోస్టులకు అనుమతినిచ్చింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(4), గ్రేడ్–1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (116), గ్రేడ్–2 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(39), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (101), పరిపాలన అధికారులు (2), సూపరిండెంట్లు (2), సీనియర్ అసిస్టెంట్లు(3) పోస్టులు మంజూరయ్యాయి. వీటికి తోడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో హైకోర్టులో ఒక ఓఎస్డీ పోస్టును కూడా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ వేరొక ఉత్తర్వు జారీ చేసింది. -
ఫరూక్ అబ్దుల్లా నిర్బంధం పొడిగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సబ్‌జైలుగా ప్రకటించిన ఆయన నివాసంలోనే మరో మూడు నెలలపాటు ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంలో ఉంటారని అధికారులు చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఎత్తివేస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్నాక ఫరూక్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి గృహ నిర్బంధంలో(ప్రజా భద్రతా చట్టం కింద) ఉంచారు. -
కశ్మీర్ అధికారులకు కీలక ఆదేశాలు
జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి గురువారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్నిస్థాయిల ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాల్సి ఉంది. డివిజనల్, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సెక్రటేరియట్ శ్రీనగర్‌లో పనిచేస్తున్న ఇతర వారందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే రేపు (ఆగస్టు 9) సాంబాలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను రీ ఓపెన్ చేయాలని, కార్యక్రమాలను యధావిధిగా పునః ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (ఆగస్టు 8) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నోట్ల రద్దు 2016, నవంబరు 8వ తేదీన ప్రకటించిన మోదీ, ఆగస్టు 8వ తేదీన సరిగ్గా ఎనిమిది గంటలకు తన కీలక ప్రసంగాన్ని చేయనున్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు ప్రతిపాదన, పార్లమెంటు ఆమోదం లాంటి పరిణామాలను చకాచకా చక్కబెట్టిన మోదీ సర్కార్ మరింత వేగంగా తదనంతర చర్యలను పూర్తి చేయాలని పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. J&K Govt: As per directions issued by Chief Secretary Jammu and Kashmir, all Government employees who are working at divisional level, district level and those serving in civil secretariat Srinagar, to report back to their duties with immediate effect. pic.twitter.com/pdn68mmRsb — ANI (@ANI) August 8, 2019 -
పీఎన్బీకి 7,200 కోట్లు చెల్లించండి
పుణే: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు రూ. 7,200 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని రుణ రికవరీ ట్రిబ్యునల్ శనివారం ఆదేశించింది. పీఎన్బీని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు అనుకూలంగా రుణ రికవరీ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీపక్ కుమార్ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. ‘జూన్ 30, 2018 నుండి సంవత్సరానికి 14.30 శాతం వడ్డీతో రూ. 7,200 కోట్ల మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా విడతలవారీగా దరఖాస్తుదారునికి (పీఎన్బీ) చెల్లించాలని ప్రతివాదిని, అతని భాగస్వాములను ఆదేశిస్తున్నట్టు డీఆర్టీ ఉత్తర్వులో పేర్కొంది. మరో ఉత్తర్వును వెలువరిస్తూ, జూలై 27, 2018 నుండి 16.20 శాతం వడ్డీతో రూ. 232 కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి నీరవ్‌ని ఆదేశించారు. లేనిపక్షంలో అధికారులు తదుపరి చర్యలను ప్రారంభిస్తారని ట్రిబ్యునల్ అధికారి స్పష్టం చేశారు. -
రాధారవి, శరత్‌కుమార్ అరెస్టుకు ఆదేశం
సాక్షి, చెన్నై: సినీ నటులు రాధారవి, శరత్‌కుమార్‌ల అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రా«ధారవి కార్యదర్శిగా గతంలో ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నటీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
సీబీఐ జేడీ బదిలీ.. వెంటనే నిలిపివేత
న్యూఢిల్లీ: ఉన్నతాధికారుల అవినీతి ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న సీబీఐ..శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై తీవ్ర అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ వి.మురుగేశన్‌ను మరో కేసు దర్యాప్తునకు బదిలీ చేస్తూ శుక్రవారం సీబీఐ అంతర్గత ఉత్తర్వు జారీ చేసింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మురుగేశన్‌ను అవినీతి వ్యతిరేక విభాగం నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేస్తున్నట్లు సీబీఐ ఇన్చార్జి డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వెలువరించిన ఉత్తర్వు మీడియాకు లీకైంది. బొగ్గు కుంభకోణం కేసుల దర్యాప్తును వేగవంత చేయటానికి గాను ఆయన్ను ఆ విభాగానికి మార్చుతున్నట్లు అందులో పేర్కొన్నారు. -
ఏటా 20 ఈఎల్స్ వాడాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్›్డ లీవులు(ఈఎల్స్–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్‌లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది. -
ఆ 27 మంది ఆప్ ఎమ్మెల్యేలు అర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల వివాదం నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు అర్హులేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఢిల్లీలోని అధికార ఆప్‌కి ఊరట లభించినట్లయింది. లాభదాయక పదవుల్లో ఉన్న కారణంగా ఆప్‌కి చెందిన 27 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ అందిన దరఖాస్తును రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. 27 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని సర్కారు దవాఖానల్లో ‘రోగి కల్యాణ్ సమితి’ చైర్మన్లుగా నియమిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం..ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటయ్యే ‘రోగి కల్యాణ్ సమితి’కి ఆప్రాంత ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. ప్రతి సమితికి ఏడాదికి రూ.3 లక్షల వరకు గ్రాంట్‌ను ప్రభుత్వం ఇస్తుంది. -
1,840 ఆలయాలకు ధూప దీప నైవేద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,840 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉన్న 1,805 దేవాలయాలతోపాటు మరో 3 వేల ఆలయాల్లో అమలు చేయాల్సి ఉందని, తొలిదశలో భాగంగా 1,840 దేవాలయాలకు వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధూప, దీప, నైవేద్య పథకం కింద చేసే ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోకపోతే ఆ గుడికి ఎప్పుడైనా సాయా న్ని నిలిపేస్తామన్నారు. ధూప దీప నైవేద్య పథకాన్ని సెప్టెంబర్ నుంచే వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే దేవాలయాలకు పునర్వైభవం వచ్చి ందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 66 బంజారా దేవాలయాల్లోని పూజారులు, బావోజీలు, సాధు సంతులకు చోటు కల్పించినట్లు వెల్లడించారు. విశ్వకర్మల, మార్కండేయ దేవాలయా ల్లోని అర్చకులకూ గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్తగా ఇచ్చిన 1,840 ఆలయాలకు ఏడాదికి రూ.14.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 3,645 ఆలయాల అర్చకులకు ఏడాదికి రూ.27.5 కోట్లను గౌరవవేతనం ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 కొత్త ఆలయాల నిర్మాణంతోపాటు జీర్ణోధరణకు సర్వ శ్రేయో నిధి నుంచి రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. -
కాలేజీల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని యూజీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కళాశాలల్లో జంక్ ఫుడ్‌ను నిషేధించాల్సిన అవసరముంది. ఆరోగ్య కరమైన పదార్థాలను అందించడం వల్ల విద్యా ర్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే దృక్పథం అలవ డుతుంది. ఊబకాయ సమస్యను సైతం దూరం చేయవచ్చు. అధికబరువుకు జీవనశైలి రుగ్మ తలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. జంక్‌ఫుడ్ నిషేధం వల్ల ఈ రుగ్మతలన్నింటిని అధిగమించవచ్చు’ అని యూజీసీ పేర్కొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణాల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలపై నిషేధిస్తూ యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జంక్‌ఫుడ్, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించాలని యూజీసీ ఉత్తర్వుల్లో వర్సిటీలకు సూచించింది. -
ముగ్గురు సుప్రీం జడ్జీల పదోన్నతికి ఆమోదం
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన వారిలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన వారెంట్లపై కోవింద్ శుక్రవారం సంతకం చేయగా, శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. మహిళా జడ్జీల సంఖ్య మూడుకు చేరింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ కొత్తగా చేరబోతుండగా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు. -
కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు
న్యూఢిల్లీ: కోర్టులిచ్చే తీర్పులు సకారణంగా, కక్షిదారులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు కోర్టులో ఎందుకు ఓడిపోయిందో, లేక ఎందుకు గెలిచిందనే విషయం కక్షిదారులకు తెలిసేలా తీర్పులుండాలని సూచించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండోర్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005–06 కాలానికి గాను తమ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయలేదు. బాధితులు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ను ఆశ్రయించగా వెంటనే రూ.87,204 చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంపోజిట్ కంపెనీ ఈపీఎఫ్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసింది. పరిశీలించిన ట్రిబ్యునల్ బోర్డ్ ఆదేశాలను పక్కన బెట్టింది. దీంతో ట్రస్టీస్ బోర్డ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. పరిశీలించిన ఇండోర్ బెంచ్.. బోర్డ్ పిటిషన్‌ను కొట్టి వేయడంతోపాటు ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈ తీర్పుపై ఈపీఎఫ్ బోర్డ్ సుప్రీంకు వెళ్లింది. విచా రణ చేపట్టిన జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ నవీన్ సిన్హాల బెంచ్.. ‘ఆ తీర్పు కక్షిదారుల పట్ల పక్ష పాతం చూపినట్లుంది. కేసులో కక్షిదారులు తామెందుకు ఓడామో లేక గెలిచామనే విష యం తెలియకుండాపోయింది’ అని పేర్కొంది. -
జిల్లా జడ్జిగా మౌలాన్ జునైద్ అహ్మద్
సాక్షి, చిత్తూరు అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మౌలాన్ జునైద్ అహ్మద్‌ను నియమిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న సిహెచ్.కనకదుర్గారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నెల్లూరులో పనిచేస్తున్న మౌలాన్ జునైద్ అహ్మద్‌ను చిత్తూరుకు బదిలీ చేశారు. -
కదిలించిన ‘ఉప్పునీరు’
పుట్టిన ఊరిని ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు పట్టించుకోలేదు.. ఉద్ధరిస్తాడనుకుంటే కష్టాల దారిలో నిర్లక్ష్యంగా వదిలేయడంతో సమస్యలతో సావాసం చేస్తున్న నడిమివాడ గ్రామస్తుల దయనీయ దుస్థితిపై సాక్షి ప్రచురించిన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రభుత్వ పథకాలేవీ వారి దరి చేరలేదన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్.. తక్షణం గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలంటూ మండల అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో స్థానిక అధికారులు గ్రామాన్ని హుటాహుటిన సందర్శించారు. నడిమివాడలో ఉండే ప్రతి సమస్యనూ సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ సాక్షికి తెలిపారు. విశాఖసిటీ, పెదబయలు: ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు స్వగ్రామంలో గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘విప్ ఊరు.. ఉప్పు నీరు’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ లో ప్రచురించిన కథనంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. గిన్నెలకోట పంచాయితీ నడిమివాడ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షిపత్రికలో చదివిన ఆయన మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులు, తాగునీటి సమస్యతో పాటు పింఛన్ కష్టాలు, పౌష్టికాహార లోపం, సాగునీటి కష్టాలకు సంబంధించిన అన్ని వివరాలూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో వసంతరావు నాయక్ సోమవారం హుటాహుటిన నడిమివాడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తాగుతున్న ఊట నీటిని, గ్రామంలో ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్నాయా లేదా అనే వివరాల గురించి అ డిగి తెలుసుకున్నారు. గ్రామంలో 9 కుటుంబాలు ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ పక్కా గృహాలు మంజూరు చేయడం లేదని, మట్టి ఇళ్లల్లో ఉంటూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పైకప్పు పెంకులు పగిలిపోతే పాలిథిన్ టార్ఫాలిన్ కవర్లు కట్టుకుని నివాసం ఉంటున్నామంటూ గోడు వెలి బుచ్చారు. అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చేందుకు సరైన రహదారి మార్గంలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఏకరువుపెట్టారు. గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టు నిర్మాణం చేస్తే.. ఉపాధి కోసం ఆవలి ప్రాంతాలకువెళ్లే మార్గం సుగమమవుతుందని ప్రజలు తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అం దించేందుకు గ్రామానికి మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని కోరారు. నడిమివాడ, గుండాలగరువు గ్రామాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇంజరి పంచాయతీ చెందిన మల్లెపుట్టు గ్రామంలోని అం గన్వాడీ కేంద్రానికి వెళ్లి ఫీడింగ్ సరుకులు తీసుకొ చ్చేందుకు నరక యాతన అనుభవిస్తున్నారని ఎం పీడీవో ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే గ్రామంలో పంట భూములకు నీరందించేందుకు సరియాల గెడ్డ సమీపంలో, కొండవాలు గెడ్డ ప్రాం తాల్లో చెక్‌డ్యాంలు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకున్నారు. ఉపాధి పొందేందుకు కాఫీ మొక్కలు పంపిణీ చేయాలని కోరారు. మరోవైపు.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవి పట్టన్‌శెట్టి సాక్షి కథనంపై స్పందిస్తూ గ్రామంలో తాగునీటిసమస్య పరిష్కరించేందుకు మంచినీటి పథకం ఏర్పాటు చెయ్యాలని ఆర్‌డబ్లు్యఎస్ విభా గం అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు నడిమివాడ గ్రామంలో ఆర్‌డబ్లు్యఎస్ సైట్ ఇంజనీర్ మత్స్యలింగం సోమవారం పర్యటించా రు. గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ నిర్మించిన గ్రావిటీ పథకం నిరుపయోగంగా ఉండటాన్ని గమనించి ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే మరమ్మతులు చేసి పథకాన్ని అందుబాటులో తెచ్చేందుకు వెలుగు పథకం ద్వారా నిదులు కేటాయించాలని ఐటీడీఏ పీవో ఆదేశించారని ఆర్‌డబ్లు్యఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీ ర్ రాంప్రసాద్ తెలిపారు. పెదబయలు ఆర్‌డబ్లుఎస్ జేఈ జగదీష్ సైతం నడిమివాడ గ్రామాన్ని సందర్శించి వాటర్ స్కీం మరమ్మతుల కోసం అయ్యే అంచనాల్ని రూపొందించి ఒకవారంరోజుల్లో గ్రావిటీ స్కీంని వినియోగంలోకి తీసుకు వస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలతో పాటు గ్రామాన్నే మరిచిపోయారు.. మీరలా కాకూడదంటూ ఎంపీడీవోని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : ఎంపీడీవో వసంతరావు నాయక్ నడిమివాడ గ్రామానికి తాగునీరు, పక్కా గృహాలు , రోడ్డు, కల్వర్టు సమస్యలు ఉందని ఎంపీడీవో వి.వసంతరావునాయక్ తెలిపారు. గ్రామంలో 3 వేల మీటర్లు దూరంలో ఉన్న అంబలిమామిడి కొండ ప్రాంతం నుంచి గ్రావిటీ పథకం మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టుకు ప్రతిపాధనలు పంపిస్తామన్నారు. గ్రామంలో 9 కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తామని, నడిమివాడ, గుండాలగరువు గ్రామాలకు కలిపి అంగన్వాడీ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు. ఉపాధి పథకం ద్వారా చెక్‌డ్యాంలు మంజూరు చేస్తామని, అర్హులకు పింఛన్లు, గ్రామంలో డ్వాక్రా సంఘానికి పçసుపు కుంకుమ డబ్బులతో పాటుగా బ్యాంకు రుణాలు అందే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. ఎంపీడీవోతో పాటు డివిజన్ సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు పాంగి సింహాచలం పంచాయతీ కార్యదర్శులు నాగేశ్వరరావు, కాంతరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
నో టాయిలెట్..నో రైస్!: కిరణ్‌బేడి
పుదుచ్చేరి: బహిరంగ మల విసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి శనివారం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. జూన్ చివరి నాటికి పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైతుబంధుకు రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందించడానికి రూ.6 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులిచ్చింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నిధులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. బ్యాంకులు ము ద్రించిన చెక్కులను గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలకు సరఫరా చేయనున్నా రు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు మొదటి విడత చెక్కులను జిల్లా వ్యవసాయాధికారులకు పంపిణీ చేస్తా రు. వాటిని గ్రామసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు. చెక్కులిస్తే నగదెట్లా? చెక్కుల పంపిణీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో మూడు విడతలు గా రూ. 6 వేల కోట్లు పంపిణీ చేయనుంది. సొమ్మును రైతు ఖాతాలో జమ చేయకుండా ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులు ఇస్తోంది. వీటిని రాష్ట్రంలో సంబంధిత బ్యాంకు బ్రాంచీలో ఎక్కడైనా జమచేసి డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు సమస్య తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకుకెళ్లినా రూ.5 వేలకు మించి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చెక్కులు పొందిన రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతున్నారు. కందుల సొమ్ములోనూ.. ఇటీవల ప్రభుత్వం 2.62 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,420 కోట్లు జమ చేసింది. ఆ డబ్బుల కోసం వెళ్తే కరెన్సీ కొరత వల్ల ఎంతోకొంత ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతులకూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుందా అని చర్చ జరుగుతోంది. డబ్బుల కోసం రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి ప్రభుత్వం విన్నవించినా ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. -
1593 మంది అనర్హులు!
పెద్దపల్లిరూరల్: గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ సిన అభ్యర్థుల్లో 1593 మందిపై అనర్హత వేటు పడింది. జిల్లాలోని 14 మండలాలలో 208 గ్రామపంచాయతీలుండగా 2070 వార్డులున్నాయి. వీటికి నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపలేదన్న కారణంతో 1593 మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వచ్చే మూడేళ్లపాటు జరిగే ఏఎన్నికలలోనూ పోటీచేసే అవకాశముండదని ఆ నోటీసుల్లో పేర్కొంది. పదవి పోగొట్టుకున్న సర్పంచ్ సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన లంక శంకర్ ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించలేదు. ఈ కారణంగా సర్పంచ్ పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. వార్డు సభ్యులుగా ఎన్నికైన జిల్లాలోని వివిధ పంచాయతీలకు చెందిన 168 మంది సభ్యులు ఖర్చుల వివరాలు చూపని కారణంగా వార్డుసభ్యుని పదవులు కోల్పోనున్నారు. -
కొత్త సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. సికింద్రాబాద్‌లోనే ‘రైల్వే’శిక్షణ 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఎనిమిది నెలలపాటు రైల్వేలో పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. అప్పట్నుంచే తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉంది. జోషి సివిల్ సర్వీసెస్ అధికారిగా మొదట నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐటీ, నీటిపారుదల, ఇంధన శాఖ, రెవెన్యూ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచీ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండు దఫాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. మధ్యాహ్నమే బాధ్యతలు కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి బుధవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం చంద్ర గ్రహణం మొదలవటంతో అంతకుముందే 3 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సమత బ్లాక్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ తన బాధ్యతలను జోషికి అప్పగించారు. ఈ సందర్భంగా జోషి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు జోషికి అభినందనలు తెలిపారు. సీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మంచి పేరు తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ జోషి అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నీటి పారుదల శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సైతం ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ అధీనంలో ఉన్న సీసీఎల్ఏ అదనపు బాధ్యతలను రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అప్పగించారు. సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
♦ 20,903 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విలీనం ♦ సీఎం ఆమోదంతో వెంటనే వెలువడ్డ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యో గుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు శనివారం ఉత్తర్వులు జారీ చేశాయి. ఉద్యోగుల విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఉన్నత నైపుణ్యంగల వారికి ఆర్టిజన్ గ్రేడ్–1, నైపుణ్యంగల వారికి ఆర్టిజన్ గ్రేడ్–2, స్వల్ప నైపుణ్యంగల వారికి ఆర్టిజన్ గ్రేడ్–3, నైపుణ్యంలేని వారికి ఆర్టిజన్ గ్రేడ్–4 హోదాలు కల్పిస్తూ విలీనం (అబ్జార్షన్) చేసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీడీసీ ఎల్లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,333 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ పొందారు. వారికి కొత్త పే స్కేల్‌ను విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థల్లో తక్కువ జీతం తీసుకుంటూ కష్టపడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆగమేఘాల మీద ప్రక్రియ... ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు, సుప్రీంకోర్టు ఇటీవల వ్యతిరేకించడం... విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు లో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాక ముందే క్రమబద్ధీ కరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలతోపాటు ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల పాలక మండళ్లు శుక్రవారం విద్యుత్‌సౌధలో సమావేశమై ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించాయి. ఆ వెంటనే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాయి. ఈ ప్రతిపాదనలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామమ కృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు శని వారం చర్చించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమ బద్ధీకరణ ప్రతిపాదనలను సీఎం ఆమోదానికి పంపగా, ఆయన వెంటనే ఆమోదముద్ర వేయ డంతో ఈ ప్రక్రియ వేగంగా జరిగిపోయింది. సీఎంకు ట్రాన్స్‌కో సీఎండీ కృతజ్ఞతలు విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీ కరిస్తామన్న మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యుత్ సంస్థల తరఫును జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్య మంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా రన్నారు. విద్యుత్ ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావుకు ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవోగా రవికుమార్
విజయవాడ (లబ్బీపేట): విజయవాడ ప్రభుత్వాస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (సివిల్ సర్జన్ ఆర్ఎంఓ– ఇన్‌ఛార్జి)గా డాక్టర్ జి.రవికుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సివిల్æసర్జన్ ఆర్ఎంఓగా పనిచేసిన డాక్టర్ గీతాంజలి తిరుపతి రుయాకు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆమె స్థానంలో డిప్యూటీ ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. గీతాంజలి రెండేళ్లపాటు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓగా పనిచేసారు. రవికుమార్ డిప్యూటీ ఆర్ఎంఓగా ప్రభుత్వాస్పత్రిలో తొమ్మిదేళ్లుగా పనిచేయడంతో ఇక్కడి పరిస్థితులపై పట్టుంది. ఆస్పత్రిపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ రవికుమార్‌ను ఈ మేరకు నియమిస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ జగన్మోహనరావు ఆదేశాలు ఇచ్చారు. శనివారం సాయంత్రం గీతాంజలి రిలీవ్‌కాగా, రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. -
ఐకేపీ ఉద్యోగుల వేతనాలు పెంపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ ♦ ఎంసీసీలకు వందశాతం పెరిగిన జీతం ♦ మిగతా ఉద్యోగులకు 30శాతం పెరుగుదల ♦ జిల్లాలో 403 ఉద్యోగులకు లబ్ధి ♦ ఆగస్టు నుంచే పెరుగుదల అమలు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలనే డిమాండును ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. వారి వేతనాలను పెంచుతూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ల వేతనాలను ఏకంగా రెట్టింపు చేసింది. ప్రస్తుతం వీరికి రూ.6,200 ఇస్తుండగా.. ఇకపై రూ.12,000 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో పనిచేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్ తదితరులకు వారి బేసిక్ వేతనంపై 30శాతం పెంచుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ పెంపును ఆగస్టు నుంచే అమలు చేయనున్నట్లు వివరించింది. ఈక్రమంలో వచ్చేనెల వేతనం నుంచే పెరిగిన మొత్తాన్ని ఉద్యోగులు తీసుకోనున్నారు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న 403 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులకు నెలవారీగా రూ.66.84లక్షలు వేతనాల రూపంలో అందిస్తున్నారు. తాజా పెరుగుదలతో జిల్లాపై రూ.20లక్షల భారం పడనుంది. 50శాతం పెంచాలన్నాం.. ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన పెంపు కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం. అందరికీ 50శాతం పెంచాలని కోరాం. కానీ ఎంసీసీల వేతనాల్ని మెరుగ్గా పెంచినప్పటికీ.. మిగతా ఉద్యోగులకు బేసిక్పైన 30శాతం మాత్రమే పెంచారు. దీంతో ఇతర కేటగిరీల ఉద్యోగులు కొంత నిరుత్సాహంలోనే ఉన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో మరింత మెరుగ్గా వేతనాలు పెంచుతారని ఆశిస్తున్నా. ప్రస్తుత పెంపుపై ప్రభుత్వానికి కతజ్ఞతలు చెబుతున్నా. - సురేష్‌రెడ్డి, ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
భాషా పండితులకు శుభవార్త
పదోన్నతులకు ఉత్తర్వుల జారీ మురళీనగర్ : భాషా పండితుల ఆశలు ఎట్టకేలకు నెరవేరాయి. దశాబ్దాలుగా తమ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతున్న వీరికి మోక్షం కలగనుంది. భాషాపండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ 144వ నంబరు ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసినట్లు రాష్ట్ర పండిత పరిషత్ పూర్వ కార్యదర్శి డాక్టర్ బి.గోవిందనాయడు తెలిపారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా 1450 భాషాపండిత పోస్టులతో పాటు 1250 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి గ్రేడ్–1హోదా కల్పిస్తారు. అంటే వీరికి స్కూల్ అసిస్టెంటుగా పదోన్నతి కల్పిస్తారు. వాస్తవానికి జిల్లాలో గ్రేడ్–2 తెలుగు 1200, హిందీ–800, విజయనగరం జిల్లాలో గ్రేడ్–2 తెలుగు 1200 మంది, హిందీ 800 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా ఇదే సంఖ్యంలో భాషా పండితులు ఉన్నారు. ఒడిశా బోర్డర్లో ఒరియా, కొన్ని పాఠశాలలో సంస్కతం భాషా ఉపాధ్యాయులు గ్రేడ్–2 పోస్టులో పనిచేస్తున్నారు. వీరికి కూడా పదోన్నతి కల్పిస్తారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 100–150 మందికి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80–90 మంది భాషా పండితులకు గ్రేడ్–1 క్యాడర్ లభిస్తుంది. మిగతా పోస్టులను దశల వారిగా భర్తీ చేస్తారు. ఫీడర్ క్యాడర్లో గ్రేడ్–2భాషా పండితులుగా నియమితులైనవారికి మాత్రమే గ్రేడ్–1 పదోన్నతి లభిస్తుందని గోవిందనాయుడు చెప్పారు. ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రెవెన్యూ కార్యదర్శి కృష్ణ సస్పెన్షన్
యాచారం: రెవెన్యూ కార్యదర్శి కృష్ణను సస్సెన్షన్ చేస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్ పద్మనాభరావు తెలిపారు. యాచారం రెవెన్యూ పరిధిలోని ఓ వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఓ వ్యక్తి నుంచి యాచారం రెవెన్యూ కార్యదర్శి అయిన కృష్ణ ఫోనులో డబ్బులు అడిగిన విషయం తెలిసిందే. రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పక్షం రోజుల కింద ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. వెంటనే తహసీల్దార్ పద్మనాభరావు కృష్ణను కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ కూడా చేశారు. విచారణ జరిపిన అనంతరం కృష్ణను సస్పెండ్ చేస్తూ ఈనెల 21న కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఫోనులో రైతుతో ఎందుకు సంభాషణ చేసింది, ఆ రైతు ఎందుకు ఫిర్యాదు చేశారోననే విషయమై పది రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. -
సీనియర్ సహాయకులకు పదోన్నతి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వివిధశాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆయా మండలాల్లో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీదేవి, పరిపాలనాధికారి నర్సయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. పదోన్నతి పొందిన సీనియర్ సహాయకులు వీరే.. ఎన్ సరస్వతి(బల్మూర్), బి.వెంకటేశ్ (నాగర్‌కర్నూల్) ఎం.రామకష్ణయ్య (ఊట్కూర్), ఎస్.జయంతి(మానవపాడు), పి.మాన్య (కొత్తూరు), బి.వెంకటేశ్ ప్రసాద్ (బాలానగర్), జి.ఈశ్వరరాణె (మహబూబ్‌నగర్), పి.మోతిలాల్ (బల్మూర్), జి.చక్రపాణి (అచ్చంపేట), బి. మాధవి (భూత్పూర్), పి.విజయ్‌కుమార్ (తలకొండపల్లి), తస్కిన్ ముబీన్ (అచ్చంపేట), ఎస్.నాగరాజు (కొత్తకోట), బి.సురేశ్ (మాగనూరు), ఎ.రాణిదేవి (నారాయణపేట), ఎండి.ఖాజామైనొద్దీన్ (నాగర్‌కర్నూల్), ఎ.మణిపాల్‌రెడ్డి (వెల్దండ), ఎ.రాజేశ్ (మహబూబ్‌నగర్), జి.భాస్కర్ (మహబూబ్‌నగర్), ఎస్.కార్తీక్‌రావు(నాగర్‌కర్నూల్), అలివేలు మంగమ్మ (అయిజ), పి.నరేందర్ (వనపర్తి), హాజిరా ఖాతూన్ (మహబూబ్‌నగర్), జి.రాజీవ్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కె.వరప్రసాద్ (దేవరకద్ర), ఎ.వెంకటేశ్ (మహబూబ్‌నగర్), డి.శ్రీకాంత్‌రెడ్డి (కొత్తూరు), మహ్మద్ సాబేర్ (మహబూబ్‌నగర్), గాయత్రీ (మహబూబ్‌నగర్), ఎ.సుజాతమ్మ (నాగర్‌కర్నూల్), బి.రాజు (కేశంపేట), హెచ్.రాజగోపాల్ (మహబూబ్‌నగర్), కె.కిశోర్‌కుమార్ (ఫారూక్‌నగర్). -
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. రాజకీయ, పాలనానుభవం ఉన్న డీఎస్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని ఇదివరకే పేర్కొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఈ మేరకు ఆయనకు అంతర్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతను అప్పగిస్తూ కేబినెట్ ర్యాంకుతో ఏడాది కాలానికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారు. అధికార టీఆర్ఎస్లో చేరిన సమయంలో డీఎస్‌ను రాజ్యసభకు పంపిస్తారని, లేదంటే శాసన మండలికి పంపించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరి గింది. అయితే ముందు నుంచీ డీఎస్ ముఖ్య సలహా దారు పోస్టుకే మొగ్గు చూపారని పార్టీ వర్గాల సమాచారం. ఆయన ఆశించినట్లుగానే ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదా పదవితో డీఎస్‌కు నెలకు లక్ష రూపాయల వేతనం, రూ.50 వేల ఇంటి అద్దె అలవెన్సు, కారు అద్దె, ఇందన ఖర్చుల కోసం రూ.45 వేలు చెల్లిస్తారు. బంగారు తెలంగాణకు శ్రమిస్తా: డీఎస్ అంతర్ రాష్ట్ర సమస్యలు, వివాదాల పరిష్కారంలో సీఎం కేసీఆర్‌కు తోడుగా ఉంటానని డీఎస్ అన్నారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పారని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, వాటి కోసం కృషి చేస్తానని అన్నారు. ఏ కారణంతో తాను టీఆర్ఎస్లో చేరానో, అదే దిశలో అడుగులు వేస్తానని, బంగారు తెలంగాణ సాధనకు శ్రమిస్తానని చెప్పారు. -
సీసీఎల్ఏ కమిషనర్(అప్పీల్)గా అధర్‌సిన్హా
సాక్షి, హైదరాబాద్: సీసీఎల్ఏలో ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న అధర్‌సిన్హా హోదాను రాష్ర్టప్రభుత్వం పెంచింది. ఆయనకు కమిషనర్(అప్పీల్) బాధ్యతలను కూడా అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాధ్యతలను ఎం.దానకిషోర్‌కు అదనంగా అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న జి.వెంకటరామరెడ్డిని నీటిపారుదల శాఖ భూసేకరణ, ఆర్ఆర్ డెరైక్టర్‌గా నియమించారు. వ్యవసాయశాఖ డెరైక్టర్‌గా జి.డి. ప్రియదర్శినిని నియమించారు. అంతకుముందు ఇదే పోస్టులో ఎంవీ రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా అనితా రామచంద్రన్‌ను నియమించారు. అపార్డ్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు. -
వినయ్.. సీఎంవో..
⇒ పార్లమెంటరీ కార్యదర్శి పదవి... సీఎం కార్యాలయంలో విధులు ⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రి హోదాలో వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా పని చేయనున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి వస్తుందని భావించారు. రాష్ట్ర వ్యాప్త సమీకరణలతో ఇప్పుడు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌భాస్కర్ 2009, 2010, 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో వరంగల్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అంతకుముందు 1999, 2004 ఎన్నికల్లో హన్మకొండ(ప్రస్తుతం వరంగల్ పశ్చిమ) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2005 నుంచి టీఆర్ఎస్లో క్రియాశీలంగా పని చేస్తున్నారు. వరంగల్ నగర అధ్యక్షుడిగా ఇటీవలి సాధారణ ఎన్నికల ముందు వరకు పని చేశారు. వినయ్ డిమాండ్లు తీరాయి.. గత ఏడాది కాకతీయ ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అప్పటి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ‘తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న కాకతీయుల వారసులను ఉత్సవాలకు ఆహ్వానించాలి. రాణిరుద్రమదేవికి సంబంధించి నల్లగొండ జిల్లాల్లో ఉన్న కట్టడాలకు ప్రాధాన్యత పెం చాలి’ అని వినయ్‌భాస్కర్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉత్సవాల వేదికపైకి వెళ్లకుండా నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో కాకతీయ ఉత్సవాలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో చేసిన ప్రతిపాదనలను వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్నిం టిపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ స్థలాల్లో గడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు 120 గజాల చొప్పును క్రమబద్ధీకరించాలని వినయభాస్కర్ విజ్ఞప్తిని కేసీఆర్ ఆమోదం తెలి పారు. ప్రధానంగా దీన్‌దయాల్‌నగర్‌లో నివసిస్తున్న వారి విషయంలో వినయ్‌భాస్కర్ ఈ ప్రతిపాదనను సీఎంకు వివరించారు. తన విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై వినయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీలో ఎస్పీల బదిలీలు
24 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్స్ పొందిన ఎస్పీల్లో బయటి రాష్ట్రాలవారూ.. ‘రోస్టర్ విధానం’తో కేడర్ మారితే మరోసారి బదిలీలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 13 జిల్లాలు, మూడు అర్బన్ జిల్లాల అధికారులతోసహా 24 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 11 మంది డెరైక్ట్ ఐపీఎస్‌లు కాగా... మిగిలినవారు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు. డెరైక్ట్ అధికారుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రాష్ట్రేతర అధికారులు కూడా ఉన్నారు. వీరిలో గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్(స్వస్థలం పంజాబ్), తఫ్సీర్ ఇక్బాల్(జార్ఖండ్), ఎస్.సెంథిల్‌కుమార్(తమిళనాడు), నవీన్ గులాటి(గుజరాత్)లను నాలుగు జిల్లాలకు ఎస్పీలుగా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఐపీఎస్ అధికారుల పంపిణీకోసం ఏర్పాటైన ప్రత్యుష సిన్హా కమిటీ సిఫార్సులు మరో నెల రోజుల్లో అమల్లోకి రానున్నాయి. వీటిప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పనిచేస్తున్న రాష్ట్రేతర అధికారుల్ని రోస్టర్ పద్ధతిలో పంచుతారని తెలుస్తోంది. ఇది అమలైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న రాష్ట్రేతర అధికారులను వేరే రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేడర్లు మారితే నెల రోజుల తరువాత మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టే అవకాశముంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రధాన విజిలెన్స్ అండ్ భద్రతా అధికారిగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్‌ను చిత్తూరు ఎస్పీగా నియమించిన ప్రభుత్వం టీటీడీలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం గుంటూరు రూరల్, రాజమండ్రి అర్బన్, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారుల్ని ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి మార్చింది. -
‘కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్’ కొనసాగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా శాఖల్లో వారి అవసరం తీరే వరకు... లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు... వీటిల్లో ఏదీ ముందయితే దానిని అమలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఆర్థిక శాఖ.. మూడు నెలల పొడిగింపు మాత్రమే ఇవ్వాలంది. ఆలోగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరం నిజంగా ఉందా లేదా అన్న అంశంపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. అధికారులు మూడు నెలల కాలపరిమితికి ఫైలు పంపిం చగా.. సీఎం కె.చంద్రశేఖర్‌రావు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరిని కొనసాగించేలా కాలపరిమితి లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలి సింది. దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వంలోనే కాక గ్రామ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, డివి జన్లు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కార్యాలయాలు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యక్తిగత, కాంట్రాక్టు ఏజెన్సీలతో కుదుర్చుకునే ఒప్పం దాల కాల పరిమితి ఏడాదికి మించకుండా, నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొంటూ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
'సస్పెన్షన్ ఎత్తివేత... సచివాలయంలో పోస్టింగ్'
ఏపీఎన్జీవో సభలో తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిని సచివాలయంలోనే పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆదేశాలలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ... ఏపీఎన్జనీవోలు గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన నగరంలోని లాల్ బహద్దుర్ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన కానిస్టేబుళ్లు శ్రీనివాసగౌడ్, శ్రీశైలం ముదిరాజ్‌ల జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఇరుసభలు ఆమోదించడంతోపాటు రాష్ట్రపతి రాజముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పనులు చకచక జరిగిపోయాయి. తెలంగాణ ఆవిర్బావానికి జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రాంతానికి చెందిన కానిస్టేబుళ్లపై నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
డీజీపీ స్థాయికి సిటీ కొత్వాల్ పోస్టు
తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టుకు తాత్కాలికంగా ఎక్స్-క్యాడర్లో డీజీపీ స్థాయికి పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)లోనూ అదనపు డీజీ స్థాయిలో స్పెషల్ డెరైక్టర్ పోస్టునూ తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసింది. రెండేళ్లుగా నగర పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో డీజీపీగా పదోన్నతి పొందారు. అయినప్పటికీ అదే పోస్టులో కొనసాగుతుండటంతో సాంకేతిక కారణాలతో ఆయన జీతభత్యాల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అదనపు డీజీ స్థాయిలోనే ఉన్న ఎం.మహేందర్‌రెడ్డిని జూన్ 2న నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తారని తెలుస్తోంది. ఆ సందర్భంలో ఈ పోస్టును యథాస్థితికి తెస్తూ ప్రభుత్వం -
పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై నిషేధం
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల పదోన్నతులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యేవరకు అన్ని రకాల పదోన్నతులపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని రకాల నియామకాలతోపాటు బదిలీలు, సీనియారిటీలు, సవరణలు, ఉద్యోగుల నియామకాల నియమ నిబంధనల్లో మార్పులు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వస్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన కారణాలను పేర్కొనాలని తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందిగా స్పష్టంచేశారు.