![BJP holds protests against women's entry in Sabarimala temple - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/16/THIRU1.jpg.webp?itok=Hh46sF2d)
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలనూ అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కేరళలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పత్తనంమిట్ట జిల్లా పండాలం నుంచి గత వారం బీజేపీ నేతలు ప్రారంభించిన పాదయాత్ర 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తిరువనంతపురం చేరింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించగా.. బీజేపీ కార్యకర్తలు, భక్తులతోపాటు ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు అయ్యప్పస్వామి చిత్రాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని, కీర్తనలు ఆలపిస్తూ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు.
ర్యాలీకి ముందు వరుసలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైతోపాటు ఇటీవల ఆ పార్టీలో చేరిన నటుడు సురేష్ గోపీ, భారతీయ ధర్మ జన సేన అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లి ఉన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై 24 గంటల్లోగా స్పందించకుంటే నిరసనలు మరింత తీవ్రరూపం దాలుస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కేరళ ప్రభుత్వానికి విషమ పరీక్షగా మారింది. మరోవైపు, శబరిమల ఆలయ ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ మంగళవారం సమావేశం కానుంది. వార్షిక మండలమ్–మకరవిలక్కు యాత్ర ఏర్పాట్లతోపాటు సుప్రీంకోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment