సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అది శాసన, కార్యనిర్వహక నిర్ణయమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది.
ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్‌లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు.
ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు.
రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment