విస్తృత ధర్మాసనానికి హైకోర్టు విభజన తీర్పు
రెండు ప్రశ్నలను లేవనెత్తిన ద్విసభ్య ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను హైకోర్టు గురువారం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఈ సందర్భంగా ధర్మాసనం రెండు ప్రశ్నలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 31 (2) కింద రాష్ట్రపతికున్న అధికారాలను నియంత్రించేలా గత తీర్పు ఉందా? ఇందుకు సంబంధించి ఆ తీర్పులో లోపాలున్నాయా? ఇక.. 2014, 1956 విభజన చట్టాల్లోని పదజాలం పరస్పర భిన్నంగా ఉన్న నేపథ్యంలో అసలు హైకోర్టు ‘ప్రధాన కేంద్రం’ అంటే అర్థం ఏమిటి?
అన్న ఈ ప్రశ్నలను విస్తృత ధర్మాసనం ముందుంచింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగినా కూడా హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంపైనే ఉండాలని తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టును తెలంగాణ భూభాగంపై ఏర్పాటు చేసేందుకు చట్టం అనుమతించడం లేదంది.
అయితే ఈ తీర్పు ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసే స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో రాష్ట్రపతి అధికారాలను నియంత్రించేలా ఉందని, అందువల్ల దానిని పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవీందర్‌రెడ్డి అనే న్యాయవాది వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని తీర్పును వాయిదా వేసి గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. ‘రివ్యూ పిటిషన్లలో లేవనెత్తిన అంశాల్లో విస్తృత ప్రయోజనాలున్నాయి.
2014 పునర్విభజన చట్టాన్ని అనుసరించి ప్రధాన పిటిషన్‌లలో ఉభయ పక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాటిని అప్పటి ధర్మాసనం తన ప్రధాన తీర్పులో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనం విచారించడమే మేలని మేం అభిప్రాయపడుతున్నాం’ అని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు కాపీని విస్తృత ధర్మాసనం ఏర్పాటు నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.