
చాంపియన్స్ ట్రోఫీకి 540 కోట్ల వ్యూస్
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్‌షిప్‌లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్‌లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియోహాట్‌స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇది.
ఇందులో న్యూజిల్యాండ్ మీద భారత్ గెల్చిన ఫైనల్ మ్యాచ్‌కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.
తాజా టోర్నిలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్ ల్యాంగ్వేజ్‌లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment