నిర్భయ.. ఉరి ఎందుకు నిలిపేశారు? | Some Facts About Nirbhaya Convicts | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి

Published Fri, Feb 7 2020 12:40 AM | Last Updated on Fri, Feb 7 2020 4:06 AM

Some Facts About Nirbhaya Convicts - Sakshi

నిర్భయ దోషులకు జనవరి 22న ఉరి అన్నారు. వాయిదా వేశారు. ఫిబ్రవరి 1న ఉరి అన్నారు. మళ్లీ వాయిదా వేశారు. చివరికి ఉరి అమలునే నిలిపేశారు. ఎందుకు నిలిపేశారు?
ఉరి అమలును పూర్తిగా నిలిపి వేయడం కాదు. జనవరి 22న ఉరి అని సుప్రీంకోర్టు తొలి డెత్‌ వారెంట్‌ ఇచ్చాక.. నాటి నుంచీ దోషులు అందరూ ఒకేసారి కాకుండా ఒకరొకరుగా వేసుకుంటూ వస్తున్న పిటిషన్‌లను పరిశీలించి తీరాలి కనుక అవన్నీ పూర్తయ్యే వరకు చట్టరీత్యా ఉరి అమలు సాధ్యం కాదు. అదే విషయాన్ని బుధవారం ఢిల్లీ హై కోర్టు కూడా స్పష్టం చేసింది.

మరి పిటిషన్‌ల పరిశీలన పూర్తవకుండానే ఫిబ్రవరి 1 అని మరో డెత్‌ వారెంట్‌ ఎందుకు ఇచ్చినట్లు? 
దోషుల తరఫు లాయర్లు ఎప్పటికప్పుడు కొత్తగా పిటిషన్‌లు వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 1) ఉరి తీస్తారనగా రెండు రోజుల ముందు.. గురువారం.. నలుగురు దోషులలో ముగ్గురైన అక్షయ్‌ ఠాకూర్, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్త తరఫు లాయర్‌ ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు. అప్పటికి వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి దగ్గర పెడింగులో ఉంది. అక్షయ్‌ ఠాకూర్, పవన్‌ గుప్తలు కూడా తమకున్న చట్టపరమైన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోలేదు. కాబట్టి ఉరి అమలును నిలిపి వేయాలని లాయర్‌ కోరారు. కోర్టు సమ్మతించింది. ఉరికి కొత్త తేదీ చెప్పేవరకు ఉరి అమలును నిలిపి వేయాలని తీర్పు ఇచ్చింది.

ఉరి తీసే తేదీ ఇచ్చాక కూడా మళ్లీ వారికి చట్టపరమైన అవకాశాలు ఇవ్వడం ఎందుకు?
చట్టంలోనే అలా ఉంది. ఉరి తీసే ముందు ‘నీ చివరి కోరిక ఏమిటి?’ అని అడుగుతారని అంటారు. ఆ అడగడం నిజమో కాదో కానీ.. డెత్‌ వారెంట్‌ వచ్చాక (ఉరి తేదీ వచ్చాక) కూడా.. తమను ఎందుకు ఉరి తియ్యకూడదో చెప్పుకునే,  క్షమాభిక్ష కోరుకునే అవకాశాన్ని చట్టం దోషులకు కల్పిస్తోంది. మరణశిక్ష పడిన ప్రతి దోషికీ మూడు అవకాశాలు ఉంటాయి. ఆ మూడు అవకాశాలూ.. ఒకటి నిష్ఫలం అయితే ఇంకొకటి అన్నట్లుగా దోషికి ఉపకరిస్తాయి.

ఏమిటా మూడు అవకాశాలు?
మొదటిది రివ్యూ పిటిషన్‌. ఉరి విధింపును తిరిగి పరిశీలించమని కోర్టును కోరడం. రెండోది క్యురేటివ్‌ పిటిషన్‌. ఉరి విధింపునకు దారి తీసిన వాదనల వల్ల తమకు న్యాయం జరగలేదని కోర్టుకు చెప్పుకోవడం. మూడోది క్షమాభిక్ష పెట్టమని రాష్ట్రపతిని వేడుకోవడం. 

ఇప్పటి వరకు ఎవరు ఎన్ని అవకాశాలు ఉపయోగించుకున్నారు?
ముఖేశ్, వినయ్, అక్షయ్‌లు పూర్తిగా వినియోగించుకున్నారు. పవన్‌ గుప్తా ఇంతవరకు రివ్యూ పిటిషన్‌ తప్ప క్యురేటివ్‌ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్‌ వెయ్యలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement