తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ్లీ వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన మంగళవారం(జనవరి14) సాయంత్రం 6గంటల 44 నిమిషాలకు కేరళలోని శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్పస్వామిని తిరువాభవరణలతో అలంకరించారు.
జ్యోతి దర్శనానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్‌టాప్, సన్నిధానం సహా పలు చోట్ల భక్తుల కోసం వ్యూపాయింట్‌లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు లక్షన్నర మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించినట్లు సమాచారం. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది.
పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. .
ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి లేదా మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment