న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్, నాయర్ సర్వీస్ సొసైటీలు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. ‘సంతానం పొందగలిగే మహిళలపై తన ధ్యాస మళ్లకూడదని అయ్యస్వామి కోరుకున్నారు.
శాస్త్రీయ, హేతుబద్ధ కారణాల పేరు చెబుతూ మత విశ్వాసాలలో జోక్యం చేసుకోవడం సరికాదు. ఇటీవల శబరిమలపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో మహిళల రుతుస్రావంపై నెలకొన్న భయాలు, నమ్మకాలు తొలగిపోయాయనడం నిజం కాదు. టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే, వార్తల్లో నిలిచేందుకు ఆరాటపడే మోసగాళ్లు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అంగీకరించదగ్గది కాదు’ అని అయ్యప్ప అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజా విజయన్ పిటిషన్‌లో తెలిపారు.
అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి అనీ, అందువల్లే ఆయన ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు ప్రవేశం లేదని నాయర్ సర్వీస్ సొసైటీ తెలిపింది. దీన్ని మహిళల ప్రవేశంపై నిషేధంగా పరిగణించరాదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు పొరపాటుపడిందని పిటిషన్‌లో పేర్కొంది. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యత, లౌకికతత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment