న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment