సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో తాను ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్ల బహిరంగ విచారణకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. రివ్యూ పిటిషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌నూ సర్వోన్నత న్యాయస్ధానం విచారిస్తుంది. రివ్యూ పిటిషన్లలో మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరిల పిటిషన్ ఒకటి కాగా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ మరొకటి సుప్రీం ముందుకు రానున్నాయి.
రికార్డుల్లో ఉన్న తప్పిదాల ఆధారంగా, ఈ అంశంలో ముందుకొచ్చిన అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సరైన న్యాయం జరగలేదని గత ఉత్తర్వులను తప్పుపడుతూ సిన్హా, శౌరి, భూషణ్‌లు తమ రివ్యూ పిటిషన్లలో పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై విచారణ అవసరం లేదంటూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం జారీ చేసిన తీర్పును సమీక్షించడంతో పాటు తమ పిటిషన్‌లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణ చేపట్టాలని వారు కోరారు.
ఇక ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సైతం రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను గత ఏడాది డిసెంబర్ 14న సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చుతూ ఈ ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీ లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment