Appellate Tribunal
-
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
జలన్ కల్రాక్ చేతికి జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ రుణపరిష్కార ప్రణాళికను దివాలా పరిష్కార అపీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాజాగా అనుమతించింది. జలన్ కల్రాక్ కన్సార్షియంకు కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు ఎన్సీఎల్ఏటీ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బదిలీని 90 రోజుల్లోగా పూర్తిచేయవలసిందిగా జెట్ ఎయిర్వేస్ పర్యవేక్షణ కమిటీకి సూచించింది. దీంతోపాటు పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీగా జలన్ కల్రాక్ కన్సార్షియం(జేకేసీ) చెల్లించిన రూ. 150 కోట్లను సర్దుబాటు చేయమంటూ జెట్ ఎయిర్వేస్ రుణదాతలను ఎన్సీఎల్ఏటీ బెంచ్ ఆదేశించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకి గతంలో విజయవంతమైన బిడ్డర్‌గా జేకేసీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ఎయిర్వేస్ రుణదాతలు, జేకేసీ మధ్య యాజమాన్య బదిలీపై తలెత్తిన న్యాయ వివాదాలు ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి. ఇంతక్రితం కంపెనీ రుణదాతలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా నిర్ణయాధికారాన్ని ఎన్సీఎల్ఏటీకి అప్పగించింది. ఆర్థిక సవాళ్లతో జెట్ ఎయిర్వేస్ సర్విసులు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోగా.. 2021లో జేకేసీ విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. కాగా.. కోర్టు అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళిక(రూ. 350 కోట్ల ఆర్థిక మద్దతు)లో భాగంగా జెట్ ఎయిర్వేస్కు గతేడాది జలన్ కల్రాక్ కన్సార్షియం రూ. 100 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2024)లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. -
అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తమ పారీ్టకి సంబంధించిన రూ.210 కోట్ల నిధులను స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కిందటి సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ సమరి్పంచిన ఐటీ రిటర్నుల్లో లోపాలు ఉన్నాయంటూ ఐటీ శాఖ ఆ పారీ్టకి రూ.210 కోట్ల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది. వేర్వేరు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.65 కోట్లను ఐటీ శాఖ విత్‌డ్రా చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.205 కోట్లను స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెలువరించింది. -
‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమైనా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థరహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామోజీ, చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాత పాటే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. -
డివిడెండ్ పంపిణీ పన్ను కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్ చేసిన అపీల్‌ను ఐటీఏటీ చెన్నై బెంచ్ కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ పథకంలో భాగంగా కాగ్నిజెంట్ డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది. 2017–18 అసెస్మెంట్ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్‌లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్ అపీల్‌కు వెళ్లింది. -
జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో కీలక అంశాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 17న జరగనుంది. జీఎస్టీ నిబంధనల ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం అన్నది ముఖ్యమైనది. అలాగే, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా కంపెనీల పన్ను ఎగవేతలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. జీఎస్టీ కింద నిబంధనల ఉల్లంఘనలో ప్రాసిక్యూషన్ చేపట్టే వాటి ద్రవ్య పరిమితి (కేసు విలువ) మూడు రెట్లు పెంచాలని జీఎస్టీ కౌన్సిల్‌కు సంబంధించి న్యాయ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, జీఎస్టీ ఉల్లంఘనలదారుల నుంచి వసూలు చేసే ఫీజును కూడా తగ్గించడాన్ని తేల్చనుంది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు అంశాన్ని ఈ విడత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చర్చకు చేపట్టకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రుల బృందం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉందని పేర్కొన్నాయి. -
మారుతీ సుజుకీకి ఎన్సీఎల్ఏటీలో ఊరట!
న్యూఢిల్లీ: ఆటో దిగ్గజ సంస్థ– మారుతీ సుజుకీపై కాంపిటీషన్ కమిషన్ విధించిన రూ. 200 కోట్ల జరిమానాపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్‌సీఏఎల్‌టీ సోమవారం స్టే విధించింది. అయితే జరిమానా మొత్తంలో 10 శాతం (రూ.20 కోట్లు) మూడు వారాల్లోగా డిపాజిట్ చేయాలని కార్ల తయారీ సంస్థను ఆదేశించింది. ఇదే షరతుగా కారు తయారీదారుకు అక్టోబర్ 27న జారీ చేసిన డిమాండ్ నోటీసుపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. డీలర్ల కార్ల అమ్మకం ధర విషయంలో కంపెనీ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది మారుతీ సుజుకీపై ఆరోపణ. దీనిని సమర్థిస్తూ, ఆగస్టు 23న కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కంపెనీపై రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనిని సవాలు చేస్తూ మారుతీ సుజుకీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. -
ఎన్సీఎల్ఏటీ చైర్మన్‌గా చీమా విధులు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్మన్‌గా జస్టిస్ ఏఐఎస్ చీమా యథావిధిగా శుక్రవారం విధులు నిర్వహించారు. చీమాను తాత్కాలిక చైర్మన్‌గా పేర్కొంటూ ద్విసభ్య ధర్మాసనం విచారించాల్సిన ప్రధాన కేసుల జాబితా (కాజ్ లిస్ట్) వెలువడింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అయితే ఎన్సీఎల్ఏటీ వెబ్సైట్ మాత్రం జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను తాత్కాలిక చైర్మన్‌గా పేర్కొంటూ ఆయన ఫొటోను ఫోస్ట్ చేయడం గమనార్హం. వివాదంలోకి వెళితే.. గడచిన ఒకటిన్నర సంవత్సరాలుగా ఎన్సీఎల్ఏటీకి శాశ్వత చైర్మన్ నియామకం జరగలేదు. ఎన్సీఎల్ఏటీ జ్యుడీషియల్ మెంబర్‌గా సెప్టెంబర్ 2017 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ చీమా 2021 ఏప్రిల్ 19న అధికారిక ఛైర్‌పర్సన్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. అయితే ఆయన పదవీకాలం సెప్టెంబర్ 20తో ముగిసిపోతుంది. అయితే ఈ లోపే అర్థంతరంగా ఆయనను సెప్టెంబర్ 10న కేంద్రం బాధ్యతల నుంచి తప్పించింది. 11వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను నియమించింది. దీనిని సవాలుచేస్తూ, చీమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసును విచారణకు చేపట్టింది. చైర్మన్లను తొలగించే అధికారం ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం– 2021 కింద కేంద్రానికి ఉందని కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. అలా అయితే ఆ చట్టం అమలు చేయకుండా సుమోటోగా స్టే విధిస్తామని అత్యున్నత స్థాయి ధర్మాసనం హెచ్చరించింది. దాంతో ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు అరగంట సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. అనంతరం అన్ని అధికారాలతో జస్టిస్ చీమా పదవిని పునరుద్ధరించడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. బాధ్యతల్లో నియమించిన వారిని వెంటనే తప్పించడం సబబుకాదుకనుక, జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను సెప్టెంబర్ 20వ తేదీ వరకూ సెలవుపై పంపనున్నట్లు కూడా ఆయన ధర్మాసనానికి తెలిపారు. దీనితో వివాదానికి తెరపడినట్లయ్యింది. -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్‌కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీల తీరును మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, అందుబాటులో ఉన్న ఆధారాలను పట్టించుకోకుండా ఏకపక్ష వైఖరిని అవలంభించిందని పేర్కొంది. జగతి పబ్లికేషన్స్ ఎఫ్డీఆర్ జప్తు విషయంలో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండ్‌ను హామీగా ఈడీకి సమర్పించాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. మిగిలిన ఆస్తులను వెంటనే విడుదల చేయండి ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్ జోన్‌ను కొనసాగించాలని అప్పిలెట్ ట్రిబ్యునల్ రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయంలో మాత్రం జప్తు కొనసాగుతుందని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేంత వరకు బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం గానీ, బఫర్ జోన్ ప్రాంతాన్ని అమ్మడం గానీ చేయరాదని రాంకీని ఆదేశించింది. అలాగే 16 ప్లాట్లను వెంటనే రాంకీ సంస్థకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ ప్లాట్లను విక్రయించడం గానీ, ఇందులో నిర్మాణాలు చేపట్టడం గానీ, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం గానీ చేయరాదని రాంకీకి సూచించింది. ఆరోపణల నిరూపణ బాధ్యత ఈడీదే జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను, అలాగే రాంకీ గ్రూపునకు చెందిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ జప్తును సమర్థిస్తూ ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ తాజాగా తీర్పు వెలువరించారు. ఈ మొత్తం కేసులో ప్రత్యేక కోర్టు ఇంకా అభియోగాలు నమోదు చేయలేదన్నారు. అభియోగాలను నమోదు చేయనంత వరకు వ్యక్తులపై, సంస్థలపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారో, ఆ ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉంటుందన్నారు. ఈ కేసులో రాంకీ గ్రూపు ‘కళంకిత డబ్బు’తో భూములు కొన్నట్లు ఈడీ ఆధారాలు చూపలేదని తెలిపారు. రాంకీతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని కొన్ని కీలక క్లాజులను ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విస్మరించాయని వెల్లడించారు. ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు గ్రీన్‌బెల్ట్ ఏరియాను 50 మీటర్లకు తగ్గించినందుకే రాంకీ గ్రూపు జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. అదే చార్జిషీట్ ఆధారంగానే రాంకీ, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను జప్తు చేసింది. ఆ జప్తును అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. అయితే, మనీ లాండరింగ్ కింద ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేయలేదు. సీబీఐ ఆరోపణలను ఆధారంగా చేసుకుంటూ జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మనీ లాండరింగ్ కింద తాను చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో ఈడీ విఫలమైంది. ఆ రూ.10 కోట్లు ‘లంచం’ అని ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. కేవలం అనుమానాలు, ఊహల ఆధారంగానే జగతి పబ్లికేషన్స్, రాంకీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి కోసం 18.7.2000న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. విశాఖపట్నం పరవాడలో 2,162.5 ఎకరాల్లో ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. రాంకీ గ్రూపునకు చెందిన రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ ఇండియా లిమిటెడ్ (ఆర్‌పీసీఐఎల్) ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో 12.3.2004న ఏపీఐఐసీ–ఆర్‌పీసీఐఎల్ మధ్య జాయింట్ వెంచర్ కింద ఒప్పందం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ ఒప్పందంలో గ్రీన్‌బెల్ట్ గురించి ప్రస్తావనే లేదు. అయినప్పటికీ ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు 50 మీటర్ల గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించినట్లు రాంకీ చెప్పింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఈ ఒప్పందం జరిగింది. – మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ -
రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి!
సాక్షి, అమరావతి : జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీలు పెట్టిన రూ.53 కోట్ల పెట్టుబడులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ‘లంచం’గా పరిగణించడాన్ని మనీలాండరింగ్ అప్పిలెట్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఈ పెట్టుబడులను ‘లంచం’ అని చెప్పేందుకు ప్రత్యక్ష, నిర్ధిష్టమైన, విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవని తేల్చిచెప్పింది. పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీల ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జుడికేటింగ్ అథారిటీల తీరు సరికాదంది. క్విడ్ ప్రో కో కింద లబ్ధి చేకూర్చినందుకు జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో రూ.53 కోట్లు పెట్టుబడులు పెట్టామని ఆరోపిస్తూ.. ఈడీ తమ ఆస్తులను జప్తుచేయడాన్ని సమర్థిస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ 2015లో జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెన్నా సిమెంట్స్, పయనీర్ ఇన్‌ఫ్రాలు అప్పిలెట్ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన అప్పిలెట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ ఇటీవల తన తీర్పు వెలువరించారు. అభియోగాలు నమోదు కాక ముందే.. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాక ముందే.. పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్‌ఫ్రాలు మనీలాండరింగ్ కింద ‘షెడ్యూల్డ్ నేరం’ చేశాయని అడ్జుడికేటింగ్ అథారిటీ చెప్పడాన్ని అప్పిలెట్ ట్రిబ్యునల్ తన తీర్పులో ఆక్షేపించింది. అలాగే, జప్తుచేసిన ఆస్తులు నేరానికి సంబంధించినవేనని కూడా నిర్ధారించడాన్ని తప్పుబట్టింది. అదే రీతిలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు జారీచేసిన వాటాలకు ఎటువంటి విలువ లేదన్న ఈడీ వాదనను అప్పిలెట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. బహిరంగ మార్కెట్లో ఈ వాటాల విలువ పెరిగిందన్న విషయాన్ని గుర్తుచేసింది. పెన్నా సిమెంట్స్‌కు భూముల బదలాయింపులో చట్ట నిబంధనలను అనుసరించలేదన్న ఈడీ వాదనను సైతం ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ వాదన ఎంతమాత్రం సరికాదంది. చట్ట నిబంధనలకు లోబడే భూముల బదలాయింపు జరిగిందనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలున్నాయంది. ఆస్తుల జప్తు ఖరారు ఉత్తర్వులను జారీచేసే ముందు ఈ ఆధారాలను న్యాయబద్ధంగా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. జప్తు నుంచి హోటల్ భవనం విడుదల.. ‘సీబీఐ చార్జిషీట్లో పెన్నా సిమెంట్స్ తదితరులపై ఆరోపణలున్నాయి. అయితే, మేం ఇప్పుడు వాటి జోలికి వెళ్లడంలేదు. ఈ ఆరోపణలు వాస్తవమో కాదో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేలుస్తుంది. ప్రస్తుతం మేం చూసేది ఏమిటంటే మనీలాండరింగ్ కింద ఈడీ చేసిన దర్యాప్తు, అలాగే.. ఆస్తుల జప్తునకు జారీచేసిన ఉత్తర్వులు చట్ట నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అన్నదే.’ అని అప్పిలెట్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. పెన్నా సిమెంట్స్ దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. పెన్సా సిమెంట్స్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ గడువు ముగిసిన నేపథ్యంలో అనంతపురం జిల్లా, యాడకి మండలంలో జప్తు చేసిన 231 ఎకరాల భూమిని జప్తు నుంచి విడుదల చేయడంలేదంది. అయితే, ఆ భూమిని తమ స్వాధీనంలోకి తీసుకోరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఇక పయనీర్ ఇన్ఫ్రా విషయానికొస్తే.. ఇది బంజారాహిల్స్‌లో నిర్మించిన హోటల్ భవనానికి సంబంధించి అడ్జుడికేటింగ్ అథారిటీ జారీచేసిన జప్తు ఖరారు ఉత్తర్వులను సవరించింది. ఆ భవనాన్ని జప్తు నుంచి విడుదల చేస్తూ, ఆ భవనం తాలుకు విలువను ఫిక్స్డ్ డిపాజిట్ కింద వసూలు చేసుకోవాలని ఈడీకి స్పష్టంచేసింది. రూ.6.69 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ కింద రెండు నెలల్లో ఈడీకి జమచేయాలని పయనీర్ ఇన్ఫ్రాను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈడీ ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఆ భవనంలోని అంతస్తులను విక్రయించరాదని పయనీర్ ఇన్ఫ్రాను అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ‘రూ.1.5 కోట్ల లాభం కోసం ఎవరైనా రూ.53 కోట్లు పెట్టుబడి పెడతారా! ఎలా సాధ్యమో కూడా అర్థంకాకుండా ఉంది. ఇలా పెట్టుబడి పెట్టడాన్ని లంచం అనడం ఊహకు అందనిది. ‘సాక్షి’లో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీ పెట్టుబడులు నిఖార్సైన వ్యాపార లావాదేవీలు. ఇందుకు సాక్ష్యం.. ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే సర్క్యులేషన్ పరంగా ‘సాక్షి’ రెండో అతిపెద్ద పత్రికగా ఆవిర్భవించడమే. జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏసియాలో పెన్నా సిమెంట్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీ పెట్టిన రూ.53 కోట్ల పెట్టుబడులు ‘లంచం’ అని చెప్పేందుకు ఎటువంటి ప్రత్యక్ష, నిర్ధిష్టమైన, విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవు.’ ‘పెన్నా సిమెంట్స్ కోసం అవసరమైన భూములను తీసుకునే విషయంలో రైతులను, అసైనీదారులను బలవంతం చేశారనడం శుద్ధ అబద్ధం. అంతేకాక.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాయింట్ డైరెక్టర్‌ది ఊహాతీత కట్టుకథ. ఒకవేళ అలా బలవంతం చేయడమే నిజమైతే పెన్నా సిమెంట్స్‌పై రైతులు, అసైనీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదుచేసి ఉండేవారు. అటువంటి ఫిర్యాదుగానీ, సివిల్ ప్రొసీడింగ్స్గానీ ఏవీ పెండింగ్‌లో లేవని దర్యాప్తు అధికారి ద్వారా తెలుసుకున్నాం. వాణిజ్య ఆస్తులను జప్తుచేసే ముందు ఆ ఆస్తులపై వందల మంది ఉద్యోగుల భవిష్యత్తు, జీవితాలు ఆ«ధారపడి ఉంటాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల ఇటువంటి ఆస్తుల జప్తు కొనసాగరాదు. ఇందుకు బదులు ఆ ఆస్తుల విలువను డిపాజిట్ చేయించుకోవాలి.’ ‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నది పెన్నా సిమెంట్స్, పయనీర్ ఇన్ఫ్రా హోల్డింగ్ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల నిర్ణయం. 1996లో కూడా జగన్ కంపెనీల్లో ప్రతాప్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఇందుకు మా ముందు ఆధారాలు కూడా ఉన్నాయి. మిగిలిన మీడియా కంపెనీల పురోగతిని పోల్చుకున్న తరువాతే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రతాప్‌రెడ్డి నిర్ణయించారు. జగతిలో పెట్టుబడులు పెట్టే సమయానికి ఈనాడు దినపత్రిక వాటా ఒక్కొక్కటి రూ.5.28 లక్షలుగా ఉంది. ఇదే సమయంలో జగతి పబ్లికేషన్స్ ప్రీమియం రూ.350, కార్మెల్ ఏసియా ప్రీమియం రూ.252గా ఉంది.’ ‘సీబీఐ చార్జిషీట్‌ను.. అందులో చేసిన ఆరోపణలను.. ఇంకేదైనా ఎఫ్ఐఆర్ను.. ఏదైనా నేర ఫిర్యాదును ఈడీ లేదా అడ్జుడికేటింగ్ అథారిటీలతో సహా ఏ దర్యాప్తు సంస్థ కూడా దైవిక వాస్తవం (గాస్పెల్ ట్రూత్)గా భావించడానికి వీల్లేదు. ఆ ఆరోపణలు ఇంకా చట్ట ప్రకారం న్యాయస్థానం ముందు రుజువు కాలేదన్న విషయాన్ని విస్మరించరాదు. స్వతంత్ర సంస్థగా చెబుతున్న ఈడీ.. ఆయా వ్యక్తులు, సంస్థలకు మనీలాండరింగ్‌తో సంబంధం ఉందని నిరూపించేందుకు అవసరమైన స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలను సేకరించాలి. కేవలం ఆరోపణల ఆధారంగా ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీచేయడానికి వీల్లేదు. ఆ ఆస్తులు మనీలాండరింగ్ ద్వారానే సమకూర్చారని నమ్మేందుకు కారణాలు ఉంటే తప్ప వాటిని జప్తు చేయడానికి ఏ మాత్రం వీల్లేదు.’ -
జీఎస్టీపై అప్పీళ్లకు ట్రిబ్యునల్ నేషనల్ బెంచ్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏదైనా అంశంలో వివాదం ఏర్పడితే రెండో అప్పీలు చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నది కేంద్రం ఉద్దేశం. రాష్ట్రాల స్థాయిలో భిన్న తీర్పులు వచ్చిన కేసులను సైతం జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ నేషనల్ బెంచ్ విచారిస్తుంది. ఢిల్లీలో ఏర్పాటయ్యే ఈ బెంచ్‌లో కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడు ఉంటారు. ఓ ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ నేషనల్ బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటనలో తెలియజేశారు. జీఎస్టీ విషయంలో రెండో అప్పీల్‌కు, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే పరిష్కారానికి తొలి వేదికగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీని ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ డిసెంబర్లోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ అందుకు మార్గం సుగమం చేసింది. దీనితోపాటు పలు ఇతర నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్ తీసుకుంది. జపాన్‌తో భాగస్వామ్యం ఆహార ప్రాసెసింగ్‌లో జపాన్‌తో సహకారానికి అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆహార శుద్ధి రంగంలో ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని ప్రభుత్వం పేర్కొంది. ఇరుదేశాలకూ మార్కెట్ అనుసంధానత పెరగడంతోపాటు ఈ రంగంలో ఉత్తమ విధానాలను ప్రోత్సహించేందుకు వీలుపడుతుందని వివరించింది. దేశంలో ఆహార ప్రాసెసింగ్ పెరిగేందుకు ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ ‘సార్క్’ దేశాలతో 400 మిలియన్ డాలర్ల మేర స్థిర సదుపాయంతో కరెన్సీ మార్పిడికి సంబంధించిన సవరణలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. సార్క్ ఫ్రేమ్‌వర్క్ కింద ప్రస్తుత పరిమితి మించిన సందర్భాల్లో, సభ్య దేశాల నుంచి అభ్యర్థన వచ్చినప్పుడు భారత్ సత్వరమే స్పందించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. -
డీఎల్ఎఫ్కు రూ.86 కోట్ల జరిమానా!
ముంబై: మోసపూరిత, అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు గాను రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్, దాని చైర్మన్ కె.పి.సింగ్ సహా సంస్థకు చెందిన ఏడుగురిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.52 కోట్ల జరిమానా విధించింది. ఒక సంస్థపై సెబీ ఈ స్థాయి జరిమానా విధించటం ఇదే ప్రథమం. డీఎల్ఎఫ్కు చెందిన 33 సంస్థలపై మూడు సంస్థలపై ఇదే నేరానికి గాను మరో రూ.34 కోట్ల జరిమానా కూడా విధించింది. 2007లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ సంస్థ కీలకమైన సమాచారాన్ని వెల్లడించకుండా తొక్కిపట్టిందంటూ ఆ నేరానికి గాను డీఎల్ఎఫ్ను, సంస్థకు చెందిన ఆరుగురు ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌లను మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గతేడాది అక్టోబర్‌లో నిషేధించటం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ 86 కోట్ల జరిమానా విధిస్తూ గురువారం సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేస్తామని డీఎల్ఎఫ్ పేర్కొంది. -
టెలికంకు సూపర్ బాస్!
న్యూఢిల్లీ: టెలికం, సమాచార ప్రసారాల రంగానికి ఓ సూపర్ రెగ్యులేటర్ (నియంత్రణ సంస్థ)ను ఏర్పాటు చేసే ఆలోచనలో టెలికం శాఖ ఉంది. కమ్యూనికేషన్లు, ఐటీ, మల్టీమీడియా.. ఇలాంటి రంగాలన్నింటికీ ఒకే నియంత్రణ సంస్థ ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం కమ్యూనికేషన్ల ఏకీకరణ బిల్లును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ బిల్లుకు గత ఎన్డీఏ హయాంలోనే రూపకల్పన జరిగింది. నియంత్రణ అధికారాలు, లెసైన్స్‌ల జారీ, అప్పిలేట్ ట్రిబ్యునల్ అన్నీ కలపి సూపర్ రెగ్యులేటర్ ఉండాలని ఈ బిల్లు పేర్కొంటోంది.