యాజమాన్య బదిలీకి అనుమతి
ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ రుణపరిష్కార ప్రణాళికను దివాలా పరిష్కార అపీలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) తాజాగా అనుమతించింది. జలన్ కల్రాక్ కన్సార్షియంకు కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బదిలీని 90 రోజుల్లోగా పూర్తిచేయవలసిందిగా జెట్ ఎయిర్‌వేస్ పర్యవేక్షణ కమిటీకి సూచించింది. దీంతోపాటు పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీగా జలన్ కల్రాక్ కన్సార్షియం(జేకేసీ) చెల్లించిన రూ. 150 కోట్లను సర్దుబాటు చేయమంటూ జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలను ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ ఆదేశించింది. జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకి గతంలో విజయవంతమైన బిడ్డర్‌గా జేకేసీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలు, జేకేసీ మధ్య యాజమాన్య బదిలీపై తలెత్తిన న్యాయ వివాదాలు ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి.
ఇంతక్రితం కంపెనీ రుణదాతలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా నిర్ణయాధికారాన్ని ఎన్‌సీఎల్‌ఏటీకి అప్పగించింది. ఆర్థిక సవాళ్లతో జెట్ ఎయిర్‌వేస్ సర్విసులు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోగా.. 2021లో జేకేసీ విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. కాగా.. కోర్టు అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళిక(రూ. 350 కోట్ల ఆర్థిక మద్దతు)లో భాగంగా జెట్ ఎయిర్‌వేస్‌కు గతేడాది జలన్ కల్రాక్ కన్సార్షియం రూ. 100 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2024)లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని జెట్ ఎయిర్‌వేస్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment