review petitions
-
నిర్భయ.. ఉరి ఎందుకు నిలిపేశారు?
నిర్భయ దోషులకు జనవరి 22న ఉరి అన్నారు. వాయిదా వేశారు. ఫిబ్రవరి 1న ఉరి అన్నారు. మళ్లీ వాయిదా వేశారు. చివరికి ఉరి అమలునే నిలిపేశారు. ఎందుకు నిలిపేశారు? ఉరి అమలును పూర్తిగా నిలిపి వేయడం కాదు. జనవరి 22న ఉరి అని సుప్రీంకోర్టు తొలి డెత్ వారెంట్ ఇచ్చాక.. నాటి నుంచీ దోషులు అందరూ ఒకేసారి కాకుండా ఒకరొకరుగా వేసుకుంటూ వస్తున్న పిటిషన్లను పరిశీలించి తీరాలి కనుక అవన్నీ పూర్తయ్యే వరకు చట్టరీత్యా ఉరి అమలు సాధ్యం కాదు. అదే విషయాన్ని బుధవారం ఢిల్లీ హై కోర్టు కూడా స్పష్టం చేసింది. మరి పిటిషన్ల పరిశీలన పూర్తవకుండానే ఫిబ్రవరి 1 అని మరో డెత్ వారెంట్ ఎందుకు ఇచ్చినట్లు? దోషుల తరఫు లాయర్లు ఎప్పటికప్పుడు కొత్తగా పిటిషన్లు వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 1) ఉరి తీస్తారనగా రెండు రోజుల ముందు.. గురువారం.. నలుగురు దోషులలో ముగ్గురైన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్త తరఫు లాయర్ ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అప్పటికి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెడింగులో ఉంది. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తలు కూడా తమకున్న చట్టపరమైన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోలేదు. కాబట్టి ఉరి అమలును నిలిపి వేయాలని లాయర్ కోరారు. కోర్టు సమ్మతించింది. ఉరికి కొత్త తేదీ చెప్పేవరకు ఉరి అమలును నిలిపి వేయాలని తీర్పు ఇచ్చింది. ఉరి తీసే తేదీ ఇచ్చాక కూడా మళ్లీ వారికి చట్టపరమైన అవకాశాలు ఇవ్వడం ఎందుకు? చట్టంలోనే అలా ఉంది. ఉరి తీసే ముందు ‘నీ చివరి కోరిక ఏమిటి?’ అని అడుగుతారని అంటారు. ఆ అడగడం నిజమో కాదో కానీ.. డెత్ వారెంట్ వచ్చాక (ఉరి తేదీ వచ్చాక) కూడా.. తమను ఎందుకు ఉరి తియ్యకూడదో చెప్పుకునే, క్షమాభిక్ష కోరుకునే అవకాశాన్ని చట్టం దోషులకు కల్పిస్తోంది. మరణశిక్ష పడిన ప్రతి దోషికీ మూడు అవకాశాలు ఉంటాయి. ఆ మూడు అవకాశాలూ.. ఒకటి నిష్ఫలం అయితే ఇంకొకటి అన్నట్లుగా దోషికి ఉపకరిస్తాయి. ఏమిటా మూడు అవకాశాలు? మొదటిది రివ్యూ పిటిషన్. ఉరి విధింపును తిరిగి పరిశీలించమని కోర్టును కోరడం. రెండోది క్యురేటివ్ పిటిషన్. ఉరి విధింపునకు దారి తీసిన వాదనల వల్ల తమకు న్యాయం జరగలేదని కోర్టుకు చెప్పుకోవడం. మూడోది క్షమాభిక్ష పెట్టమని రాష్ట్రపతిని వేడుకోవడం. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని అవకాశాలు ఉపయోగించుకున్నారు? ముఖేశ్, వినయ్, అక్షయ్‌లు పూర్తిగా వినియోగించుకున్నారు. పవన్ గుప్తా ఇంతవరకు రివ్యూ పిటిషన్ తప్ప క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ వెయ్యలేదు. -
అయోధ్య తీర్పుపై 6 రివ్యూ పిటిషన్లు
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర్ ఎంఆర్ శంషాద్ ద్వారా శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు. కాగా, అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్ 6వ తేదీని బ్లాక్ డేగా వ్యవహరిస్తూండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. -
రాఫెల్ డీల్ : కేంద్రానికి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చినట్టైంది. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణప పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. రాహుల్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. కాగా ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. -
సుప్రీంకోర్టులో 22 మంది విపక్షప్రతినిధుల రివ్యూ పిటిషన్
-
రఫేల్ రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
రఫేల్‌పై రివ్యూ పిటిషన్ల విచారణకు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో తాను ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్ల బహిరంగ విచారణకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. రివ్యూ పిటిషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌నూ సర్వోన్నత న్యాయస్ధానం విచారిస్తుంది. రివ్యూ పిటిషన్లలో మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరిల పిటిషన్ ఒకటి కాగా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ మరొకటి సుప్రీం ముందుకు రానున్నాయి. రికార్డుల్లో ఉన్న తప్పిదాల ఆధారంగా, ఈ అంశంలో ముందుకొచ్చిన అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సరైన న్యాయం జరగలేదని గత ఉత్తర్వులను తప్పుపడుతూ సిన్హా, శౌరి, భూషణ్‌లు తమ రివ్యూ పిటిషన్లలో పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై విచారణ అవసరం లేదంటూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం జారీ చేసిన తీర్పును సమీక్షించడంతో పాటు తమ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణ చేపట్టాలని వారు కోరారు. ఇక ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సైతం రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను గత ఏడాది డిసెంబర్ 14న సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చుతూ ఈ ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీ లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు చేపట్టింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్ సర్వీస్ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కే పరాశరన్ విజ్ఞప్తి చేశారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా రుతుక్రమం కలిగిన స్త్రీలను ఆలయంలోకి అనుమతించడం లేదని, ఇది అంటరానితనం కిందకు రాదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రివ్యూ పిటిషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా కోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ల రూపంలో కేసును తిరిగి చేపట్టలేరని పేర్కొన్నారు. మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమాన హక్కును నిరాకరించే పద్ధతి ఏదైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్ధమని, సుప్రీం ఉత్తర్వులను గౌరవించాలని, సమీక్షించాలని కోరరాదని తాము నిర్ణయం తీసుకున్నామని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు న్యాయవాది రాకేష్ ద్వివేది సుప్రీం బెంచ్‌కు నివేదించారు. ఇది విస్తృత ప్రజాబాహుళ్యానికి సంబంధించిన అలంశం కాదని, ఓ వర్గం అంతర్గత వ్యవహారమని, వారి విశ్వాసానికి సంబంధించినదని సీనియర్ న్యాయవాది శేఖర్ నపాడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మతపరమైన పద్ధతులను ఎవరూ నిర్ధేశించలేరని, ఆ వర్గానికి చెందిన సభ్యులే దాన్ని నిర్ణయిస్తారని, సుప్రీం తీర్పు అనంతరం కేరళలో నెలకొన్న సామాజిక అశాంతిని మనమంతా టీవీల్లో చూశామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
శబరిమల తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ
-
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తీర్పుపై రివ్యూ పిటిషన్లు
-
‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్, నాయర్ సర్వీస్ సొసైటీలు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. ‘సంతానం పొందగలిగే మహిళలపై తన ధ్యాస మళ్లకూడదని అయ్యస్వామి కోరుకున్నారు. శాస్త్రీయ, హేతుబద్ధ కారణాల పేరు చెబుతూ మత విశ్వాసాలలో జోక్యం చేసుకోవడం సరికాదు. ఇటీవల శబరిమలపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో మహిళల రుతుస్రావంపై నెలకొన్న భయాలు, నమ్మకాలు తొలగిపోయాయనడం నిజం కాదు. టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే, వార్తల్లో నిలిచేందుకు ఆరాటపడే మోసగాళ్లు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అంగీకరించదగ్గది కాదు’ అని అయ్యప్ప అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజా విజయన్ పిటిషన్లో తెలిపారు. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి అనీ, అందువల్లే ఆయన ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు ప్రవేశం లేదని నాయర్ సర్వీస్ సొసైటీ తెలిపింది. దీన్ని మహిళల ప్రవేశంపై నిషేధంగా పరిగణించరాదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు పొరపాటుపడిందని పిటిషన్లో పేర్కొంది. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యత, లౌకికతత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. -
విస్తృత ధర్మాసనానికి హైకోర్టు విభజన తీర్పు
రెండు ప్రశ్నలను లేవనెత్తిన ద్విసభ్య ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను హైకోర్టు గురువారం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఈ సందర్భంగా ధర్మాసనం రెండు ప్రశ్నలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 31 (2) కింద రాష్ట్రపతికున్న అధికారాలను నియంత్రించేలా గత తీర్పు ఉందా? ఇందుకు సంబంధించి ఆ తీర్పులో లోపాలున్నాయా? ఇక.. 2014, 1956 విభజన చట్టాల్లోని పదజాలం పరస్పర భిన్నంగా ఉన్న నేపథ్యంలో అసలు హైకోర్టు ‘ప్రధాన కేంద్రం’ అంటే అర్థం ఏమిటి? అన్న ఈ ప్రశ్నలను విస్తృత ధర్మాసనం ముందుంచింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగినా కూడా హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంపైనే ఉండాలని తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టును తెలంగాణ భూభాగంపై ఏర్పాటు చేసేందుకు చట్టం అనుమతించడం లేదంది. అయితే ఈ తీర్పు ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసే స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో రాష్ట్రపతి అధికారాలను నియంత్రించేలా ఉందని, అందువల్ల దానిని పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవీందర్‌రెడ్డి అనే న్యాయవాది వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని తీర్పును వాయిదా వేసి గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. ‘రివ్యూ పిటిషన్లలో లేవనెత్తిన అంశాల్లో విస్తృత ప్రయోజనాలున్నాయి. 2014 పునర్విభజన చట్టాన్ని అనుసరించి ప్రధాన పిటిషన్లలో ఉభయ పక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాటిని అప్పటి ధర్మాసనం తన ప్రధాన తీర్పులో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనం విచారించడమే మేలని మేం అభిప్రాయపడుతున్నాం’ అని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు కాపీని విస్తృత ధర్మాసనం ఏర్పాటు నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
మరణశిక్ష-మానవీయత!
ఉరిశిక్ష ఉండాలా వద్దా అనే మీమాంస సంగతలా ఉంచి...ఆ శిక్ష పడినవారి విషయంలో అనుసరించాల్సిన విధానంపై చాన్నాళ్లుగా ఉన్న వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఇకనుంచి అలాంటి ఖైదీలు దాఖలు చేసుకునే రివ్యూ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజారిటీతో మంగళవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీల రివ్యూ పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బహిరంగ కోర్టులో విచారించాల్సి ఉంటుంది. శిక్షపడిన ఖైదీ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదికి అరగంట వ్యవధినివ్వాలనివ్వాల్సి ఉంటుంది. ‘అరుదైనవాటిలో అత్యంత అరుదైన’ నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించాలన్నది మన న్యాయస్థానాలు అనుసరిస్తున్న విధానం. కింది కోర్టులు విచారణ జరిపి విధించే ఇలాంటి శిక్షలపై ఉన్నత న్యాయస్థానాలు సమీక్షిస్తాయి. వాటిని ఖరారు చేయడం లేదా యావజ్జీవ శిక్షలుగా మార్చడం చేస్తాయి. అయితే, మరణశిక్ష ఖరారైన ఖైదీలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసుకున్న సందర్భాల్లో వాటిని న్యాయమూర్తులు తమ ఛాంబర్లలోనే పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవడం దాదాపు ఆరు దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం. ఈ విషయంలోనే మానవ హక్కుల ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒకసారి సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ పూర్తయిన కేసులపై రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు దానిపై మళ్లీ మళ్లీ విచారించడం, ఖైదీ తరఫు న్యాయవాది వాదనలు వినడంవంటివి అవసరం లేదని... కేసులోని ప్రధానాంశాలను స్థూలంగా పరిశీలించి న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకోవచ్చునన్న దృక్పథమే ఇంతవరకూ అనుసరించిన సంప్రదాయానికి ప్రాతిపదిక. అయితే, రెగ్యులర్‌గా సాగే విచారణల్లో వెల్లడికాని అనేకానేక అంశాలు అనంతరకాలంలో బయటపడటానికి అవకాశం ఎప్పుడూ ఉంటుందని... అలాగే, విచారణ జరిపిన ధర్మాసనం సైతం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఏర్పడవచ్చునని మానవహక్కుల ఉద్యమ కారులు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఇవన్నీ రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో ప్రస్తావనకొస్తే మరణశిక్ష పడిన ఖైదీకి చివరి నిమిషంలో ఉపశమనం లభించే అవకాశం ఉండవచ్చన్నది వారి అభిప్రాయం. నేరస్తుడిగా ఖరారైన వ్యక్తిని చట్టబద్ధంగా ఉరితీసి శాశ్వతంగా అతని జీవితానికి ముగింపు పలుకుతున్నప్పుడు అందుకు సంబంధించి ఇచ్చే తీర్పు నిర్దుష్టమైనదిగా ఉండవలసిన అవసరం లేదా అన్నది వారి ప్రశ్న. ఒక మనిషికి నేరంలో ప్రమేయం ఉన్నదా, లేదా...ఉంటే అది ఏ మేరకు అనే విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలుంటాయి. ఇందిరాగాంధీ హత్య కేసులో మరణశిక్ష అమలైన కేహార్‌సింగ్ విషయంలో ఈ రకమైన వాదనలు బలంగా వినబడ్డాయి. ఆయనను దోషిగా నిర్ధారించడంలో ధర్మాసనం అవగాహనాలోపం ఉన్నదని మానవహక్కుల కార్యకర్తలు విమర్శించారు. నిరుడు ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలైన ఉగ్రవాది అఫ్జల్‌గురు విషయంలోనూ ఈ తరహా వాదనలే వినిపించాయి. పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అతని ప్రమేయాన్ని తిరుగులేనివిధంగా రుజువుచేయగల సాక్ష్యాధారాలేవీ లేవని ఆయన తరఫు న్యాయవాదులన్నారు. బహుశా వారి రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి సమగ్ర విచారణ జరిపి, వారి తరఫు న్యాయవాదులు లేవనెత్తుతున్న అంశాలను పరిశీలించి తీర్పు ఇస్తే ఇలాంటి అభిప్రాయాలకు చోటుండేది కాదేమో! ఇక్కడ చాన్నాళ్లక్రితం వచ్చిన అమెరికన్ చిత్రం ‘ట్వెల్వ్ యాంగ్రీమెన్’ గురించి చెప్పుకోవాలి. ఒక హత్య కేసు నిందితుడి దోషిత్వం విషయంలో జ్యూరీ సభ్యులమధ్య సాగిన వాదప్రతివాదాలు ఆ చిత్రం ఇతివృత్తం. ఒక వ్యక్తిని నిర్దోషిగా భావించడానికి ఎన్ని అవకాశాలుంటాయో ఆ చిత్రం చూపుతుంది. మరణశిక్షపై వాదోపవాదాలు ఈనాటివి కావు. అది అమానుషమైనదని, దాన్ని కొనసాగించడమంటే మానవ హక్కును నిరాకరించడమేకాక జీవించే హక్కును కాలరాయడమని మానవహక్కుల ఉద్యమకారులంటారు. నేరం చేసే వ్యక్తికి విచక్షణా జ్ఞానం లోపించినంత మాత్రాన వ్యవస్థ సైతం అదే తోవన వెళ్లాల్సిన అవసరం లేదని వారు వాదిస్తారు. ప్రపంచంలో 139 దేశాలు మరణశిక్షలను తొలగించాయి. మరికొన్ని దేశాలు ఆ శిక్షల అమలును నిలిపేశాయి. ఈ తరహా అమానుష శిక్షలను రద్దు చేయాలని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, అత్యంత కఠినమైన శిక్షలుంటాయన్న భయం నేరస్తులకు ఉంటే తప్ప దారుణ అకృత్యాలు తగ్గవని ఆ శిక్షను సమర్థించేవారు వాదిస్తారు. మరణశిక్షను రద్దుచేసిన దేశాల్లో నేరాలు పెరిగిన దాఖలాలేదని మానవ హక్కుల ఉద్యమకారులు చెబుతారు. ఈ వాదప్రతివాదాల సంగతి అలావుంచితే ఉరిశిక్షపడినవారి విషయంలో సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న విధానంకంటే మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం భావించింది. శిక్షపడినవారు దాఖలు చేసే పిటిషన్ సమగ్రంగా ఉండకపోవచ్చునని, నిపుణుడైన న్యాయవాది మౌఖికంగా చేసే వాదనలు సమర్ధవంతంగా ఉండి కేసులో దోషిత్వ నిర్ధారణలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. స్వభావరీత్యా మరణశిక్ష అనేది ఒకసారంటూ అమలు చేశాక తిరగదోడటానికి వీల్లేనిది గనుక ఆ శిక్ష విధింపు విషయంలో అత్యంత జాగురూకతతో, మానవీయతతో మెలగాలన్నదే సుప్రీంకోర్టు తాజా తీర్పు సారాంశం. ఈ తీర్పుతో జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ ఔన్నత్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి చాటిచెప్పింది.