ఈ–టూవీలర్‌కు సబ్సిడీ రూ. 10,000 | Subsidy for e two wheeler is Rs 10000 | Sakshi
Sakshi News home page

ఈ–టూవీలర్‌కు సబ్సిడీ రూ. 10,000

Published Wed, Oct 2 2024 1:11 AM | Last Updated on Wed, Oct 2 2024 1:11 AM

Subsidy for e two wheeler is Rs 10000

కిలోవాట్‌ అవర్‌కు రూ.5,000 

పీఎం ఈ–డ్రైవ్‌కు రూ.10,900 కోట్లు 

2026 మార్చి 31 వరకు స్కీమ్‌ అమలు

న్యూఢిల్లీ: పీఎం ఈ–డ్రైవ్‌ పథకం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీలు) కొనుగోలుపై రూ.10,900 కోట్ల మేర సబ్సిడీలను కేంద్రం అందించనుంది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడమే ఈ పథకం ఉద్దేశ్యం. 2024 అక్టోబర్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెపె్టంబర్‌ 30 వరకు ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ (ఈఎంపీఎస్‌) కింద సబ్సిడీలను అందించగా.. దీని స్థానంలో పీఎం ఈ–డ్రైవ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. 24.79 లక్షల ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల త్రిచక్ర వాహనాలు, 14,208 ఈ–బస్సులకు సబ్సిడీలు అందనున్నాయి.   

సబ్సిడీలు ఇలా.. 
ఈ పథకం కింద తొలి ఏడాది కాలంలో..  ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ సామర్థ్యంపై రూ.5,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం రెండు కిలోవాట్‌ అవర్‌కు మించి ఉన్నా కానీ, ఒక ఎలక్ట్రిక్‌ టూవీలర్‌కు గరిష్టంగా రూ.10,000 వరకే సబ్సిడీ ప్రయోజనం లభిస్తుంది. రెండో ఏడాది కిలోవాట్‌ అవర్‌కు రూ.2,500కు (ఒక టూవీలర్‌కు గరిష్టంగా రూ.5,000) తగ్గిపోతుంది.

ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనం (ఈ రిక్షాలు సైతం) కొనుగోలుపై మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.12,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఎల్‌5 కేటగిరీ త్రిచక్ర వాహనాలపై మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 చొప్పు న సబ్సిడీ అందుతుంది. ఈ–ట్రక్కులకు రూ. 500 కోట్ల సబ్సిడీ కేటాయించారు. ఎలక్ట్రిక్‌ 4 చక్రాల వాహనాల కోసం 22,100 ఫాస్ట్‌ చార్జర్లు, ఈ బస్సుల కోసం 1,800 ఫాస్ట్‌ చార్జర్లు, ద్విచక్ర /త్రిచక్ర వాహనాల కోసం 48,400 ఫాస్ట్‌ చార్జర్లను ఈ పథకం కింద ఏర్పాటు చేయనున్నారు. 

ఓచర్ల రూపంలో..
పథకం ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సెక్రటరీ హనీఫ్‌ ఖురేషీ మాట్లాడుతూ.. సబ్సిడీ పొందేందుకు మొబైల్‌ యాప్‌ను తీసుకొస్తామని, దీని ద్వారా సబ్సిడీ ఈ–ఓచర్లు జారీ అవుతాయని ప్రకటించారు. ఒక ఆధార్‌ నంబర్‌పై ఒక వాహనాన్నే సబ్సిడీ ప్రయోజనానికి అనుమతిస్తున్నట్టు చెప్పారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే ఆధార్‌ ఆధారిత ఈ–ఓచర్‌ కొనుగోలుదారుకు జారీ అవుతుంది. ఈ–ఓచర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దానిపై కొనుగోలుదారు సంతకం చేసి డీలర్‌కు ఇవ్వాలి. డీలర్‌ సైతం దీనిపై సంతకం పెట్టి పీఎం ఈ–డ్రైవ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఓఈఎం (వాహన తయారీ సంస్థ) రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌కు ఈ–ఓచర్‌ అవసరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement