ఎన్నికల వేళ సందడి చేసిన కులగణన వాదం ఆ తర్వాత కూడా చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని వెలువరించిన తీర్పు ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ తీర్పును అమలుపరచడానికి రాష్ట్రాలు వేటికవి తమ ప్రాంతాల్లో కులగణన చేస్తే కుదరదు.
కేంద్రం మాత్రమే జనాభా లెక్కల్లో భాగంగా ఈ పని చేయాలి. లేదంటే కోర్టులో కొత్త వివాదాలు తలెత్తుతాయి. అయితే రిజర్వేషన్ల వల్ల అత్యధిక ప్రయోజనం పొందుతున్న కులాలవారూ, అలాగే స్థానికంగా బలంగా ఉన్న రిజర్వేషన్ వెలుపల ఉన్న శూద్ర కులాలవారూ కులగణనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోతే ఆ విభజన న్యాయబద్ధ ఆబ్జెక్టివ్‌గా తేల్చిన జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలని కూడా తేల్చి చెప్పింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇటువంటి లెక్కలు రాష్ట్రాలు కమిషన్ల ద్వారానో, లేదా స్వంత రాష్ట్రస్థాయి జనాభా గణన చేపట్టి చెయ్యలేరు.
ఏ కేంద్ర ప్రభుత్వమైతే సుప్రీంకోర్టు ముందు ఉపకులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ పంపకం అవసరమే అని ఒప్పుకుందో... ఆ ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో కులాల వారీగా జనాభా లెక్కలు తీయించే వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జడ్జిమెంట్ అమలుకు పూనుకోలేదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్ర ఉపకులాల లెక్కలు తీయించి, ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ విభజిస్తే ఆ విభజన మళ్లీ హైకోర్టులో ఉపకుల లెక్కల యాక్యురసీ (కచ్చితత్వం) కొట్టివేయబడుతుంది. చివరకు సుప్రీంకోర్టుకు పోయినా అదే సమస్య ఎదురవుతుంది.
ఇది ఎస్సీ, ఎస్టీల సమస్య మాత్రమే కాదు...
ఇప్పటికే ఉప కులాల లెక్కలు తీసిన బిహార్ రిజర్వేషన్ విభజన, పెంపుదలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల ఉపకుల న్యాయపర విభజన కేవలం ఎస్సీలకో, ఎస్టీలకో సంబంధించింది మాత్రమే కాదు. ఓబీసీ కులాల్లో అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఉపకులాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు, సీట్లు రావడం లేదని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ, మాల కులాలకో; కోయ, గోండు, చెంచు, లంబాడాల మధ్య విభజనకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిమితమై లేదు.
బీసీ కులాల్లో ఉన్న ఏబీసీడీ గ్రూపుల్లో చాలా ఉప కులాలున్నాయి. డీ గ్రూపులో గొల్ల– యాదవులకు... మున్నూరు కాపులకు దొరికే అవకాశాలు దొరకడం లేదనీ, బీ గ్రూపులో కురుమలకు తమ వాటా తమకు దొరకడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే వాళ్ళు తమ కులాన్ని సెమీ–నొమాడిక్ కమ్యూనిటీ (అర్ధ సంచార జాతి) లోకి మార్చాలని డిమాండ్ ఉంది.
మహారాష్ట్రలో ధనగర్‌లు (గొర్రెల కాపర్లు) చాలా ఉద్యమాలు నడిపి తమ కులానికి మొత్తం ఓబీసీ రిజర్వేషన్‌లో 3 శాతం వాటా సంపాదించుకున్నారు. అక్కడి మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. కోర్టులు అందుకు అంగీకరించనందున తమకు కుంబి కులసర్టిఫికెట్లు ఇచ్చి రిజర్వేషన్లోకి చొప్పించండి అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. గుజరాత్‌లో పటేళ్లు (పాటీదార్లు) తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉపకుల రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా ఈ అన్ని రకాల డిమాండ్లకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.
2024 ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉపకులాలకు ‘మీ వాటా మీకు ఇప్పిస్తామని’ వాగ్దానం చేసింది. ప్రధానమంత్రి స్వయంగా ఆ మీటింగులో పాల్గొన్నారు. కానీ జాతీయ స్థాయిలో కుల గణన చేయించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్... 1931 నాటి జనాభా లెక్కల్లో చేసినట్లు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా చెయ్యాల్సిన అవసరాన్ని కేంద్రం ముందు పెట్టింది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు.
కాంగ్రెస్ వెనక్కి తగ్గింది!
కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల్లో భాగంగా కులగణన ఒక ప్రత్యేక కుల లెక్కల షెడ్యూల్‌ను తయారుచేసి లెక్కలు తీయించారు. కానీ శుద్రాతీత అగ్రకులాల్లో (బ్రాహ్మణ, బనియా, క్షత్రియ, కాయస్థ, ఖత్రి కులాల వారి నుండి) వ్యతిరేకత రావడం వల్ల ఆ లెక్కలు బయట పెట్టకుండా ఆపేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మేధావి వర్గమంతా ఈ ఐదు కులాల వారే! 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కులజనాభా లెక్కలు కావాలని కాంగ్రెస్ ఓట్ల శాతం పెంచే ప్రయత్నం చేశారు. కానీ రిజర్వేషన్ బయట ఉన్న కులాల నుండి అన్ని పార్టీల్లో వ్యతిరేకత వస్తోంది.
ఈ కారణం వల్లనే కర్ణాటకలో కులాల లెక్కలు తీసి కూడా బయట పెట్టకుండా ఆపేశారు. కారణం బ్రాహ్మణ, బనియా, లింగాయత్, వక్కళి కులాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక. వీటన్నిటికి మూలమేమంటే చాలా చిన్న శూద్రేతర కులాలు చాలా పెద్ద మొత్తంగా ఉద్యోగాలు, ప్రభుత్వరంగ ఐఐటీ, ఐఐఎమ్‌లు, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నాయి. వీరి కులాల సంఖ్య జనాభా లెక్కల ద్వారా బయటికి వస్తే వారు దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని నడుపడానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటు వస్తుంది.
మొత్తం మీద శూద్రుల వాటా తక్కువే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, కమ్మలు, వెలమలకు కూడా అర్థం కాని అంశమేమంటే... ఢిల్లీ అధికారంలోగానీ, బ్యూరాక్రసీలోగానీ; గవర్నర్లు, అంబాసిడర్ల వంటి పదవుల్లో కానీ వీరి వాటా చాలా తక్కువ అనేది. రిజర్వేషన్ బయట ఉన్న మొత్తం శూద్ర అగ్ర కులాలకు వారి జనాభా లెక్కల ప్రకారం చూస్తే కేంద్ర అధికారంలో కానీ, మోనోపలీ క్యాపిటల్‌లో కానీ అతి కొద్దిపాటి వాటా మాత్రమే ఉన్నది. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో కాని, ప్రధానమంత్రి సెక్రటేరియట్‌లో కాని వారు ఎవ్వరూ కనబడరు. వారు కేవలం రాష్ట్ర అధికారం కోసమే ఆరాటపడుతున్నారు.
కానీ కేంద్రంలో మొత్తం శూద్రుల వాటా చాలా చిన్నదిగా ఉంది. కుల గణన... రెడ్డి, కమ్మ, వెలమ వంటి కులాలు జాతీయ స్థాయిలో వాటా పొందడానికి పనికొస్తుంది. ఇదే పరిస్థితి కర్ణాటకలోని లింగాయత్, వక్కళి కులస్థులది కూడా! వాళ్ళు రాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్‌లో భాగస్వాములే కానీ కులలెక్కలను వ్యతిరేకిస్తున్నారు. కేరళలో నాయనార్లు కుల లెక్కలే కాదు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తాము శూద్రులం కాదు క్షత్రియులమని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఆ చిన్న రాష్ట్రంపై పెత్తనం చలాయించడానికి పనికొస్తుంది. కానీ కేంద్రంలో నాయనార్లకు కూడా వాటా లేదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న శూద్ర పై కులాలు కులగణనను ఎందుకు స్వాగతించాలో ఆలోచించడం లేదు.
1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులాల లెక్కలు తీసి ఉండకపోతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు తామే దేశంలో అత్యధికులం అని నమ్మించేవారు. అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు అలానే నమ్మించారు. దేశం మొత్తం మీద బ్రిటిష్ పాలక వ్యవస్థ (అడ్మినిస్ట్రేషన్)లో వాళ్ళే ఉండేవారు. జనాభా రీత్యా కూడా ‘మేమే అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నామ’ని నమ్మించేవారు. ఆచరణలో కులం ఉన్నప్పుడు ఆ కులం సంఖ్య ఎంత ఉందో తెలిస్తే తప్ప కులాల అభివృద్ధి, దేశం అభివృద్ధి జరిగే ప్రణాళికలు తయారు చెయ్యడం సాధ్యం కాదు.
తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ ఉద్యోగాలు, విద్యారంగంలో సీట్లు సంపాదించే కులాలు, కులం లెక్కలు తియ్యొద్దని తప్పకుండా వాదిస్తాయి. ఈ ఆలోచనా ధోరణి నుండే రిజర్వేషన్లలో 50 శాతానికి మించి ఉండకూడదని వాదించాయి. సుప్రీంకోర్టులో తమకు అనుకూల జడ్జిమెంటును సంపాదించాయి. దానికి మెరిట్ అనే ఒక వాదనను ముందు పెట్టాయి. అసలు కులాన్ని ఈ దేశానికి బ్రిటిష్ వలసవాదులు తెచ్చారని వాదించాయి.
ఉత్పత్తి కులాలు ముఖ్యంగా శూద్రులు ఢిల్లీలో పాలకులైతే తమ చరిత్ర తలకిందులవుతుందని భావించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపకులాల వాటా జడ్జిమెంట్ చరిత్ర మలుపును మరో మెట్టు ఎక్కించేదనే అంశంలో సందేహం లేదు. ఇప్పుడు అన్ని శూద్ర కులాలు, దళితులు, ఆదివాసులు ఐక్యంగా కుల జనాభా లెక్కలు చెయ్యాలని పోరాడటమే వారి భవిష్యత్తుకు మార్గం.
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment