మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే | Pay PF, gratuity to ex-workmen, employees of Jet Airways says SC | Sakshi
Sakshi News home page

మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే

Jan 31 2023 4:14 AM | Updated on Jan 31 2023 4:14 AM

Pay PF, gratuity to ex-workmen, employees of Jet Airways says SC - Sakshi

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ కొత్త యజమాని– జలాన్‌–ఫ్రిట్ష్ కన్సార్టియంకు (మురారి లాల్‌ జలాన్‌– ఫ్లోరియన్‌ ఫ్రిచ్‌) అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌లైన్‌ మాజీ ఉద్యోగుల భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ,  నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ గత ఏడాది అక్టోబర్‌ 21వ తేదీన ఇచ్చిన రూలింగ్‌కు వ్యతిరేకంగా కన్సార్టియం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించలేదు.

‘‘ఎవరైనా ఏదైనా డీల్‌లో అడుగుపెడుతున్నప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుసుకుంటారు.  చెల్లించని కార్మికుల బకాయిలకు ఎల్లప్పుడూ  ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉండాలి. క్షమించండి, మేము ట్రిబ్యునల్‌ తీర్పులో జోక్యం చేసుకోవడం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్‌ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.  

కన్సార్టియం వాదన ఇది...
కన్సార్టియం తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ సౌరభ్‌ కిర్పాల్‌ తన వాదనలు వినిపిస్తూ, కన్సార్టియంకు అందించిన సమాచార పత్రంలో (ఇన్ఫర్మేషన్‌ మెమోరాండమ్‌) కార్పొరేట్‌ రుణగ్రహీత (జెట్‌ ఎయిర్‌వేస్‌) భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలను పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బకాయిల కింద ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానయాన సంస్థను పునరుద్ధరించడం కష్టమని అన్నారు. ఒకసారి ఆమోదించిన తర్వాత రిజల్యూషన్‌ ప్లాన్‌ను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు.  

ఈ తరహా ఉద్యోగులకు ఆశాకిరణం
సుప్రీం రూలింగ్‌తో జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఉద్యోగుల్లో  హర్షం వ్యక్తం అవుతోంది. కన్సార్టియం అప్పీల్‌కు వెళుతుందన్న అభిప్రాయంతో  జెట్‌ ఎయిర్‌వేస్‌ అగ్రివ్డ్‌ (బాధిత) వర్క్‌మెన్‌ అసోసియేషన్‌ (ఏఏడబ్ల్యూజేఏ) సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌  సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ భట్నాగర్, న్యాయవాది స్వర్ణేందు ఛటర్జీ తమ వాదనలు వినిపించారు. ‘‘ఈ ఉత్తర్వు ఈ వివాదంలో మార్గనిర్దేశం చేయడమే కాదు, ఈ రకమైన వ్యాజ్యాలలో చిక్కుకున్న ఈ తరహా కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది ఒక  ఆశాకిరణం’’ అని అడ్వకేట్‌ ఛటర్జీ విలేకరులతో అన్నారు.

రికార్డ్‌ తేదీ... 2019 జూన్‌ 20
ఆర్థిక సంక్షోభం కారణంగా 2019 ప్రారంభంలో కార్యకలాపాలను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం బిడ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా జలాన్‌–ఫ్రిట్ష్ కన్సార్టియం గెలుచుకుంది. విమానయాన సంస్థ ఇప్పుడు తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులందరికీ పూర్తి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లించాలి. ఈ లెక్కలకు 2019 జూన్‌ 20 వరకు తేదీని (దివాలాకు సంబంధించి అడ్మిషన్‌ తేదీ వరకు) పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీం రూలింగ్‌తో ప్రయోజనం పొందుతున్న వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్మికులు, ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్లు, ఆఫీసర్స్‌ అండ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ సభ్యులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement