టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు! | ITAT Restores Tax Exempt Status For Tata Trusts | Sakshi
Sakshi News home page

టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!

Published Wed, Dec 30 2020 3:35 AM | Last Updated on Wed, Dec 30 2020 3:35 AM

ITAT Restores Tax Exempt Status For Tata Trusts - Sakshi

న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ)  రూలింగ్‌ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన  ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’  ఉత్తర్వులను తోసిపుచ్చింది.  ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్‌ ప్రెసిడెంట్‌ జస్టిస్‌ పీపీ భట్, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ కుమార్‌ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. .  దీనితో రతన్‌ టాటా ట్రస్ట్, జేఆర్‌డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటాసన్స్‌లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది.  2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్‌ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్‌ పేర్కొంది.  

కేసు వివరాల్లోకి వెళితే...
మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ  ఆదాయపు పన్ను కమిషనర్‌– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్‌ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌  సైరస్‌ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్‌లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్‌లో పెట్టుబడు లు పెట్టి,  స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు.  టాటా గ్రూప్‌ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను  విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. అలాగే టాటాసన్స్‌ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది.

సైరస్‌ మిస్త్రీ ప్రవర్తన అనైతికం...
కాగా,  బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్‌ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్‌ తప్పుపట్టింది. కార్పొరేట్‌ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్‌ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ  చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్,  అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది.  2013లో టాటా సన్స్‌ చైర్మన్‌ రతన్‌ టాటా వారసునిగా సైరస్‌ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్‌ 24న గ్రూప్‌ చైర్మన్‌గా  సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ బోర్డ్‌ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే.  

టాటా ట్రస్టుల కేసుకు బలం!
కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్‌ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్‌ వద్ద విచారణలో ఉంది.

ఎయిర్‌–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా
అదనంగా 32 శాతం వాటా కొనుగోలు
ఎయిర్‌–ఏషియా ఇండియా(ఏఏఐఎల్‌)లో టాటా సన్స్‌ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్‌ఎల్‌లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్‌ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్‌ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్‌లో టాటా సన్స్‌ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్‌ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్‌–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది.  

ఎయిర్‌ ఇండియా కోసమే...!: ఎయిర్‌ ఇండియా టేకోవర్‌కు ఎయిర్‌ఏషియా ఇండియాను ఇన్వెస్ట్‌మెంట్‌ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్‌ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్‌ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్‌ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్‌ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement